పెజావర్ మఠాధిపతి శ్రీ విశ్వేశ తీర్థ భగవదైక్యం


కర్నాటక లోని ఉడిపిలో ఉన్న పెజావర్ మఠాధిపతి శ్రీ విశ్వేశ తీర్థ భగవదైక్యం చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. మణిపాల్ కస్తూర్బా వైద్యశాలలో ఆయనకు చికిత్స జరిగింది. 88 ఏళ్ల విశ్వేశ తీర్థ పరిస్థితి పూర్తిగా విషమించడంతో, గతంలో ఆయన చేసిన సూచన మేరకు ఆదివారం తెల్లవారు ఝామున మఠానికి తరలించారు. అక్కడే చివరి వరకూ ఆయనకు చికిత్స అందించారు. ఆజన్మాంతం ఆయన భగవంతుని సేవలో తరించారు. అయోధ్య రామజన్మ భూమి ఉద్యమ మార్గదర్శకుల్లో ఆయన కూడా ఒకరు. దీన జనులకు సేవను భగవత్ సేవగా ప్రచారం చేసిన ఆయన ద్వైత సిద్ధాంత కర్త రామానుజాచార్య నెలకొల్పిన అష్ట మఠాల్లోని అందరి కంటే పెద్దవారు. ఈనెల 19న శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడంతో ఆయనను మణిపాల్‌కు సమీపంలోని కస్తూర్బా వైద్య కేంద్రంలో చేర్పించారు. శనివారం రాత్రి విశే్వశ తీర్థ ఆరోగ్యం విషమించింది. శరీరంలోని పలు అవయవాలు పని చేయకపోవడంతో, పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక లాభం లేదని వైద్యులు ప్రకటించడంతో, చివరి శ్వాస మఠంలోనే తీసుకోవాలన్న ఆయన కోరిక మేరకే అనుచరులు అక్కడికి తరలించారు. ఆయన తాను కోరిన విధంగానే, మఠంలోనే దైవైక్యం చెందారు. అయన మృతికి కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. బెంగళూరులోని విద్యాపీఠ్‌లో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియ జరుగుతాయని తెలిపారు. కాగా, చితాభస్మాన్ని ఎనిమిది శతాబ్దాల నాటి ఉడిపిలోని శ్రీకృష్ణ మఠానికి తీసుకెళ్లి, అక్కడి మధ్వా సరోవరంలో కలుపుతారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం