లాలూ కి మూడున్నరేళ్ల జైలు - 5 లక్షల జరిమానా


పశు దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్ల పాటు జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శనివారం సాయంత్రం తీర్పు చెప్పారు. రెండు గంటలకు శిక్షలు ఖరారు చేయాల్సి ఉండగా నాలుగు గంటలకు వెల్లడిస్తామని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి శివపాల్‌ సింగ్‌ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం శిక్ష ఖరారుకు సంబంధించిన వాదనలు ముగిశాయి. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇటువంటి దోషులకు ఓపెన్‌ జైలు సరిగా సరిపోతుంది. ఎందుకంటే వాళ్లు ఇంతకముందే ఆవుల పెంపకం చేసిన అనుభవం ఉంది’ అని వ్యాఖ్యానించారు. శిక్షల ఖరారుకు సంబంధించిన తీర్పు వెలువడనుండటంతో రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. జనవరి 3న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. కానీ ఓ న్యాయవాది మృతితో తీర్పును వాయిదా వేశారు. అనంతరం మరో రెండు సార్లు తీర్పు వాయిదా పడింది. తన వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని శిక్ష ఖరారు చేయాల్సిందిగా లాలూప్రసాద్‌ యాదవ్‌ న్యాయస్థానం శుక్రవారం పిటిషన్‌ను దాఖలు చేశారు.