కరోనాసుర సంహారం

అమరావతి లో దేవేంద్రునిసభ జరుగుతోంది . 

 

దేవగురువు బృహస్పతి ఆధ్వర్యవం లో సభ నడుస్తూ ఉంది . 

అష్ట దిక్పాలకులు , నవ గ్రహాలు తో కలిసి అతి ముఖ్య సమావేశం జరుగుతోంది. 

అప్పటికే గూఢచర్యాన్ని సమర్ధవంతం గా నిర్వహించే త్రైలోక్య సంచారి నారద మునీంద్రుడు జరిగిన సంఘటనలను , జరుగుతున్న , జరగబోయే సంఘటనల పై ఒక ప్రత్యేక నివేదిక అందజేశాడు . 

ముక్కోటి దేవతలను వీడియో కాన్ఫరెన్స్ లోకి ఆహ్వానించారు దేవ గురువు బృహస్పతి . 

అమరేంద్రుని ప్రత్యేక ఆహ్వానం మేరకు త్రిమూర్తులు అప్పటికే గ్రూప్ చాటింగ్ కి వచ్చి నిరీక్షిస్తున్నారు . 

శచీదేవి ఆహ్వానం మేరకు  త్రిశక్తి కూడా మహిళా మండలి తరపున హాజరయ్యారు కూడా . 

సభలో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి . 

ముందుగా యమధర్మరాజు  : 

దేవేంద్రా ప్రస్తుతం మర్త్యలోకం నుండి జీవుల రాక తగ్గిపోయింది . దానివలన నరకలోకం లో పనిలేక యమభటులు ఖాళీ గా కూర్చున్నారు . ప్రస్తుతం బడ్జెట్ కొరత కారణం గా నరకలోకం లో ఉన్న యమభటులకు ఆన్ పైడ్ లీవ్ తో పాటు ఉద్యోగాలలో కొంత కోత కూడా చేయదలచుకున్నాము .  మీ ఉత్తర్వులకోసం ఎదురుచూస్తున్నాము .

దేవేంద్రుడు బృహస్పతి వంక చూసి : 

ఆచార్యా ఏమిటి ఇది అకస్మాత్తుగా ఇంతటి సంక్షోభం .  మనం విధాత విరచించించిన జీవుల కర్మఫలాల రిజిస్టర్ ని బాగానే అనుసరిస్తున్నామా ? లేక మనకు తెలియని మార్పులు విధాత గానీ చేసారా ? అందుకు సంబంధించి సమాచారం మీ దగ్గరుందా ? 

అకస్మాత్తుగా ఆ ప్రశ్న వేసి తనవంక చూసిన బ్రహ్మ ఉలిక్కిపడి : 

దేవేంద్రా నా ప్రోగ్రామింగ్ లో ఏ లోపమూ లేదు , ఇది పూర్తిగా మీ నిర్వహణా లోపం  సుమీ . 

ఆ మాట అన్న బ్రహ్మ తమ వంక చూసి మద్దతు అడిగేసరికి హరిహరులు : 

దేవేంద్రా అవును నిజం మేము కూడా విధాత మాటలతో ఏకీభవిస్తున్నాము . ఇది పూర్తిగా నిర్వహణా వైఫల్యమే . 

దేవేంద్రుడు  బృహస్పతి తో :

ఆచార్యా ఏమిటిది మన వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదా ?  మనం సరిగ్గా పాలిస్తామనే కదా ముక్కోటి దేవతలకూ హామీ ఇచ్చాము మన క్రితం మేనిఫెస్టో లో .మీరు వ్యవహారాలను సరిగానే నియంత్రిస్తున్నారా ? 

అంటూ ఒకసారి మిగిలిన గ్రహామండలి  వంక చూశాడు : 

సూర్యుడు : 

ప్రభూ నేను నా విధిని సరిగ్గానే నిర్వర్తిస్తున్నాను . 

చంద్రుడు : 

ప్రభూ నేను నా విధిని సరిగ్గానే నిర్వర్తిస్తున్నాను .  

అంగారకుడు , కుజుడు,  బుధుడు , శని : 

ప్రభూ మేమూ సరిగ్గానే మా విధులను నిర్వహిస్తున్నాము కానీ మాకు కూడా అందని వింత ఏదో జరుగుతోందని అనుమానం గా ఉంది . 

రాహువు కేతువు : 

ప్రభూ సమయానుకూలం గా మేము తీసుకుంటున్న చర్యలలో ఏ లోపమూ రానివ్వడం లేదు . 

అష్ట దిక్పాలకులు  కూడా అదే మాటను ఏక కంఠం తో చెప్పారు . 

ముక్కోటి దేవతలు కూడా అదే విషయాన్నీ తెలియజేసారు . 

దేవేంద్రునికి ఇంకా నమ్మకం కుదరడం లేదు , ఎక్కడో ఏదో జరుగుతోంది . ఇటు చూస్తేనేమో యంత్రాంగం మొత్తం మేము మా పనులు మేము చేస్తున్నాము అంటున్నారు , అటు చూస్తేనేమో ఇటు స్వర్గానికి , అటు నరకానికి వచ్చే జీవుల సంఖ్య విపరీతం గా తగ్గిపోయింది .  ఎటుచూసినా ఖాళీగా తిరుగుతున్న అమరావతి , యమపురి ఉద్యోగులు . రోజు రోజుకీ భారం పెరిగిపోతోంది .  ఇప్పటివరకూ ఎలాగోలాగ జీవులు చేసిన వివిధ ఖర్మ ఫలాల ద్వారా తాము ఆర్జించిన హవిస్సు అనే ఖజానా పంచి పెట్టడం జరిగింది. ముందు ముందు తన సీటుకే ఎసరు రావచ్చు . అని భయపడుతూ ఉన్నాడు గా గూఢచారి నం . 1 నారదుడు ,అసలు విషయం చెప్పడానికి . అని నారదుడి వంక చూసాడు . 

నారదుడు నిదానం గా : 

దేవేంద్రా మీ,మీ  యంత్రాంగం చెప్పినట్లు వారందరూ సజావుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాట వాస్తవమే .  ఇప్పటివరకూ జీవులు తాము చేసిన జప తపః హోమాలతో మీకు ఇచ్చిన హవిస్సులు కూడా పూర్తిగా తగ్గిపోవడం తో తదుపరి మీ పదవి కూడా అనుమానం గానే కనబడుతున్నది .  

దేవేంద్రుడు : 

నారదా ఏమిటి ఈ డొంక తిరుగుడు మాటలు , కలహప్రియత్వం మాని అసలు విషయం చెప్పు  

నారదుడు : 

ఉండవయ్యా దేవేంద్రా . నా మీదెందుకు నీ ఉలుకు ఏదైనా ఉంటే అదిగో ఆ ఇద్దరినీ అడుగు అని అటువైపు వేళ్ళు చూపించాడు . హరిహరుల వంక . 

హరిహరులు : 

నారదా ! చూడ చూడ మా మధ్యే పెట్టావా ఎర్త్. 

నారదుడు : 

నారాయణ నారాయణ స్వామి నాదేముంది నిమ్మిత్తమాత్రుడిని లయకారకుడు , స్థితికారకుడు అభేదం కదా ఈ లీలా విలాసం అంతా తమదేమోనేనో అని అనుమానం . 

అప్పుడు దేవేంద్రుడికి బల్బు వెలిగింది . 

అవును నారదా మర్త్యలోకం లో వీళిద్దరికే ఎక్కువ గౌరవం చూడబోతే నాకే ఎందుకో  అనుమానం గా ఉంది . ఈ మధ్యనే కుబేరుడు కూడా చెప్పాడు , తన దగ్గర ఉన్న మొత్తం ఊడ్చి మర్త్యులకు ఇచ్చేశారట కదా ఈ ద్వయం .  

ఉండు అసలు విషయం తెలుస్తాను అంటూ భూమాతను పిలిచాడు . 

భూమాత ప్రవేశించగానే : 

ప్రభూ మీ పిలుపునకు కారణం ?

దేవేంద్రుడు 

పృధివీ దిగ్గజాలు మోస్తున్న పల్లకీ లో కూర్చుని ఆనందం గా ఉన్నావా అని అడిగాడు . 

భూమాత : 

లేదు స్వామీ ఈ మధ్య నన్ను మోసే దిగ్గజాలు కూడా నోటీసులు పంపించాయి . రోజురోజుకీ నా బరువు పెరిగిపోతోంది అని , ఇక మోయలేము అని . 

దేవేంద్రుడు 

ఎందుకలా ?

భూమాత : 

తెలీదు స్వామీ ఈ మధ్య మర్త్యలోకం లో ఒక మహమ్మారి పుట్టిందట అది జనులను కాటువేస్తూ వారి ఆయుష్షును తీసివేస్తోందట . గాలి కాలుష్యం, నీరు కాలుష్యం అనో అక్కడి ప్రభుత్వాలు వారందరినీ పెద్ద పెద్ద గుంతలు త్రవ్వి నాకే ఆహరం గా ఇచ్చేస్తున్నారు .  ఆలా పెరిగిపోతున్న మృతులు , వారి కళేబరాలనుండి ఏర్పడే మట్టితో నా బరువు ఇప్పుడు రెట్టింపు అయింది . అందుకే ఈ గోలంతా . 

బృహస్పతి 

దేవేంద్రా ఈ కారణంగా నేనేమో అమరావతి లోని హవిస్సు భాండాగారం ఖాళీ అయిపొవచ్చింది ఇంకొన్ని రోజులు ఇలాగే సాగితే మన పరిస్థితి తలక్రిందులు అవడం ఖాయం . 

అందరూ కలిసి ఆ బ్రహ్మను వేడుకున్నారు : 

బ్రహ్మ : 

నాయనలారా మా నాన్న గారు చెప్పినట్లు చేయడమే నా భాధ్యత . పితృవాక్య పాలన కన్నా మరేదేముంది . కనుక మీరేమన్నా విన్నవించాలంటే ఆయనకే చెప్పండి అని శేషశయనుని దగ్గరకు సిఫార్సు చేసాడు . 

మళ్ళీ అందరూ కలిసి విష్ణువును అర్ధించారు 

విష్ణువు : 

నాయనా , ఈ వసుంధర నా భార్య , కనుక ఈ వసుధ లో పుట్టిన నా కుమారులను తల్లి నుండి వేరు చేయలేను కదా . తండ్రిగా ఇప్పటికే పుట్టెడు శోకం తో ఉన్నాను . దీనికి పరిష్కారం అదిగో మా అందరికీ మూల పురుషుడు ఉన్నాడే ఆయనని అడగండి . అని అర్ధనారీశ్వరునివైపు చూపించాడు . 

మళ్ళీ అందరూ కలిసి ఆ శంకరయ్య దగ్గరకు వెళ్లి స్తుతించారు : 

ఓ ఆద్యంత రహితా ఒకనాడు క్షీర సాగర మధనం లో హాలాహలం జనిస్తే అది స్వీకరించి లోకములకు ప్రశాంతత చేకూర్చావు . అమృతవస్తువులను అందరికీ పంచి నీవు మాత్రం నిరాపేక్షుడవై , మౌనం గా ధ్యానం లో మునిగిపోయావు . నీవే దిక్కు . ఈ విపత్తు నుండి మమ్ము నీవే రక్షించాలి అని వేడుకోలు చేసారు . 

ఫాలనేత్రుడు ధ్యానం నుండి వెలుపలకు వచ్చి 

అమరాధిప మీ మొరలు విన్నాను . 

నాచే జనియించబడిన ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తూ , సకల చరాచరాచర జీవులను హింసిస్తూ , సర్వమానవాళి మోదము పొందుతున్నది . అలనాడు దక్షుడు చేసినట్లుగా నేడు విశ్వమంతయూ నిరీశ్వర యాగము నడుచుచున్నది . ఇంత జరుగుతున్నా మీలో ఒక్కరు కూడా స్పందించక చోద్యము చూస్తూ కాలము వెళ్లబుచ్చుతున్నారు .  ఇది ప్రమాద హేతువు .  మీకు జీవుల పుణ్యఫలాలను ప్రసాదించి మిమ్ములను మహానీయులను చేస్తే కనీసం పట్టించుకోకుండా అశ్రద్దగా ఉండుట చేతే ఇంతటి విపరీతము ఏర్పడినది . 

చింతించకండి త్వరలో నేను, నా భూతగణం తో కూడి పృథ్విపై అడుగిడతాను , మీరు కూడా మీ మీ అంశలతో నాతో తరలిరండి . 

రానున్న వైశాఖ శుద్ధ పంచమి నాడు  మర్త్యలోక ఉద్దరణ కోసం నా అంశలో జనించిన శంకరుని జయంతి . ఆ నాడు శ్రద్దగా నన్ను పూజించిన మర్త్యుల ని ఆశీర్వదిస్తూ  కరాళ నృతం చేస్తూ ఒక పెద్ద అగ్నిజ్వాలను సృష్టిస్తాను . అది దావానలమై అఖండ భూమండలాన్ని ఆక్రమించి పాతాళం వరకూ విస్తరిస్తుంది . నా స్పర్శ సోకిన కారణం చేత జీవుల దేహాలు పవిత్రమై యజ్ఞ హవిస్సులుగా మారి దేవలోకం చేరతాయి . అక్కడనుండి ఆయా జీవుల కర్మఫలాలను అనుసరించి తదుపరి గతులు సిద్ధిస్తాయి . 

భాస్కరా ! రానున్న 3 మాసములు నీకు పరీక్ష పెడుతున్నాను , ఇంతకు ముందుకంటే  ఇప్పుడు ప్రచంఢ భానుడవై ఈ భూమి పై తీక్షణ అధికం చేయి తద్వారా మర్త్యలోకం లో ఇప్పుడు ప్రబల శక్తిగా మారిన ఈ మహమ్మారి అంతరించుకుపోతుంది . తద్వారా  భూమాతకు భారం తగ్గి దిగ్గజములు సేద తీరగలవు . 

ముక్కోటి దేవతలారా !  మిమ్ము ఆశ్రయించిన మనుజుల కష్టములను తీరుస్తూ వారికి విశేష ఫలములు అందించండి .   అప్పుడే వారు సంతోషముగా తమ కర్తవ్యములను నిర్వహించగలరు .  మళ్ళీ ఆచార వ్యవహారములతో  భూలోకం పుష్పభరితం కాగలదు . 

ఇక వెళ్ళిరండి అని ఊరడించి తన అర్ధభాగమైన నారాయణి వంక చూసేను.  

పతి వాక్యమే పరమ వాక్యమన్న ఆ నారాయణి ఆ పరమేశ్వరుని పూజించెను . 

ఆ పిమ్మట అర్ధనారీశ్వరుడు తిరిగి ధ్యానం లో నిమగ్నమయ్యెను . 

తనను ధ్యానము చేయుచున్న ఆ గౌరీనాధుని వంక చూసి లీలా విలాసముగ నవ్వేను జగన్నాటక సూత్రధారైన ఆ శ్రీమన్నారాయణుడు. అంతకు శ్రీదేవి సంతసించి ఆయనను అర్చించెను . 

హరిహరుల అద్వైతభావనను అంతః కరణములో దాచుకుని రమిస్తున్న  విధాత ,వీణాపాణి తో కూడి ఆపన్నులకు అభయము నొసంగెను . 

కనుక తోటి మనుజులారా ! 

ఆందోళన చెందక , అనునిత్యం ఆ అనంత శక్తిని స్మరిస్తూ మీ మీ శక్తి మేర అర్చించండి . కాలుడు కదన రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు . త్రిపురాసుర సంహారం వేళ అంభోధిని ఛత్రం గా మేరువుని ధనుస్సుగా , నారాయణునిని అస్త్రం గా ధరించి సూర్య చంద్రులను రధము గా కూడి దండయాత్ర చేసినట్లుగా నేడు కూడా అదేమాదిరిగా రాబోతున్నాడు . 

అందరికీ శుభం కలుగుగాక 

సర్వేజనాః సుఖినో భవంతు 

సమస్త సన్మంగళానిస్సంతు 

ధర్మో రక్షతి రక్షితః  

స్వస్తి 

 

గమనిక :  ఈ రచన పూర్తిగా ఊహాజనితం అయినా పరమేశ్వరుని కృప అందరిపై మెండుగా ఉండాలని కాంక్ష . ఎక్కడైనా పొరబాటు దొర్లితే అందుకు క్షంతవ్యుడను 

సద్విమర్శలు సర్వదా స్వాగతనీయం 

Facebook
Twitter
Please reload

​సంబంధిత సమాచారం 
Please reload

ముఖ్యాంశాలు

ఓసీల అభివృద్ధికి సబ్ ప్లాన్ వేయాలి

September 16, 2020

1/10
Please reload

తాజా వార్తలు
Please reload

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836