రైల్వే ఉద్యోగాల నియామక ప్రక్రియలో మార్పులు

రైల్వే ఉద్యోగ నియామక ప్రక్రియను రెండు సంవత్సరాలనుంచి ఆరు నెలల స్థాయికి తగ్గించాలని ఇపుడు రైల్వే శాఖ యోచిస్తున్నది. ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేసిన దగ్గర నుంచి ఉద్యోగం చేతికి వచ్చేంత వరకు నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇకపై అటువంటి సమస్య ఉండకుండా ఉండేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. రైల్వే నియామక ప్రక్రియను రెండేళ్ల పాటు కొనసాగించకుండా.. ఇక నుంచి ఆరునెలల్లోనే ఈ ప్రక్రియను ముగించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. రైల్వే బోర్డు ఛైర్మన్ అశ్వని లోహాని ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్స్ సమావేశం జరిగింది. రైల్వేలో భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉందనే విషయాన్ని జోనల్ హెడ్స్ లోహాని దృష్టికి తీసుకెళ్లారు. ‘రైల్వే ఉద్యోగాల నియామక ప్రక్రియ చాలా కాలం ఉంటుంది. దరఖాస్తు తీసుకున్న దగ్గర నుంచి ఉద్యోగం రావడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. దీంతో కొంతమంది అభ్యర్థులు వేరే ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం, నియాయక ప్రక్రియను వేగంగా పూర్తిచేస్తే బాగుంటుంది’ అని నార్త్ఈస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఈ సమావేశంలో ప్రతిపాదనను తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన లోహానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) తమ నియామక ప్రక్రియను ఆరు నెలల్లోపు పూర్తి చేయాల్సిందిగా సూచించారు. దీనిపై వాళ్ల అభిప్రాయాన్ని డిసెంబరు 20లోపు తెలియజేయాల్సిందిగా కోరారు. డిసెంబరు 2016 నాటికి రైల్వేలో 1.3మిలియన్ల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇంకా గ్రూప్ ‘సి’, ‘డి’ విభాగంలో 2,25,823 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. రైల్వే నివేదిక ప్రకారం భద్రతా విభాగంలో 1,22,911 ఖాళీలు ఉండగా.. మిగతా విభాగాల్లో 17,464 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా డ్రైవర్లు, గార్డులు, గ్యాంగ్‌మెన్, ఇతర టెక్నికల్ స్టాఫ్ ఖాళీలే ఉన్నట్లు సమాచారం.