కరుణను కలిసిన కనిమొళి, రాజా


2జీ స్పెక్ట్రం కేసులో నిర్దోషులుగా బయటపడిన కేంద్ర మాజీ మంత్రి ఏ. రాజా, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి శనివారం డీఎంకే అధినేత కరుణానిధిని కలిశారు. సీబీఐ ప్రత్యేక కోర్టు రెండు రోజుల క్రితం వారిని నిర్దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. తీర్పు నేపథ్యంలో చెన్నైకి వచ్చిన కనిమొళి, రాజా ర్యాలీగా వెళ్లి కరుణానిధిని కలిశారు. వీరికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెట్‌ స్టాలిన్‌, సీనియర్ నాయకులతో సహా వేలమంది కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. యూపీఏ హయాంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణం లో రాజా, కనిమొళితో సహా మొత్తం 17మంది మీద సీబీఐ అభియోగాలు మోపబడ్డా యి. అయితే తగిన అధరాలు చూపడంలో సిబిఐ విఫలం కావడంతో కేసును ప్రత్యేక కోర్టు కొట్టేసింది. ఈ కేసులో రాజా సుమారు 15 నెలలు, కరుణానిధి కుమారై కనిమొళి 7నెలలు జైల్లో ఉన్నారు. ఈ కేసు వల్లనే కరుణానిధి పార్టీ డీఎంకే గత ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఇప్పుడు డీఎంకేకు అనుకూలంగా తీర్పు రావడంతో పార్టీ శ్రేణులు ఆనందంతో ఎగసిపడుతున్నాయి. కరుణానిధి తీవ్ర అనారోగ్యం తో ఉన్నందున ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్‌ ప్రస్తుతం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. క్లీన్ చిట్ రావడంతో కనిమొళి ప్రత్యక్ష రాజకీయాలలో చురుగ్గా పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది.