శరవేగంతో దూసుకుపోతున్న విమానయాన రంగం

పౌర విమానయాన రంగం భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు తగ్గట్లుగా ఎయిర్‌లైన్‌ సంస్థలు మార్కెట్‌ను విస్తరించే పనిలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా ప్రాంతీయ మార్గాలు లక్ష్యంగా సేవలను చేపట్టనున్నాయి. దాదాపు 900 విమానాలను అదనంగా ప్రారంభించనున్నాయి. ఒక్క ఇండిగో సంస్థ ఆధ్వర్యంలోనే 448 కొత్త విమానాలు రన్ వే. ఎక్కనున్నాయి. అధికారుల డేటా ప్రకారం బడ్జెట్‌ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్‌, గోఎయిర్‌, ఎయిర్‌ఏషియా వైమానిక సంస్థలన్నీ కూడా తమ విమానాల సంఖ్యను పెంచుకునేందుకు సిద్ధపడ్డాయి. ప్రస్తుతం ఇండిగో వద్ద 150 విమానాలున్నాయి. వచ్చే ఎనిమిది సంవత్సరాల్లో 399 ఏ320 విమానాలు, 49 ఏటీఆర్‌లు వెరసి 448 విమానాలను ఈ సంస్థ కొనుగోలు చేయనున్నది. స్పైస్‌జెట్‌ వద్ద 57 విమానాలుండగా, 2018-23 మధ్య 157 కొత్త విమానాలను సమకూర్చుకోనుంది. గో ఎయిర్‌ వద్ద ప్రస్తుతం 34 విమానాలు ఉండగా, నాలుగేళ్లలో 119 ఏ320 విమానాలను కొనుగోలు చేయనుంది. ఎయిర్‌ఏషియా మరో ఐదేళ్లలో 60 విమానాలను సమకూర్చుకోనున్నది. జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రస్తుతం 107 విమానాలకు అధిపతి కాగా మరో 86 విమానాలను సిద్ధం చేయనున్నది. ఇక విస్తారా, ట్రూజెట్‌, జూమ్‌ ఎయిర్‌ సంస్థలు కూడా మరో ఐదేళ్లలో కొత్త విమానాలను కొనుగోలు చేయనున్నాయి. 155 విమానాలు కలిగి ఉన్న ప్రభుత్వ రంగ ఎయిరిండియా సంస్థ 2019 మార్చి కల్లా మూడు బోయింగ్‌ విమానాలు, 16 ఏ320 విమానాలను కొత్తగా సమకూర్చుకోనున్నది.