జో జీతా ఓహీ సికిందర్!


Narendra modi

తమ అపార పాండితీ ప్రకర్ష తో.. అద్వితీయ విశ్లేషణా సామర్థ్యంతో జనాల మతులు చెదరగొడుతున్న కొందరు మీడియా మేధావులకు, సోషల్ మీడియా దార్శనికులకు, రాజకీయ పండితులకు శత సహస్ర కోటి జోహార్లు! నేను ఎక్కడా వినని, కనని కొత్త సత్యాలు ఈ మధ్య వింటున్నాను... ఓడిపోయిన పార్టీలు చెప్పాల్సిన సాకులు, డిపాజిట్లు గల్లంతయిన అభ్యర్థులు చెప్పాల్సిన కబుర్లను ఈ మధ్య వీరు వల్లె వేస్తున్నారు ! ఎబ్బెబ్బే... ఎట్టెట్టా..! మెజారిటీ వచ్చినా సరే గతంకంటే సీట్లు తగ్గితే నైతికంగా ఓడిపోయినట్టా... ! గతం కంటే సీట్లు పెరిగాయి కాబట్టి ప్రతిపక్షానికే అగ్రపూజ చేస్తారా? ఏ రాజ్యాంగంలో ఉంది బాబూ ఈ వింత? సరే అలాగే ఒప్పేసుకుంటాం! గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రాలో పాపం ఒక్కటంటే ఒక్క శాతం ఓట్ల తేడాతో వైకాపా ఓడిపోయి.. తెదేపా గెలిచింది! oక్క శాతమే కదా అని నాలుగు మంత్రి పదవులు ఆ పార్టీకి ఇచ్చారా? ఏవైనా ప్రత్యేక అధికారాలున్నాయా? ఆ మధ్య ఓ ఎన్నికల్లో తొమ్మిది ఓట్ల తేడాతో ఓ ఎంపీ గారు గెలిచారు... మరో ఎంపీ గారేమో ఐదు లక్షల ఓట్ల తేడాతో గెలిచారు!! పార్లమెంట్లో ఇద్దరికీ ఏమైనా తేడా ఉందా? రాజమండ్రిలో ఓసారి కార్పొరేటర్ ఎన్నికల్లో ఇద్దరికీ ఒకే సంఖ్యలో ఓట్లు వస్తే టాస్ వేసి విజేతని నిర్ణయించారు! నాకు కూడా అన్ని ఓట్లు వచ్చాయి కదా అని మరో అభ్యర్థి నేనూ కార్పొరేటర్ నే అంటే ఒప్పుకుంటారా? వంద సీట్లు ఉన్న చోట, రెండు పార్టీలు పోటీ పడితే 51 సీట్లు వస్తే చాలు.. వాళ్లదే ప్రభుత్వం. మెజారిటీ ఎక్కువ రాలేదని చిన్న కుర్చీ వేయరు.. కొన్ని లైటు కార్లు తీసుకెళ్లి పక్క పార్టీ వాడికీ ఇవ్వరు! 99 సీట్లు గెలిచాడు కదా అని ఇంకో ఐదేళ్లు అధికారం రాసీ ఇవ్వరు! పాలనలో తేడా చేస్తే ఐదేళ్లకి ఓసారి తీసుకెళ్లి జనం కుప్ప తొట్టెలో పడేస్తారని అందరికీ తెలిసిందే.. అలాంటిది గుజరాత్ లో జనం ఆరోసారి ఎన్నికల్లో కూడా బిజెపికి మళ్ళీ అధికారం కట్టబెడితే... ఈ వక్ర మేధావులకు మాత్రం ఆ ప్రజల్లో బిజెపి పై ఘోరమైన నిరసన జ్వాలలు కనిపించాయా? కాంగ్రెస్ ని ఇంకోసారి చీకొడితే.. వారి కళ్ళలో ఆ పార్టీపట్ల అవ్యాజమైన ప్రేమానురాగాలు గోచరించాయా? ఇవి విశ్లేషణలా.. విషపు రాతలా? మీడియా ఇలాంటి అవకతవక రాతలు రాయబట్టే ప్రజాస్వామ్యం అంగటి సరుగ్గా మారిపోయింది. ఎక్కువ సీట్లు వస్తేనే అధికార పార్టీ గొప్ప అని .. ప్రతిపక్షం కాస్త బలంగా ఉంటే ఆ పార్టీయే గెలిచిందని వక్ర భాష్యాలు చెబుతూ ఇలాంటి పెడసరం రాతలు రాయడం వల్లనే ఇవాళ దేశంలో చాలాచోట్ల అసలు ప్రతిపక్షమే లేకుండా చేసే బేరసారాలు, కొనుగోళ్లు సాగుతున్నాయి. అసలు ఎన్నికల్లో గెలుపంటే ప్రతిపక్షం అడ్రస్ లేకుండా పోవడమా? అలా జరిగితే అధికార పార్టీ బలంగా ఉండవచ్చు గానీ ప్రజాస్వామ్యం బలంగా ఉండదు... జనం వాణిని బలంగా వినిపించే వ్యవస్థ లేకుండా పోతుంది! ఈ చిన్న ఇంగితం కూడా లేకుండా పిచ్చి రాతలు రాయకండి ఇసుగేస్తోంది! ప్రధాని పనితీరుపై ఈ ఎన్నికలు ఒక రెఫరెండం గా జరిగాయి. ఎందుకంటే అన్నిచోట్లా ప్రచారాస్త్రాలు డీ మోనిటైజేషన్, జీఎస్టీ వగైరాలే! ఇందులో జనం మోదీ పక్షాన నిలబడ్డారు! ఇది సత్యం! సపోజ్ రేపటి సార్వత్రిక ఎన్నికల్లో గతంలో కంటే మోదీ సర్కారుకి సీట్లు తగ్గి అధికారం వచ్చిందనుకోండి....అప్పుడూ ఈయనే పీఎం గా ఉంటారు! ఇదే పనితీరు ఉంటుంది! అన్నీ ఇలాగే ఉంటాయి.. సీట్లు లెక్క ఒక్కటే మారుతుంది! అంచేత పిచ్చిరాతలు మానండి వెంగళయ్యలూ... ఒక్క సీటు ఎక్కువ వచ్చినా సాంకేతికంగా ఐదేళ్ళూ వాళ్లదే అధికారం... ఒక్క ఓటు ఎక్కువొచ్చినా వాడే విజేత! చివరిగా ఒక్కటే మాట.. జో జీతా ఓహీ సికిందర్! అది నరేంద్ర మోదీ!