మహారాష్ట్రలో ఇక 24x7 వ్యాపారాలు


మహారాష్ట్ర రాష్ట్రంలో ఇక నుంచి అన్ని దుకాణాలు, మాల్స్‌ 24×7 (నిరంతరాయంగా) పనిచేయనున్నాయి. ఈ మేరకు 2017 షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం(ఎంఎస్‌ఈ) లో రాష్ట్ర ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. బుధవారం నుంచి రాష్ట్రంలో అన్ని దుకాణాలు, మాల్స్‌ రాత్రివేళ కూడా పనిచేస్తాయి. ఉద్యోగులు మూడు షిఫ్ట్‌లలో పనిచేస్తారు. హోటల్స్‌, రెస్టారెంట్లు, షాప్స్‌, మాల్స్‌ ఎదుట ఈ నోటిఫికేషన్‌ను అతికించారు. ఈ 24×7 నిబంధన నుంచి మద్యం దుకాణాలు, పబ్బులు, డిస్కోటెక్స్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంభాజీ నిలంగేకర్‌ పాటిల్‌ తెలిపారు. మూడు షిఫ్టులలో ఉద్యోగులు పని చేయడం వలన నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ చట్ట సవరణ ప్రకారం కార్మికులందరికీ వీక్లీ ఆఫ్‌ తప్పనిసరి చేసారు. ఎంఎస్‌ఈ చట్టం కింద ఇక నుంచి చిన్న దుకాణాలు పెట్టుకునే వ్యాపారులు లైసెన్సు కోసం అధికారుల వెంట తిరగాల్సిన అవసరం ఉండదని, నేరుగా దుకాణాలకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. కావాలని అనుకుంటే మహిళలు కూడా రాత్రి షిఫ్ట్‌లో పనిచేయవచ్చని, రాత్రి 9.30 నుంచి ఉదయం 7గంటల షిఫ్ట్‌లో మహిళలకు ఈ చట్టం అవకాశం కల్పించింది. పది మంది కన్నా తక్కువ ఉద్యోగులు ఉన్న 12 లక్షల దుకాణాదారులు తమకు ఇష్టమొచ్చిన విధంగా షిఫ్ట్‌ల సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. ఈ చట్ట సవరణ వల్ల కార్మికులు గుర్తింపు కార్డులు, వీక్లీ ఆఫ్‌, కనీస వేతనం పొందవచ్చుఅని ప్రభుత్వం తెలిపింది.

ముఖ్యాంశాలు