ఇంగ్లీషు మీడియం ఒకే... తెలుగు ఉండాలి


గడిచిన కొన్నేళ్లుగా ఎన్నో ప్రయివేట్ స్కూల్స్ వస్తున్నాయి. ఎవరూ కూడా తెలుగు మీడియం గురించి స్కూల్ పెట్టిన దాఖలాలు లేవు. చాలామంది ప్రవేట్ స్కూల్స్ లోనే చదువుతున్నారు కూడా. అలాంటప్పుడు ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయిం చడంలో తప్పులేదు. అలాగే తెలుగుకి అన్యాయం జరిగిపోతుందన్న ఆందోళన వ్యక్తం కావడంలోనూ తప్పులేదు. అందుకే ఇంగ్లీషు మీడియం ఉన్నప్పటికీ తెలుగు సబ్జెక్ట్ ఉండాలి ఖచ్చితంగా ఉండేలా చూడాలి. ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికి అనువుగా టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి"అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ప్రతి స్కూల్ దగ్గర తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరిస్తే సరిపోతుందని, అనవసర రాద్ధాంతం ఉండదని అన్నారు. అయినా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నపుడు లోటుపాట్లు ప్రతిపక్షం చెప్పాలని,అలాగే ప్రతిపక్షం విమర్శిస్తే తిరిగి విమర్శ చేయడం కాకుండా తగిన రీతిగా జవాబు చెప్పేలా , అనుమానం నివృత్తి చేసేలా అధికార పక్షం వ్యవహరించాలని సూచించారు. ఇప్పుడంతా ఇసుక,ఇంగ్లీష్ లమీదే నడుస్తోందని ఆయన పేర్కొంటూ సహజంగా ప్రతిపక్షంగా ఉన్నందున చంద్రబాబు,పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు విమర్శలు చేయడం,ప్రభుత్వంలో లోపాలు ఎత్తిచూపడం చేయడం వాళ్ళ విధి అని ఉండవల్లి పేర్కొన్నారు. విపక్షాలు లేవనెత్తేవాటికి సమాధానాలు సహేతుకంగా ఇవ్వాలే గానీ, ఎంతమంది పెళ్ళాలు వంటి వ్యక్తిగత విమర్శలకు దిగడం మంచిది కాదన్నారు. ఇసుక ఇప్పుడు ఎంత కావాలంటే అంత ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని,అయితే ధర విషయంలో కొంచెం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తున్నందున వీలైనంత మేరకు తగ్గించాలని ఉండవల్లి సూచించారు. ఇక అవినీతి గురించి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ జగన్ సర్కార్ పై అవినీతి ఆరోపణలు ఇంతవరకూ రాలేదని,అవినీతి విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ,ఎసిబి గట్టిగానే పనిచేస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. ప్రభుత్వంలో పెద్దలు అవినీతికి దూరంగా ఉంటె కిందిస్థాయిలో కూడా అవినీతి తగ్గుతుందన్నారు.