గిర్ సింహాల తరలింపు ప్రతిపాదన


గుజరాత్ లోని గిర్ ప్రాంతానికే పరిమితమైన ఆసియాటిక్ సింహాలు త్వరలో మధ్యప్రదేశ్ లోని షయోపూర్ జిల్లా కునొ అభయారణ్యంలో కనిపిస్తాయా! ఇందుకు అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఈ మేరకు కునొ అభయారణ్యాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆసియాటిక్ సింహాలుగా ప్రఖ్యాతి చెందిన ఈ సింహాలు గుజరాత్ లో ని గిర్ అటవీప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ తప్ప ప్రపంచంలో ఎక్కడా ఈ సింహాల ఉనికి లేకపోవడంతో గిర్ ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. కథియావాడ్ ద్వీపకల్పంలో ఉన్న గిర్ లో ఆసియాటిక్ జాతికి చెందిన కొన్ని సింహాలను ఇతర చోట్లకు తరలించాలని వన్యప్రాణి నిపుణుల కమిటీ సూచించింది. అయితే గుజరాత్ ప్రభుత్వం మాత్రం దీనికి అంగీకరించడం లేదు.

గిర్ లోని జాతీయ అభయారణ్యంలో ఆసియాటిక్ సింహాలు 600 పైగా ఉన్నాయి. వందేళ్ల కిందట వరకు ఇవి సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, మన దేశంలోని నర్మదా నదీ పరివాహకప్రాంతాల్లో కూడా విరివిగా కనిపించేవి. అయితే ఆహార కొరత, వేటగాళ్ల బెడద, ఆవాసాల ధ్వంసం, వాతావరణ మార్పులు ఇత్యాది కారణాలతో ఇవి అంతరించేదశకు చేరుకున్నాయి. చివరకు మన దేశంలోని గుజరాత్ లోని గిర్ అభయారణ్యానికే ఈ సింహాలు పరిమితమయ్యాయి. అటవీ అధికారులతో పాటు సమీప గ్రామాల ప్రజలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటి సంరక్షణకు పలు చర్యలు తీసుకోవడంతో గిర్ లో ఇవి సురక్షితంగానే ఉంటున్నాయి. వీటి సంఖ్య కూడా పెరిగింది. ప్రపంచంలో అన్ని చోట్లా ఈ సింహాలు అంతరించిపోయినా గిర్ లో మాత్రం పెద్ద సంఖ్యలో ఉండటం విశేషం. ఇక్కడి వాతావరణం, ఆహారం, అటవీప్రాంత విస్తీర్ణం.. ఆసియాటిక్ సింహాల జనాభా పెరుగుదలకు దోహదం చేశాయి. ఇవి ఆఫ్రికా సింహాల కంటే తక్కువ బరువు ఉంటాయి. జింకలు, పశువులు వీటి ఆహారం. సింహాలు సమూహాలుగా నివసిస్తాయి. వీటి గర్జన దాదాపు 5 కి.మీ.వరకు వినిపిస్తుంది. గిర్ సింహాలు అంతరించిపోయే దశలో ఉండటంతో వీటి పరిరక్షణకు గుజరాత్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఆఫ్రికా సింహాల నుంచి లక్ష సంవత్సరాలకు పూర్వమే ఆసియాటిక్ సింహాలు వేరుపడ్డాయి

గిర్ ప్రాంతంలోని ఆసియాటిక్ సింహాలు ప్రపంచంలోనే అరుదైన సింహాలు కావడంతో వీటి పరిరక్షణకు పలు చర్యలు తీసుకుంటున్నారు. 2018లో వచ్చిన వింత వ్యాధి కారణంగా దాదాపు 20 సింహాల వరకు మృత్యువాత పడ్డాయి. ఆ తర్వాత ఒక కొత్త అంశం పరిశీలనలోకి వచ్చింది. ఒకే ప్రాంతంలో నివసించే జంతువులకి ఏదైనా అంటువ్యాధి వస్తే వాటి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే వన్యప్రాణి నిపుణుల కమిటీ కొన్ని సింహాలను మధ్యప్రదేశ్ లోని షయోపూర్ జిల్లాలోని కునొ అభయరణ్యానికి తరలించాలని సూచించింది. ఈ మేరకు కునొలో ఉన్న కొన్ని గ్రామాల ప్రజల్ని ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతం దాదాపుగా గిర్ లాగే ఉండటంతో ఇక్కడ సింహాలు జీవించేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవని మధ్యప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇస్తోంది. అభయారణ్యంలో కునొ నది ప్రవహిస్తూ ఉండడంతో సింహాలకు నీతి కొరత కూడా రాదని మధ్యప్రదేశ్ అటవీశాఖ వర్గాలు తెలిపాయి. కునొకు రెండు మగ, నాలుగు ఆడ సింహాలను వెంటనే తరలించాలని ప్రతిపాదించారు. ఇలా చేస్తే 30 ఏళ్లలో వీటి జనాభా 80 కి చేరుతుందని అంటున్నారు. అయితే గిర్ ప్రాంతంలోని సింహాలలో కొన్నింటిని కునొకు తరలించేందుకు గుజరాత్ ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించడం లేదు మధ్యప్రదేశ్ లో గతంలో పులుల వేటను అడ్డుకోలేకపోయారని ఇప్పుడు అరుదైన ఈ సింహాల విషయంలో కూడా అలాగే జరిగితే ఎవరు భరోసా అని ప్రశ్నిస్తోంది. 1957లో ఉత్తర్ ప్రదేశ్ లోని చంద్రప్రభ వన్యప్రాణి సంరక్షణకేంద్రానికి ఒక మగ, రెండు ఆడ గిర్ సింహాలను తరలించారు. అయితే 1965 తరువాత వాటి జాడ గల్లంతయింది. ఇవి ఎత్తి చూపుతూ గుజరాత్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనని వ్యతిరేకిస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి వన్యప్రాణి నిపుణుల కమిటీ కృషిచేస్తోంది.

ముఖ్యాంశాలు