విదేశీ నిధుల వినియోగంపై కేంద్రం నిఘా


ఇతర దేశాల నుంచి వివిధ సేవల నిమిత్తం నిధులు సేకరించే స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, వ్యక్తులపై ఇకమీదట కేంద్రప్రభుత్వం నిఘా పెట్టనుంది. ఇక మీదట ఆయా సంస్థలు దేశంలోని ఏదో ఒక బ్యాంకులో తప్పనిసరిగా ఖాతాను తెరవాలని కేంద్ర హోంశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. విదేశాల నుంచి సమీకరించిన సంస్థల నిధుల వినియోగంలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో కేంద్రప్రభుత్వం ఎంపిక చేసిన 32 బ్యాంకుల్లో ఏదో ఒక బ్యాంకులో ఒక నెల లోపు ఈ సంస్థలు ఖాతా తెరవాలని కేంద్రం ఆదేశించింది. కేంద్రం సూచించిన బ్యాంకుల్లో ఓ విదేశీ బ్యాంకు కూడా ఉంది. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వచ్చే ఏడాది జవవరి 21 చివరి తేదీగా పేర్కొన్నారు. ఇప్పటికే బ్యాంకు ఖాతాలను తెరిచినా సంస్థలు వాటిని పీఎఫ్‌ఎంఎస్‌తో అనుసంధానం చేయాలని సూచించింది. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలకు స్వచ్ఛంద సంస్థలు ఆ నిధులను ఎంతమాత్రం వాడకూడదని కేంద్రం స్పష్టం చేసింది. విదేశాల నుంచి నిధులు పొందే ఎన్జీవోలు, కంపెనీలు, వ్యక్తులు బ్యాంకుల్లో ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ అకౌంట్లను తెరవాలని కేంద్ర హోమ్ శాఖ ఆదేశాల్లో పేర్కొంది. ఈ అకౌంట్లను కేంద్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(పీఎఫ్‌ఎంఎస్‌)తో కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేస్తుంది. నిధుల వినియోగంలో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోంశాఖ తన ప్రకటనలో తెలిపింది.

ముఖ్యాంశాలు