ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ హవా


అది తమిళ నాడి.. ఎవరికీ అర్థం కాదు. జయలలిత పై అపారమైన సింపతీ ఉంది.. అయితే అది ఆమెను పొట్టనబెట్టుకున్నారని అందరూ భావిస్తున్న శశికళ వర్గానికి వరంగా మారడమే తమిళ వైచిత్రి. ఆర్కేనగర్‌ ఉపఎన్నికలో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్‌ భారీ మెజార్టీ దిశగా దూసుకెళుతున్నారు. మొత్తం 13 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 64,984 ఓట్లతో ఆయన అందరికంటే ముందంజంలో ఉన్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌ 33,446 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. డీఎంకే అభ్యర్థి మురుదు గణేష్‌ 17,145 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. 13వ రౌండ్‌ పూర్తయ్యేసరికి దినకరన్‌ ఓట్లను గమనిస్తే ఆయన సమీప ప్రత్యర్థి కంటే దాదాపు రెట్టింపు ఓట్లతో ముందున్నారు. మరో 6 రౌండ్ల లెక్కింపు జరగాల్సి ఉంది. ఇప్పటికే విజయం ఖరారు కావడంతో శశికళ వర్గం సంబరాల్లో మునిగి తేలుతోంది. విజయాన్ని పురస్కరించుకుని అమ్మ సమాధి వద్ద దినకరన్‌ నివాళులర్పించారు. ఆర్కేనగర్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా భాజపాకు కనీసం నోటాకు వచ్చిన ఓట్లలో మూడో వంతు కూడా రాకపోవడం విశేషం. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి నోటాకు 1732 ఓట్లు రాగా, భాజపాకు 519 ఓట్లు వచ్చాయి. మధురై ఎయిర్‌పోర్ట్‌లో దినకరన్‌ మీడియాతో మాట్లాడారు. ఇది 1.5 కోట్ల కార్యకర్తల విజయమని పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం మూడు నెలల్లో పడిపోతుందని జోస్యం చెప్పారు. అమ్మకు నిజమైన వారసుడిని తానేనని ప్రకటించుకున్నారు. పార్టీ గుర్తు, పార్టీ పేరు ఎవరికి వెళ్లిందనేది ఇక్కడ విషయం కాదని, కార్యకర్తలు తమతోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు