కరోనాసుర సంహారం


అమరావతి లో దేవేంద్రునిసభ జరుగుతోంది .


దేవగురువు బృహస్పతి ఆధ్వర్యవం లో సభ నడుస్తూ ఉంది .

అష్ట దిక్పాలకులు , నవ గ్రహాలు తో కలిసి అతి ముఖ్య సమావేశం జరుగుతోంది.

అప్పటికే గూఢచర్యాన్ని సమర్ధవంతం గా నిర్వహించే త్రైలోక్య సంచారి నారద మునీంద్రుడు జరిగిన సంఘటనలను , జరుగుతున్న , జరగబోయే సంఘటనల పై ఒక ప్రత్యేక నివేదిక అందజేశాడు .

ముక్కోటి దేవతలను వీడియో కాన్ఫరెన్స్ లోకి ఆహ్వానించారు దేవ గురువు బృహస్పతి .

అమరేంద్రుని ప్రత్యేక ఆహ్వానం మేరకు త్రిమూర్తులు అప్పటికే గ్రూప్ చాటింగ్ కి వచ్చి నిరీక్షిస్తున్నారు .

శచీదేవి ఆహ్వానం మేరకు త్రిశక్తి కూడా మహిళా మండలి తరపున హాజరయ్యారు కూడా .

సభలో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి .

ముందుగా యమధర్మరాజు :

దేవేంద్రా ప్రస్తుతం మర్త్యలోకం నుండి జీవుల రాక తగ్గిపోయింది . దానివలన నరకలోకం లో పనిలేక యమభటులు ఖాళీ గా కూర్చున్నారు . ప్రస్తుతం బడ్జెట్ కొరత కారణం గా నరకలోకం లో ఉన్న యమభటులకు ఆన్ పైడ్ లీవ్ తో పాటు ఉద్యోగాలలో కొంత కోత కూడా చేయదలచుకున్నాము . మీ ఉత్తర్వులకోసం ఎదురుచూస్తున్నాము .

దేవేంద్రుడు బృహస్పతి వంక చూసి :

ఆచార్యా ఏమిటి ఇది అకస్మాత్తుగా ఇంతటి సంక్షోభం . మనం విధాత విరచించించిన జీవుల కర్మఫలాల రిజిస్టర్ ని బాగానే అనుసరిస్తున్నామా ? లేక మనకు తెలియని మార్పులు విధాత గానీ చేసారా ? అందుకు సంబంధించి సమాచారం మీ దగ్గరుందా ?

అకస్మాత్తుగా ఆ ప్రశ్న వేసి తనవంక చూసిన బ్రహ్మ ఉలిక్కిపడి :

దేవేంద్రా నా ప్రోగ్రామింగ్ లో ఏ లోపమూ లేదు , ఇది పూర్తిగా మీ నిర్వహణా లోపం సుమీ .

ఆ మాట అన్న బ్రహ్మ తమ వంక చూసి మద్దతు అడిగేసరికి హరిహరులు :

దేవేంద్రా అవును నిజం మేము కూడా విధాత మాటలతో ఏకీభవిస్తున్నాము . ఇది పూర్తిగా నిర్వహణా వైఫల్యమే .

దేవేంద్రుడు బృహస్పతి తో :

ఆచార్యా ఏమిటిది మన వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదా ? మనం సరిగ్గా పాలిస్తామనే కదా ముక్కోటి దేవతలకూ హామీ ఇచ్చాము మన క్రితం మేనిఫెస్టో లో .మీరు వ్యవహారాలను సరిగానే నియంత్రిస్తున్నారా ?

అంటూ ఒకసారి మిగిలిన గ్రహామండలి వంక చూశాడు :

సూర్యుడు :

ప్రభూ నేను నా విధిని సరిగ్గానే నిర్వర్తిస్తున్నాను .

చంద్రుడు :

ప్రభూ నేను నా విధిని సరిగ్గానే నిర్వర్తిస్తున్నాను .

అంగారకుడు , కుజుడు, బుధుడు , శని :

ప్రభూ మేమూ సరిగ్గానే మా విధులను నిర్వహిస్తున్నాము కానీ మాకు కూడా అందని వింత ఏదో జరుగుతోందని అనుమానం గా ఉంది .

రాహువు కేతువు :

ప్రభూ సమయానుకూలం గా మేము తీసుకుంటున్న చర్యలలో ఏ లోపమూ రానివ్వడం లేదు .

అష్ట దిక్పాలకులు కూడా అదే మాటను ఏక కంఠం తో చెప్పారు .

ముక్కోటి దేవతలు కూడా అదే విషయాన్నీ తెలియజేసారు .

దేవేంద్రునికి ఇంకా నమ్మకం కుదరడం లేదు , ఎక్కడో ఏదో జరుగుతోంది . ఇటు చూస్తేనేమో యంత్రాంగం మొత్తం మేము మా పనులు మేము చేస్తున్నాము అంటున్నారు , అటు చూస్తేనేమో ఇటు స్వర్గానికి , అటు నరకానికి వచ్చే జీవుల సంఖ్య విపరీతం గా తగ్గిపోయింది . ఎటుచూసినా ఖాళీగా తిరుగుతున్న అమరావతి , యమపురి ఉద్యోగులు . రోజు రోజుకీ భారం పెరిగిపోతోంది . ఇప్పటివరకూ ఎలాగోలాగ జీవులు చేసిన వివిధ ఖర్మ ఫలాల ద్వారా తాము ఆర్జించిన హవిస్సు అనే ఖజానా పంచి పెట్టడం జరిగింది. ముందు ముందు తన సీటుకే ఎసరు రావచ్చు . అని భయపడుతూ ఉన్నాడు గా గూఢచారి నం . 1 నారదుడు ,అసలు విషయం చెప్పడానికి . అని నారదుడి వంక చూసాడు .

నారదుడు నిదానం గా :

దేవేంద్రా మీ,మీ యంత్రాంగం చెప్పినట్లు వారందరూ సజావుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాట వాస్తవమే . ఇప్పటివరకూ జీవులు తాము చేసిన జప తపః హోమాలతో మీకు ఇచ్చిన హవిస్సులు కూడా పూర్తిగా తగ్గిపోవడం తో తదుపరి మీ పదవి కూడా అనుమానం గానే కనబడుతున్నది .

దేవేంద్రుడు :

నారదా ఏమిటి ఈ డొంక తిరుగుడు మాటలు , కలహప్రియత్వం మాని అసలు విషయం చెప్పు

నారదుడు :

ఉండవయ్యా దేవేంద్రా . నా మీదెందుకు నీ ఉలుకు ఏదైనా ఉంటే అదిగో ఆ ఇద్దరినీ అడుగు అని అటువైపు వేళ్ళు చూపించాడు . హరిహరుల వంక .

హరిహరులు :

నారదా ! చూడ చూడ మా మధ్యే పెట్టావా ఎర్త్.

నారదుడు :

నారాయణ నారాయణ స్వామి నాదేముంది నిమ్మిత్తమాత్రుడిని లయకారకుడు , స్థితికారకుడు అభేదం కదా ఈ లీలా విలాసం అంతా తమదేమోనేనో అని అనుమానం .

అప్పుడు దేవేంద్రుడికి బల్బు వెలిగింది .

అవును నారదా మర్త్యలోకం లో వీళిద్దరికే ఎక్కువ గౌరవం చూడబోతే నాకే ఎందుకో అనుమానం గా ఉంది . ఈ మధ్యనే కుబేరుడు కూడా చెప్పాడు , తన దగ్గర ఉన్న మొత్తం ఊడ్చి మర్త్యులకు ఇచ్చేశారట కదా ఈ ద్వయం .

ఉండు అసలు విషయం తెలుస్తాను అంటూ భూమాతను పిలిచాడు .

భూమాత ప్రవేశించగానే :

ప్రభూ మీ పిలుపునకు కారణం ?

దేవేంద్రుడు

పృధివీ దిగ్గజాలు మోస్తున్న పల్లకీ లో కూర్చుని ఆనందం గా ఉన్నావా అని అడిగాడు .

భూమాత :

లేదు స్వామీ ఈ మధ్య నన్ను మోసే దిగ్గజాలు కూడా నోటీసులు పంపించాయి . రోజురోజుకీ నా బరువు పెరిగిపోతోంది అని , ఇక మోయలేము అని .

దేవేంద్రుడు

ఎందుకలా ?

భూమాత :

తెలీదు స్వామీ ఈ మధ్య మర్త్యలోకం లో ఒక మహమ్మారి పుట్టిందట అది జనులను కాటువేస్తూ వారి ఆయుష్షును తీసివేస్తోందట . గాలి కాలుష్యం, నీరు కాలుష్యం అనో అక్కడి ప్రభుత్వాలు వారందరినీ పెద్ద పెద్ద గుంతలు త్రవ్వి నాకే ఆహరం గా ఇచ్చేస్తున్నారు . ఆలా పెరిగిపోతున్న మృతులు , వారి కళేబరాలనుండి ఏర్పడే మట్టితో నా బరువు ఇప్పుడు రెట్టింపు అయింది . అందుకే ఈ గోలంతా .

బృహస్పతి

దేవేంద్రా ఈ కారణంగా నేనేమో అమరావతి లోని హవిస్సు భాండాగారం ఖాళీ అయిపొవచ్చింది ఇంకొన్ని రోజులు ఇలాగే సాగితే మన పరిస్థితి తలక్రిందులు అవడం ఖాయం .

అందరూ కలిసి ఆ బ్రహ్మను వేడుకున్నారు :

బ్రహ్మ :

నాయనలారా మా నాన్న గారు చెప్పినట్లు చేయడమే నా భాధ్యత . పితృవాక్య పాలన కన్నా మరేదేముంది . కనుక మీరేమన్నా విన్నవించాలంటే ఆయనకే చెప్పండి అని శేషశయనుని దగ్గరకు సిఫార్సు చేసాడు .

మళ్ళీ అందరూ కలిసి విష్ణువును అర్ధించారు

విష్ణువు :

నాయనా , ఈ వసుంధర నా భార్య , కనుక ఈ వసుధ లో పుట్టిన నా కుమారులను తల్లి నుండి వేరు చేయలేను కదా . తండ్రిగా ఇప్పటికే పుట్టెడు శోకం తో ఉన్నాను . దీనికి పరిష్కారం అదిగో మా అందరికీ మూల పురుషుడు ఉన్నాడే ఆయనని అడగండి . అని అర్ధనారీశ్వరునివైపు చూపించాడు .

మళ్ళీ అందరూ కలిసి ఆ శంకరయ్య దగ్గరకు వెళ్లి స్తుతించారు :

ఓ ఆద్యంత రహితా ఒకనాడు క్షీర సాగర మధనం లో హాలాహలం జనిస్తే అది స్వీకరించి లోకములకు ప్రశాంతత చేకూర్చావు . అమృతవస్తువులను అందరికీ పంచి నీవు మాత్రం నిరాపేక్షుడవై , మౌనం గా ధ్యానం లో మునిగిపోయావు . నీవే దిక్కు . ఈ విపత్తు నుండి మమ్ము నీవే రక్షించాలి అని వేడుకోలు చేసారు .

ఫాలనేత్రుడు ధ్యానం నుండి వెలుపలకు వచ్చి

అమరాధిప మీ మొరలు విన్నాను .

నాచే జనియించబడిన ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తూ , సకల చరాచరాచర జీవులను హింసిస్తూ , సర్వమానవాళి మోదము పొందుతున్నది . అలనాడు దక్షుడు చేసినట్లుగా నేడు విశ్వమంతయూ నిరీశ్వర యాగము నడుచుచున్నది . ఇంత జరుగుతున్నా మీలో ఒక్కరు కూడా స్పందించక చోద్యము చూస్తూ కాలము వెళ్లబుచ్చుతున్నారు . ఇది ప్రమాద హేతువు . మీకు జీవుల పుణ్యఫలాలను ప్రసాదించి మిమ్ములను మహానీయులను చేస్తే కనీసం పట్టించుకోకుండా అశ్రద్దగా ఉండుట చేతే ఇంతటి విపరీతము ఏర్పడినది .

చింతించకండి త్వరలో నేను, నా భూతగణం తో కూడి పృథ్విపై అడుగిడతాను , మీరు కూడా మీ మీ అంశలతో నాతో తరలిరండి .

రానున్న వైశాఖ శుద్ధ పంచమి నాడు మర్త్యలోక ఉద్దరణ కోసం నా అంశలో జనించిన శంకరుని జయంతి . ఆ నాడు శ్రద్దగా నన్ను పూజించిన మర్త్యుల ని ఆశీర్వదిస్తూ కరాళ నృతం చేస్తూ ఒక పెద్ద అగ్నిజ్వాలను సృష్టిస్తాను . అది దావానలమై అఖండ భూమండలాన్ని ఆక్రమించి పాతాళం వరకూ విస్తరిస్తుంది . నా స్పర్శ సోకిన కారణం చేత జీవుల దేహాలు పవిత్రమై యజ్ఞ హవిస్సులుగా మారి దేవలోకం చేరతాయి . అక్కడనుండి ఆయా జీవుల కర్మఫలాలను అనుసరించి తదుపరి గతులు సిద్ధిస్తాయి .

భాస్కరా ! రానున్న 3 మాసములు నీకు పరీక్ష పెడుతున్నాను , ఇంతకు ముందుకంటే ఇప్పుడు ప్రచంఢ భానుడవై ఈ భూమి పై తీక్షణ అధికం చేయి తద్వారా మర్త్యలోకం లో ఇప్పుడు ప్రబల శక్తిగా మారిన ఈ మహమ్మారి అంతరించుకుపోతుంది . తద్వారా భూమాతకు భారం తగ్గి దిగ్గజములు సేద తీరగలవు .

ముక్కోటి దేవతలారా ! మిమ్ము ఆశ్రయించిన మనుజుల కష్టములను తీరుస్తూ వారికి విశేష ఫలములు అందించండి . అప్పుడే వారు సంతోషముగా తమ కర్తవ్యములను నిర్వహించగలరు . మళ్ళీ ఆచార వ్యవహారములతో భూలోకం పుష్పభరితం కాగలదు .

ఇక వెళ్ళిరండి అని ఊరడించి తన అర్ధభాగమైన నారాయణి వంక చూసేను.

పతి వాక్యమే పరమ వాక్యమన్న ఆ నారాయణి ఆ పరమేశ్వరుని పూజించెను .

ఆ పిమ్మట అర్ధనారీశ్వరుడు తిరిగి ధ్యానం లో నిమగ్నమయ్యెను .

తనను ధ్యానము చేయుచున్న ఆ గౌరీనాధుని వంక చూసి లీలా విలాసముగ నవ్వేను జగన్నాటక సూత్రధారైన ఆ శ్రీమన్నారాయణుడు. అంతకు శ్రీదేవి సంతసించి ఆయనను అర్చించెను .

హరిహరుల అద్వైతభావనను అంతః కరణములో దాచుకుని రమిస్తున్న విధాత ,వీణాపాణి తో కూడి ఆపన్నులకు అభయము నొసంగెను .

కనుక తోటి మనుజులారా !

ఆందోళన చెందక , అనునిత్యం ఆ అనంత శక్తిని స్మరిస్తూ మీ మీ శక్తి మేర అర్చించండి . కాలుడు కదన రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు . త్రిపురాసుర సంహారం వేళ అంభోధిని ఛత్రం గా మేరువుని ధనుస్సుగా , నారాయణునిని అస్త్రం గా ధరించి సూర్య చంద్రులను రధము గా కూడి దండయాత్ర చేసినట్లుగా నేడు కూడా అదేమాదిరిగా రాబోతున్నాడు .

అందరికీ శుభం కలుగుగాక

సర్వేజనాః సుఖినో భవంతు

సమస్త సన్మంగళానిస్సంతు

ధర్మో రక్షతి రక్షితః

స్వస్తి


గమనిక : ఈ రచన పూర్తిగా ఊహాజనితం అయినా పరమేశ్వరుని కృప అందరిపై మెండుగా ఉండాలని కాంక్ష . ఎక్కడైనా పొరబాటు దొర్లితే అందుకు క్షంతవ్యుడను

సద్విమర్శలు సర్వదా స్వాగతనీయం

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం