పాక్ లో జాదవ్ ను కలసిన కుటుంబ సభ్యులు


పాకిస్థాన్‌లో మరణశిక్ష పడిన భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను ఆయన తల్లి, భార్య ఇవాళ కలుసుకున్నారు. సోమవారం ఉదయం ఇస్లామాబాద్‌ చేరుకున్న జాదవ్‌ కుటుంబసభ్యులు పాక్‌ విదేశీ వ్యవహారాల కార్యాలయంలో ఉంచిన జాదవ్ ను కలసి దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడారు. వారి వెంట భారత డిప్యూటీ హైకమిషనర్‌ జేపీ సింగ్‌ కూడా ఉన్నారు. మొదట ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయం చేరుకున్న జాదవ్‌ తల్లి, భార్య, అక్కడి నుంచి పాక్‌ విదేశాంగ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు 21 నెలల తర్వాత జాదవ్‌ ను తన కుటుంబసభ్యు లు చూడగలిగారు. పాక్‌ విదేశాంగ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మీడియా, భద్రతాసిబ్బంది మినహా ఇతర వాహనాలకు అనుమతినివ్వలేదు. కాగా జాదవ్‌ను కలిసేందుకు భారత అధికారులకు పాకిస్థాన్‌ కాన్సులర్‌ యాక్సెస్‌ ఇచ్చినట్లు ఈ ఉదయం వార్తలు వచ్చాయి. అయితే తమకు ఎలాంటి అనుమతులు రాలేదని భారత అధికారులు చెప్పారు. ఆ తర్వాత పాక్ కూడా ఇది కుటుంబసభ్యులతో సమావేశం మాత్రమేనని, కాన్సులర్‌ యాక్సెస్‌ ఇవ్వలేదని వెల్లడించింది. గూఢచర్యం ఆరోపణల కింద పాకిస్థాన్‌లోని ఓ సైనిక కోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో జాదవ్‌కు మరణశిక్ష వేసింది. భారత దేశం విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ న్యాయస్థానం ఈ శిక్షపై స్టే విధించింది. జాదవ్‌ ఇరాన్‌ గుండా బలూచిస్థాన్‌లోకి అక్రమంగా అడుగుపెట్టాడని పాక్‌ ఆరోపిస్తోంది. అయితే ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్ ను 2016 మార్చిలో అపహరించి పాక్‌కు తీసుకెళ్లారని భారత్‌ వాదన. చిరకాల పోరాటం, పెద్దఎత్తున దౌత్య యత్నాలు, అంతర్జాతీయ ఒత్తిడి కారణంగానే పాకిస్థాన్ జాదవ్ ను అతడి కుటుంబ సభ్యులకు చూపింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం