సన్నీలియోన్ కార్యక్రమానికి నో పర్మిషన్


నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బెంగళూరులోని మాన్యత టెక్‌పార్కులో ‘సన్నీ లియోన్‌ నైట్స్‌’ పేరిట ఏర్పాటు చేయదలచిన "సాంస్కృతిక" కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేదని నగర పోలీసు కమిషనర్‌ టి.సునీల్‌ కుమార్‌ స్పష్టీకరించారు. సన్నీ లియోన్‌ గతంలో కేరళకు వెళ్లిన సమయంలో అభిమానులు ఆమెను చుట్టుముట్టి, వాహన సంచారానికి ఆటంకం కలిగించారని ఆయన గుర్తు చేశారు. అనుమతులు లేకుండా నగరంలో ఎటువంటి మనోరంజన కార్యక్రమాలను నిర్వహించేందుకు అవకాశం లేదన్నారు. శనివారం తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. పోలీసుల అనుమతి లేకుండా సన్నీ నైట్స్‌ను నిర్వహిస్తే నిర్వాహకులను బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించారు. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు సన్నీ లియోన్‌ ఆట, పాటలతో సన్నీ నైట్స్‌ను నిర్వహిస్తున్నామని టైమ్స్‌ ఎంటర్‌టెయిన్‌ మెంట్‌ సంస్థ ప్రతినిధులు ప్రచారం చేసుకున్నారు. సన్నీ నైట్స్‌కు రూ.ఐదు వేల నుంచి రూ.పది వేల మధ్య టిక్కెట్టు ధరల్ని నిర్ణయించారు. కొత్త సంవత్సరాన్ని అశ్లీల నృత్యాలతో ఆహ్వానించటం, కన్నడ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపిస్తూ కర్ణాటక రక్షణ వేదికె కార్యకర్తలు నగరంలో ఇప్పటికే ఆందోళనలు, ధర్నాలను నిర్వహించారు. అయితే నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, కార్యక్రమ నిర్వహణకు అనుమతి పొందేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.