అధికారం ప్రజల కోసం... ఈ దేహం దేశం కోసం


పార్లమెంట్‌లోని లైబ్రరీ భవనంలో భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌ హాజరయ్యారు. ప్రధాని మోదీ హాల్‌లోకి రాగానే పార్టీ నేతలంతా లేచి నిలబడి జయజయ ధ్వానాలు చేసారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం నేపథ్యంలో మోదీ నాయకత్వాన్ని అభినందించారు. అనంతరం ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై ఈ దేహం దేశం కోస‌మే అని ఉద్విగ్నంగా చెప్పారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. 19 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉండడం గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఇందిరాగాంధీ హయాంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ 18 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందన్నారు. అధికారమనేది ప్రజల కోసమేనని, వారిని సంతోష పెట్టడానికే అని ఆయన అభిప్రాయపడ్డారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో ప్రధాని ప్రసంగాన్ని వివరించారు. ప్రతిపక్షాలు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని మోదీ చెప్పారన్నారు. గుజరాత్‌, హిమాచల్‌ ముఖ్యమంత్రుల ఎంపిక అజెండాపై కూడా సమావేశంలో చర్చించారు.

ముఖ్యాంశాలు