మోదీ దేశద్రోహి అంటూ ఉండవల్లి తీవ్ర ఆరోపణలు


జీఎస్టీ, డీ మోనిటైజేషన్ కంటే కూడా అత్యంత ప్రమాదకరం ఎఫ్ ఆర్ డి ఐ బిల్లు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఆదివారం రాజమహేంద్రవరం లో జరిగిన మీడియా సమావేశంలో విమర్శించారు. దేశంలో అంబానీ, అదానీ, విజయ్ మాల్యా వంటి పారిశ్రామిక, వాణిజ్య వేత్తల అప్పుల భారం కారణంగా బ్యాంకులు దివాళా తీసేస్తే బెయిల్ ఇన్ చేసేసి జనం నుంచి ఆ డబ్బులను ప్రభుత్వం కోసేస్తుందని ఆయన నమ్మకంగా చెప్పారు. ఇది బ్యాంకు ల జాతీయీకరణ స్ఫూర్తికి విరుద్ధం అన్నారాయన. బ్యాంకుల జాతీయీకరణ ద్వారా ఇంతవరకు బెయిల్ అవుట్ చేసి డిపాజిటర్లను కాపాడడం జరిగిందని, అయితే ఇప్పుడు మోదీ పెట్టిన ఎఫ్ ఆ ర్ డి ఐ బిల్లు దేశాన్ని సర్వనాశనం చేసేస్తుందని, డిపాజిటర్లను ముంచేస్తుందని మండిపడ్డారు. ఇది నరేంద్ర మోదీ, బిజెపి చేస్తున్న దేశ ద్రోహం అని తీవ్ర ఆరోపణ చేసారు. ఇది మానవ ప్రయత్నంతో సృష్టిస్తున్న మహోత్పాతం అన్నారు. మేధావిగా పిలువబడే ఉండవల్లి మాటలు నిజమా.. ప్రజల్లో మేధావిగా పేరున్న ఉండవల్లి ఏదైనా అనుకుంటే గట్టిగా ప్రచారం చేయడంలో, తన వాగ్ధాటితో అందరినీ నమ్మించడంలో దిట్ట. ఆయన ప్రసంగాలకు ఆ పవరుంది. లోగడ ఆయన ఈనాడు సంస్థకి చెందిన మార్గదర్శి పై ఇలాగే యుద్ధం చేసి ఎంత చేసారో, ఏమి సాధించారో అందరికీ తెలుసు. ఇప్పుడాయన ఎఫ్ డి ఆర్ ఐ పై చేస్తున్న ఘాటు వ్యాఖ్యలు, తీవ్ర ఆరోపణలకు సమాధానం చెప్పుకోవలసిన బాధ్యత బిజెపి నాయకులది. వారొక మాట, ఈయనొక మాట చెప్పి పోటీ పడి జనాల్ని మాయ చేయడం కాకుండా అసలైన నిజం ఏదో అది చెప్పి జనాన్ని, బ్యాంకుల్ని కాపాడవలసిన బాధ్యత ఇద్దరిపైనా ఉంది. కచ్చితంగా ఉండవల్లి తాజా విశ్లేషణ ప్రజల్లో తీవ్ర భయోత్పాతాలకు దారి తీస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే అనుమానాల్లో ఉన్న జనం ఉండవల్లి మాటలకు ఇంకా బెదిరి పోయి బ్యాంకు డిపాజిట్లు వెనక్కి తీసుకునే ప్రమాదమూ లేకపోలేదు. (ఇప్పటికే ఇది కొన్ని చోట్ల జరుగుతున్నది) అందుచేత ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదు. ఇంకా దారుణం ఏమిటంటే స్విస్ బ్యాంకు లలో డబ్బు దాచుకున్న అక్రమార్కుల వివరాలు అడిగితే ఇచ్చేసే చట్టం ఎప్పుడో 2011 లోనే ఉందని ఉండవల్లి చెబుతున్నారు. ఆ ఒప్పందం ఆధారంగా అడిగితే మన దేశం నుంచి స్విస్ లో డబ్బు దాచిన వారి వివరాలు ఇచ్చేసి ఉండేవారని అన్నారు. అలా ఆ వివరాలు తేలేదు కాబట్టి దేశంలో రాజకీయ నాయకులు ఎవరూ స్విస్ లో డబ్బులు దాచలేదని, నాయకులంతా నిజాయితీ పరులే అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్య నిజమైతే.. ఈ చట్టం ఉండి కూడా ఉపయోగించకపోతే బిజెపి ప్రభుత్వం చేసింది మహా తప్పిదమే కదా. స్విస్ బ్యాంకు నుంచి నల్ల డబ్బు తెచ్చి దేశంలోని పేదలకు ఇవ్వకపోగా, ఇక్కడి పేదల డబ్బుని బ్యాంకు ల ద్వారా దోపిడీ చేయించే పెద్ద కుట్రకు మోదీ సర్కారు తెర లేపిందని ఉండవల్లి ధ్వజమెత్తారు. ఉండవల్లి చేసిన ఈ రెండు ఆరోపణలు కూడా అత్యంత తీవ్రమైనవి. వాటిని నమ్మేవారు ఉన్నారు. ఇప్పుడివి అబద్ధం అని రుజువు చేసుకోవలసిన బాధ్యత బిజెపి నాయకులది మాత్రమే అని, అది కూడా సత్వరం జరగాలని పలువురు కోరుకుంటున్నారు. పదేళ్లు ఎంపీగా చేసిన వ్యక్తి, పైగా సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న ఉండవల్లి బాధ్యతరహిత ఆరోపణలు చేసారని అనుకోలేము. ఒకవేళ ఆయన ఆ పని చేస్తే బిజెపి వాటిని సహేతుకంగా ఖండించాలి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం