గుజరాత్ లో బిజెపి జయ పరంపర .. ఆరోసారి విజయహాసం


గుజరాత్‌లో భాజపా విజయ పరంపర ఏకంగా వరుసగా ఆరో ఎన్నికల్లో కూడా కొనసాగింది. ఈ రాష్ట్రంలో బిజెపి ఆరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. సోమవారం వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో భాజపా ఘనవిజయం సాధించింది. దీంతో పశ్చిమ్‌బంగాలో వామపక్ష కూటమి నెలకొల్పిన రికార్డుకు భాజపా అడుగు దూరంలో నిలిచింది. పశ్చిమ్‌బంగా రాష్ట్రంలో వామపక్ష కూటమి సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉంది. 1977 జనవరిలో సీపీఎం, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ, మార్క్సిస్ట్‌ ఫార్వర్డ్‌ బ్లాక్‌, రివల్యూషనరీ కమ్యూనిస్ట్‌పార్టీ ఆఫ్‌ ఇండియా తదితర పార్టీలు కలిసి వామపక్ష కూటమిగా ఏర్పడ్డాయి. 1977 జూన్‌లో జరిగిన పశ్చిమ్‌బంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి పోటీ చేసి ఘనవిజయం సాధించింది. ఇక అప్పటి నుంచి ఈ కూటమి వెనుదిరిగి చూడలేదు. వరుసగా ఏడుసార్లు రాష్ట్రంలో అధికారం కొనసాగించింది. జ్యోతిబసు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించగా, మరో రెండు సార్లు బుద్ధదేవ్‌ భట్టాఛార్య సీఎంగా పనిచేశారు. 34ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి పరాజయం పొందింది. ఇప్పుడు గుజరాత్‌ కూడా బంగా బాటలోనే ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ వరుసగా ఆరోసారి జయకేతనం ఎగురవేసింది. ఇప్పటికే 22ఏళ్ల పాటు అధికార పీఠంలో కొనసాగుతున్న భాజపా మరో ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించనుంది. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తొలిసారి విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో భాజపాకు 121 సీట్లు వచ్చాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో భాజపా వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత మూడేళ్లకు 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో భాజపా 117 స్థానాలు దక్కించుకుని రెండో సారి అధికారాన్ని కైవసం చేసుకుంది. కేశూభాయ్‌ పటేల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కచ్‌ భూకంపం అనంతరం సహాయకచర్యలలో అలసత్వం ప్రదర్శించారన్న ఆరోపణలు రావడంతో నరేంద్రమోదీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గోద్రా అల్లర్ల నేపథ్యంలో 2002లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లోనూ భాజపా 127 స్థానాలతో ఘనవిజయం సాధించింది. నరేంద్రమోదీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఐదేళ్లకు 2012లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ భాజపా గెలుపొందింది. ఆ ఎన్నికల్లో భాజపాకు 116 సీట్లు వచ్చాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ భాజపా జయకేతనం ఎగురవేసి వరుసగా ఆరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో కూడా భాజపా గెలిస్తే బెంగాల్‌లో వామపక్ష కూటమి నెలకొల్పిన రికార్డును సమం చేస్తుంది.

ముఖ్యాంశాలు