ప్రతిపక్షాలు కళ్ళు తెరవాలి .. అరిగిన రికార్డులు ఆపాలి

అరిగిపోయిన రికార్డులు ఇక మూలన పారేయండి! నోట్ల రద్దు, జీఎస్టీ .. ఇవేవీ ఇక ఎంతమాత్రం విమర్శించే అంశాలు కావు! వీటికి బహుళ జనామోదం ఉందని ఇప్పటికే పలు రాష్ట్రాల ఎన్నికల్లో రుజువైపోయింది. సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, నిజాయితీపరులు ఈ చర్యల వలన ఇబ్బంది పడ్డారని, దేశం నష్టపోయిందని, అభివృద్ధి కుంటుపడిందని ఇంకా కువిమర్శలు చేస్తూ పోతే జనం ఆమోదించే పరిస్థితి లేదని ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి. పైగా వీటి ప్రయోజనాలు కూడా కనిపిస్తున్నాయి.. రాబోయే రోజుల్లో ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పటికీ ఇంకా వీటినే పట్టుకుని ఎవరైనా విమర్శిస్తున్నారంటే అర్థం.. పెద్దనోట్ల రద్దు జరిగిన వెంటనే వాళ్ళ అక్రమార్జన కాస్తా కాకెత్తుకు పోయిందనే జనం అర్థం చేసుకుంటారు. 2019 లోక్ సభ ఎన్నికల లోగా 2018 లో జరిగే సెమి ఫైనల్స్ అంటే ఛత్తీస్ ఘర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ప్రతిపక్షాలు కొత్త ఆరోపణలు వెదుక్కుంటే మంచిది. మత తత్వం తో దేశాన్ని బిజెపి విభజిస్తున్నదని మళ్ళీ తప్పుడు కూతలు కూసినా... దొంగ హిందూ వేషాలు వేసినా కూడా ఎదురు దెబ్బలు తప్పవు! ఇంకేమిటయ్యా దారి అంటే.. మోదీ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుందేమో అని కాసుక్కూర్చోవడం... లేదా బుర్రకి పదును పెట్టి కొత్త ఆరోపణలు వెదుక్కోవడం!