మీరు పెట్టిన చిచ్చు... మేం ఆర్పుతున్నాం


దేశంలో భాజపా విద్వేషాలను రెచ్చగొడుతోందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల స్వీకారం సందర్భంగా రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేసారు. బెంగళూరులో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో వీటిపై రాజ్‌నాథ్‌ స్పందిస్తూ కాంగ్రెస్‌ రాజేసిన చిచ్చును తమ పార్టీ ఆర్పుతోందని సమాధానం చెప్పారు. ‘కాంగ్రెస్‌ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చారు. అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నా. దేశంలో భాజపా విద్వేషాలను రాజేస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే, దేశంలో మత ఘర్షణలకు, ఉగ్రవాదానికి, నక్సలిజానికి, కశ్మీర్‌లో అల్లర్లకు కారణం ఎవరు?’ అని రాజ్ నాథ్ ప్రశ్నించారు. దేశాన్ని నడపగల సత్తా కేవలం భాజపాకు మాత్రమే ఉందని రాజ్‌నాథ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేయనున్నాయని తెలిపారు. ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ ఇదే విషయాన్ని స్పష్టంచేశాయన్నారు.