ఖాళీ రైళ్లలో బెర్తులకు రాయితీ ఇస్తారు!


విమాన యాన సంస్థలు, హోటళ్ల మాదిరిగా పూర్తిగా రద్దీ లేని రైళ్లలో బెర్తులకు రాయితీ వర్తింపజేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. సరళతర ధరల (ఫ్లెక్సీ ఫేర్‌) పద్ధతిని సమూలంగా మార్చబోతున్నట్లు సంకేతాలిచ్చారు. దీనిలో ధరలు పెరగకూడదనే ఇంతవరకు అనుకున్నా, ఇప్పుడు మరో అడుగు ముందుకెళ్లి కొన్నింటిలో రాయితీ కూడా ఇచ్చే అవకాశాన్ని కూడా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. శనివారం దిల్లీలో సీనియర్‌ అధికారులతో సమావేశమైన మంత్రి విలేకరులతో మాట్లాడారు. సరళతర విధానమంటే టికెట్‌ ధర పెంచడం మాత్రమే కాదన్నారు. విమానాశ్రయానికి విమానం వచ్చాక కేవలం అర్థగంటలో ప్రయాణానికి సిద్ధం చేస్తున్న రీతిలోనే రైళ్లనూ చేయగలిగితే వాటిని మరింత సమర్థంగా వాడుకోవచ్చని గోయల్‌ చెప్పారు. ముందుగా దిల్లీ-ముంబయి రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో దీనికి శ్రీకారం చుడతామన్నారు. అన్ని స్టేషన్లు, దూరప్రాంత రైళ్లలో నిఘా కెమేరాలను అమర్చి వైఫైతో అనుసంధానం చేస్తామని చెప్పారు. నమోదయ్యే దృశ్యాలను ఎప్పటికప్పుడు భద్రత విభాగానికి, స్థానిక పోలీసు ఠాణాలకు, డివిజనల్‌/ జోనల్‌ ప్రధాన కార్యాలయాలకు పంపించే ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ ప్రతిపాదనను మంత్రి మండలికి పంపించినట్లు తెలిపారు. నిర్భయ నిధులతో 900 స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటుకు హోం శాఖ ముందుకు వచ్చిందన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ, వారి అక్రమ రవాణాను అడ్డుకోవడం లక్ష్యంగా 2018లో సేవలందిస్తామని రైల్వేమంత్రి తెలిపారు.

ముఖ్యాంశాలు