ఆ అమ్మ మనసు అపురూపం... మహిళా సాధికారతకు ప్రతిరూపం

బహుముఖ ప్రతిభావంతం ..స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం కళారంగంలో కుమార్తెను తీర్చిదిద్దిన లక్ష్మీకామేశ్వరి దుబాయ్ లో వెల్లివిరిసిన తెలుగు తేజాలు ఆ తల్లీ తనయలు ఆ తల్లి కంటి మెరుపులో తనయ సాధించిన విజయాలు కనిపిస్తాయి... ఆ కుమార్తె అధిరోహించిన శిఖరాల వెనుక తల్లి తేజస్సు కనిపిస్తుంది. అందుకే ఆ ఇద్దరి గురించీ కలిపి చెప్పుకోవడం ఇక్కడ అవసరం. మహిళా సాధికారత.. ఈమాట నేటి సమాజంలో సర్వత్రా వినిపించేదే! అయితే దీనిని సాకారం చేయడం మాటలు, రాతల్లో చెప్పినంత సులభం కాదు. దీక్షతో, అంకితభావంతో జీవితాన్ని త్యాగం చేయడానికి... సవాళ్లతో పోరాడేందు కు సైతం సిద్ధపడినప్పుడే అది సాధ్యపడుతుంది. అందుకే ఈ పదాన్ని మనం ఎక్కువగా అంటూ, వింటూ ఉంటాం తప్ప చూడలేకపోతున్నాం! ఇలాంటి క్లిష్టమైన జీవన సాఫల్య సందర్భాన్ని ఒక పల్లెటూరి నేపథ్యం కలిగిన, మామూలు మధ్యతరగతి మహిళ తన దృఢదీక్షతో సాధించడం విశేషమే కాదు విశిష్టం కూడా! ఆవిడే ఈ కథనానికి నాయిక శ్రీమతి ఆకెళ్ళ (తెన్నేటి) లక్ష్మీ కామేశ్వరి. పట్టుదల, శ్రమ సంస్కృతీ తోడుగా ఆమె తన జీవితాన్ని పండించుకోవడమే కాదు... తన కలల పంటగా జన్మించిన బిడ్డను కళల కాణాచిగా తీర్చిదిద్ది సాధికారతకు అద్దం పట్టారు. మాతృప్రేమకు నిజమైన అర్థం చెప్పారు. తల్లి ఆశకు, ఆశయానికి అనుగుణంగా ఆ చిన్నారి శ్రావణి ఒదిగింది.. చిన్న ప్రాయంలోనే నాట్య శిఖరంగా ఎదిగింది. ఇదీ ఆ తల్లీ తనయల కథ. తూర్పు గోదావరి జిల్లా ఇరుసుమండ గ్రామంలో 1976 ఆగస్టు 29న శ్రీ ఆకెళ్ల సత్య నారాయణ మూర్తి, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులకు లక్ష్మీ కామేశ్వరి జన్మించారు. పదవ ఏటనే ఆమె తండ్రి స్వర్గస్తులు కాగా పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తూ ఆమె తల్లిగారే కుటుంబ బాధ్యతలు చేపట్టారు. కామేశ్వరి కి ఒక తమ్ముడు ఉన్నారు. తల్లి సంరక్షణలోనే వారి చదువులు, వివాహాది కార్యక్రమాలు జరిగాయి. ఆవిధంగా చూస్తే మహిళా నాయకత్వం, సాధికారత లక్ష్మీ కామేశ్వరి కుటుంబంలోనే ఉన్నదని అనిపిస్తుంది. లక్ష్మీకామేశ్వరికి ఇరవయ్యో ఏట 1997 ఫిబ్రవరి 22న తెన్నేటి రవి కుమార్ తో వివాహం జరిగింది. మరుసటి సంవత్సరమే ఆయన ఉద్యోగరీత్యా దుబాయ్ వెళ్లారు. పదమూడు నెలల తర్వాతే మళ్ళీ వారు కలిశారు. అప్పటి పల్లె జీవనం వేరు. ఫోన్ లు కానీ, వీడియో కాల్స్ ఇవేవీ లేవు. 15 రోజుల కి ఒకసారి టెలిఫోన్ బూత్ నుంచి ఫోన్ చేయడం తప్ప ఇంకో కమ్యూనికేషన్ ఉండేదే కాదు. ఇలా ప్రతిరోజూ ఓ యుగంగా గడిపిన జీవితం... భవిష్యత్తులో ప్రతి రోజూ ఎలా గడపాలనే విషయంలో చక్కటి స్పష్టతను ఇచ్చింది. ఆ తర్వాత వారికి ఆడపిల్ల జన్మించింది. శ్రావణి అని నామకరణం చేశారు. ఆడపిల్ల పుడితే కొంచెం తక్కువ ఆనందాన్ని ప్రదర్శించే ఈ సమాజపు నైజం కామేశ్వరి హృదయంలో ఆవేదన నింపేది. ఆ అమ్మ మనసు తన కుమార్తెను అన్నిటా మిన్నగా నిలపాలని తపన పడింది. అందుకే మరో బిడ్డను కావాలని కూడా అనుకోలేదు. ఒక్క పాపనే ఆమె తన కంటిపాపగా మార్చుకొన్నారు.. ఎన్నో సవాళ్ళను, పరీక్షలను ఎదుర్కొని తన లక్ష్యం దిశగా విజయం సాధించి అందరి ప్రశంసలనూ అందుకుంటున్నారు. మూడేళ్ళ వయసులోనే కుమార్తెకి నాట్యంపైఉన్న ఆసక్తిని, అనురక్తిని కామేశ్వరి గమనించారు. తన మనసులో ఉన్న అభిరుచి కూడా అదే కావడంతో మూడున్నర ఏళ్ల వయసులోనే చిన్నారిని ఒక నృత్య శిక్షణాలయంలో చేర్చారు. తర్వాత ఆర్నెల్లకే ఒక మళయాలం పాటకు అభినయిస్తూ శ్రావణి తన తొలి ప్రదర్శన ఇచ్చింది. దీనికి తల్లి మనసు పొంగిపోయినా.. తమ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ శిక్షణ చాలదనిపించింది. ఎక్కడ చూసినా తెలుగు సంప్రదాయం కనిపించేది కాదు.. మలయాళం పాటలే. అయినా శిక్షణ ఆపలేదు. శ్రావణి అనేక మలయాళం పాటలకు నృత్యాలు నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చి భేష్ అనిపించుకుంది. మన కూచిపూడి, మన సాంప్రదాయంలో పాటలు నేర్చుకోవాలి అని ఎంతో తపించేవారు. ఒకసారి వైణిక విద్వాంసులు సుధాకర్ గారితో శ్రీమతి కామేశ్వరి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఆయన తన స్నేహితుడు విజయ్ శేఖర్ (హైదరాబాద్) గురించి చెప్పారు. ఆపైన విజయశేఖర్ గురుత్వంలో శ్రావణికి స్కైప్ లో ఆన్ లైన్ లో క్లాసులు మొదలయ్యాయి. ఆన్ లైన్ క్లాస్ అంటే రివర్సులో చేసి చూపించాలి. అప్పట్లో అందరికీ చాలా ఆశ్చర్యం కలిగేది ఎలా నేర్చుకుంటోంది ఆన్ లైన్ లో ... కష్టం కదా అనేవారు. ఎలా అర్థం అవుతుంది అని ఆశ్చర్యపోయేవారు. అలాగే ఎంతో సాధన చేసి, ఎంతో పరిశ్రమతో శ్రావణి తన ప్రతిభను మెరుగుపరుచుకుంది. తల్లిగా కామేశ్వరి తన కలను సాకారం చేసుకున్నారు. దుబాయి లో తెలుగు వారు చాలా మంది నెమ్మదిగా పరిచయం అయ్యారు. అనతి కాలంలోనే తెలుగు అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాల్లో ఆ తల్లీతనయా ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణగా మారారు. తల్లి కామేశ్వరి ప్రార్థనాగీతంతో సభ మొదలయ్యేది. ఆ తర్వాత కుమార్తె శ్రావణి నృత్య కార్యక్రమం ఉండేది. ఇలా ఎన్నో సంవత్సరాల పాటు వందకు పైగా కార్యక్రమాలు జరిగాయి. ఆవిధంగా ప్రతి తెలుగు కుటుంబంతో వారు సన్నిహితం అయ్యారు. కుమార్తె సాధించిన విజయాలలో తల్లి పాత్ర ప్రముఖంగా కనిపించడం అత్యంత అరుదైన విషయం. అలాంటి అరుదైన సందర్భాన్ని మనం నాట్యకళాకారిని శ్రావణి సాధించిన విజయాలలో చూడవచ్చు. కుమార్తెను గొప్ప నర్తకిగా చూడాలన్న కామేశ్వరి ఆశయబలమే ఇందుకు కారణం. భక్తి, సహనం, కఠోరపరిశ్రమ, చిత్తశుద్ధి, క్రమశిక్షణ వంటి లక్షణాలు మేళవించుకొన్న ఉత్తమ వ్యక్తిత్వం తో ఆమె ఎన్నో అవరోధాలను అధిగమించారు. దుబాయిలో తెలుగు అసోసియేషన్ వారు ప్రౌడ్ మదర్ (Proud Mother), దుబాయి ఆడపడుచు, Traditional Women of Dubai(దుబాయ్ సాంస్కృతిక మహిళ) , స్ఫూర్తి మహిళ (Inspiring women) అవార్డులను శ్రీమతి లక్ష్మీ కామేశ్వరికి బహూకరించారు. 2015లో రసమయి అసోసియేషన్ కార్యదర్శి శ్రీమతి క్రిష్ణవేణి గారి ద్వారా శ్రావణి ఇండియా లో మొదటి ప్రదర్శన ఇచ్చింది. హైదరాబాద్ త్యాగరాya గాన సభ లో హంపీ విరూపాక్ష పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విరూపాక్షానంద స్వామి వారి సన్నిధిలో ఈ ప్రదర్శన ఇవ్వడం ఒక గొప్ప విశేషం. ఆ తర్వాత ఇండియా లో తిరువనంతపురం, గురువాయూర్, ఆలీఘర్, సింహాచలం, అన్నవరం, రాజమండ్రి, విశాఖ పట్నం, విజయవాడ, అవనిగడ్డ తదితర చోట్ల ప్రదర్శనలు ఇచ్చి పలు అవార్డులను, రివార్డులను శ్రావణి సొంతం చేసుకుంది. యువ నాట్య సారథి, నాట్య భ్రమరి, నాట్య శృంగార మయూరి, నాట్య వతంస, నాట్య కళామణి, నాట్య జైత్ర వంటి బిరుదులతో పాటు డాక్టర్ సి. నారాయణరెడ్డి కళా పురస్కారం, ఆకెళ్ల ఫౌండేషన్ వారి ప్రతిభా పురస్కారం కూడా శ్రావణి అందుకుంది. ఒక్క పిల్లలు వున్న వారు ఎవరితోను కలవరు, మైల్డ్ గా ఉంటారు అనే ఆలోచన, కొందరి అభిప్రాయం తప్పు అని నిరూపించడానికి ఆ తల్లి తీసుకున్న శ్రద్ధ అపారం. తానే ఒక స్నేహితురాలిగా మసలి కుమార్తెను ఎప్పుడూ సందడిగాఉంచేవారు. శ్రావణి లో ఆత్మస్ధైర్యం మరింత పెరగడానికి మార్షల్ ఆర్ట్సు నేర్పించారు. 10సంవత్సరాల వయసు లోనే శ్రావణి కరాటేలో బ్లాక్ బెల్ట్ తెచుకుందంటే ఆ తల్లిదండ్రుల కృషి, ప్రోత్సాహం ఎంత ఉందో వేరే చెప్పనక్కరలేదు. కుమార్తె నాట్యరంగంలో మంచి పేరు తెచుకోవాలన్నది ఒక్కటే వారి ధ్యేయం. అందుకోసం కామేశ్వరి, రవి కుమార్ దంపతులు చేసిన కృషి ఎంతో ఉంది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో , సెలవుల్లో తప్పనిసరిగా ప్రోగ్రాంలు వుండేవి. ప్రోగ్రాం అంటే నెల, రెండు నెలల ముందు నుండి ప్రాక్టీస్ తప్పదు. దుబాయి లో కార్యక్రమం అంటే.. వీరు షార్జా నుంచి వెళ్ళాలి. కార్యక్రమం చిన్నదా పెద్దదా అని లేకుండా ప్రతి దానికీ తీసుకువెళ్ళేవారు. కామేశ్వరి కృషి చొరవ తన కుటుంబం వరకే ఆగిపోలేదు. డబ్బు అవసరం, కష్టం విలువ తెలిసిన ఆమె మంచి మనసు సమాజ క్షేమానికి సహితం పాటుపడింది. సంగీతం నేర్పగా వచ్చిన డబ్బు ని పేదల మేలు కోసం ఆమె ఉపయోగించారు. దుబాయి జైలులో వున్న భారతీయులను విడిపించడానికి, ఇండియా లో నిరుపేదలకు సహాయం చేయడానికి ఎంతో వెచ్చించారు. చెవిటి మరియు మూగ పిల్లలకు వినికిడి యంత్రాలు అందజేయడమే కాకుండా వారికి అన్నదానం, వస్త్రాల అందజేత వంటి సేవలు అందజేశారు.


ముఖాముఖీ... ప్ర) కామేశ్వరి గారూ... బాల్యంలో మీరు ఏమి సాధించాలని .. లేదా ఏమి కావాలని అనుకునే వారు? జ) నాకు చిన్నప్పటినుంచీ సంగీతం, నృత్యం ఈ రెంటిపైనా అమితమైన ఆసక్తి ఉండేది. కానీ నాకు పదేళ్ల వయసు వచ్చేసరికే నాన్నగారు మరణించారు. ఆపైన పుట్టెడు దుఃఖంలో కూడా మా అమ్మగారు కుటుంబ బాధ్యతలు చేపట్టారు. ఇరవయ్యో సంవత్సరంలోనే నాకు పెళ్లి జరిగింది. ఆ మధ్యలో పదేళ్ళూ మా కష్టాన్ని మర్చిపోవడం.. కష్టసుఖాలను అనుగుణంగా నడచుకోవడమే అయింది. నాకు అప్పట్లో ఏవో ఆశయాలు, ఆశలూ ఉన్నా, మాకు ఉన్న అవకాశాలకు తగినట్టుగా వాటిని మనసులోనే ఉంచుకున్నాను. ప్ర) పెళ్లయ్యాక వాటిలో ఏదైనా సాధించాలని ప్రయత్నించారా? జ) అదీ జరగలేదండి. 1997 ఫిబ్రవరిలో నా వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత ఆయన ఉద్యోగంలో స్థిర పడడానికి టైం కావలసి వచ్చింది. అయన దుబాయ్ వెళ్లారు. ఆయనకి సహకరిస్తానని ఇచ్చిన మాట కోసం ఏడాది పైగా ఇండియాలోనే మా అత్తవారింట ఉన్నాను. ఆ సమయంలో మా మరిదికి బిజినెస్ లో సహాయం చేసేదాన్ని. ప్ర) మీ అమ్మాయి ఎప్పుడు పుట్టింది? అప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి? జ) కడుపుతో వుండగానే ఆడపిల్ల పుట్టాలని, ఆమెను ఒక గొప్ప డాన్సర్ చేయాలని ఎన్నో అనుకున్నాను. అవన్నీ నిజమై 2000 సంవత్సరం మే 24వ తేదీన ఆడపిల్ల పుట్టింది. మగపిల్ల వాడు పుడితే ఉన్న ఆనందం ఎందుకో ఈ సమాజంలో ఆడపిల్ల పుడితే ఉండడంలేదు. ఎవరైనా తొమ్మిది నెలలు కష్టపడితేనే పుడతారు అన్న ఆలోచన ఇప్పటికీ చాలా మందికి లేదు. ఎవరి జీవితమూ అందుకు అతీతం కాదు. నాకు పుట్టిన ఆడపిల్ల ఎందులోనూ తక్కువ కాకూడదని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాను. మగపిల్లవాడు పుట్టాలని కోరుకోలేదు.. అందుకు మరో అవకాశం ఇవ్వలేదు. నా కూతురుని నా ఆలోచనలకూ, ఆశలకు తగినట్లుగా భిన్నంగా పెంచాలన్న పట్టుదల పెరిగింది. ప్ర) దేశం కాని దేశంలో జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఏమనిపించింది? జ) మొదట్లో చాలా ఆందోళనగా ఉండేది. 2003లో శ్రావణి ని తీసుకుని దుబాయి వెళ్లాను. అంతా కొత్త వాతావరణం. తెలుగువారు ఎవరూ పరిచయం కాలేదు. ఆయన ఉద్యోగానికి వెళ్తే శ్రావణి తో కలిసి టివి చూస్తూ కాలం గడిపేదాన్ని. ప్ర) శ్రావణిలో నాట్యం పట్ల ఉన్న ఆసక్తిని ఎలా గమనించారు? ఆ దిశగా ప్రోత్సహించాలి అని ఎందుకనిపించింది? జ) మూడేళ్ళ వయసులో శ్రావణి టీవీలో శ్రుతిలయలు సినిమా లో బాబు ప్లేట్ మీద డ్యాన్స్ చేసే సన్నివేశాన్ని చూసింది. ఇంట్లో వున్న ప్లేట్లు, కంచాలపై నిలబడి నెత్తిన వాటర్ బాటిల్ పెట్టుకుని డాన్స్ చేయాలని ప్రయత్నించేది. అమ్మా నాకు blood రావట్లేదు అనేది. ఇది చూసేసరికి తనకి డ్యాన్సు పై ఎంతో ఇంట్రెస్ట్ ఉందని అర్థమైంది. తను కడుపులో ఉన్నప్పటినుంచీ నా ఆలోచనా అదే కాబట్టి.. ఆమెను మంచి డ్యాన్సర్ గా తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. ప్ర) మీకు అభినివేశం, ప్రావీణ్యం ఉన్న కళలు, నైపుణ్యాలు ఏవి? జ) సంగీతం నేర్చుకున్నాను. అది పదిమందికి నేర్పుతున్నాను. మిగతావి అంటారా.. పెద్ద ప్రావీణ్యం అని కాదు కానీ, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేయడం నాకు అలవాటు. గ్లాస్ పెయింటింగ్, శారీ పెయింటింగ్, సాఫ్ట్ టాయిస్ తయారీ వంటివి చేస్తూ ఉంటానండి. ప్ర) నోములు, వ్రతాలకు మీ ఇంటిని చిరునామాగా చెబుతారట కదా! జ) అవునండి. అది చాలా ఆనందం కలిగించే విషయం నాకు. శ్రావణి కి కన్నె నోములు, శ్రావణ మంగళవారం నోములు అన్నీ చేయించాము. ఇక్కడ మొదట్లో ఐదుగురు ముత్తయిదువులు దొరకటం చాలా కష్టం అయ్యేది. అలా ఒకరొక్కరుగా పరిచయం చేసుకొని ఎంతో మంది తెలుగు వారిని కలిశాను. మేము ఉండేది అప్పట్లో చిన్న రూమ్ లోనే. కొంతమంది కి నామోషీ గా వుండేది. పసుపు, కుంకుమ కి కూడా కొందరు స్టేటస్ చూసేవారు. అలాగే శ్రావణి కి ఐదు సంవత్సరాలు నోములు పూర్తి చేశాను. వాటిలో కష్టం తెలిసిన దానిని కాబట్టి ఆపైన అడిగిన వారికి సహాయపడేదాన్ని. 12 సంవత్సరాల పాటు మా ఇంట్లోనే నోములు జరిగాయి. ఎవరికైనా ముత్తయిదువులు కావాలి అంటే షార్జా లో ఫలానా లక్ష్మీ కామేశ్వరి గారికి చెప్తే లోటు వుండదు అని చెప్పుకునే వారు. మనం పడిన కష్టం ఎదుటి వారు పడకూడదు అనే ఉద్దేశంతో పడిన కష్టం ఫలించింది అనుకుంటాను నేను. ప్ర) నృత్యం అంటే కాస్త ఖరీదైన విషయం కదా? ఎప్పుడూ మీకు ఇబ్బంది అనిపించలేదా? జ) నిజం అండీ. డ్యాన్సు అంటే చాలా ఖర్చు తో కూడిన విషయం. అప్పట్లో చాలీచాలని జీతం.. పైగా మూడు, నాలుగు నెలలకి ఒకసారి జీతం వచ్చేది. స్టూడియో ఫ్లాట్ అంటే ఒక చిన్న రూమ్ లోనే ముగ్గురం కాలక్షేపం చేసేవాళ్ళం. ఆర్థికంగా ఇబ్బంది పడినా.. కోరుకున్న గమ్యం కాబట్టి బాధ పడలేదు. ప్ర) మీ వారి ప్రోత్సాహం, సహకారం గురించి? జ) ఆయన సివిల్ ఇంజనీర్. ఉద్యోగరీత్యా సైట్ లో ఎక్కువ సమయం వుండేవారు. ఆయన కూడా మా లక్ష్యమే తన ధ్యేయం అనుకున్నారు కాబట్టే ఇవాళ అనుకున్నది చేయగలుగుతున్నాం. 50 డిగ్రీల ఎండలో రోజంతా ఉద్యోగం చేసి వచ్చి.. సాయంత్రం మమ్మల్ని ప్రోగ్రామ్ కి తీసుకెళ్లేవారు. వచ్చిన జీతం లోనే డ్యాన్సు , చదువు, ఇంటి ఖర్చు లు అన్నీ. ఆశయం ఉండి, అది సాధించాలనే పట్టుదల ఉంటే ఏవీ కష్టం అని అనిపించవు. ఉన్న దాంట్లోనే మా జీవితం చాలా సంతోషంగా సాగేది. ప్ర) మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? జ) శ్రావణి నృత్య కార్యక్రమాలపైనే ఎక్కువ సమయం గడిచేది. ఒక పక్క పూజలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, మరోపక్క శ్రావణి డ్యాన్సు, చదువు వ్యవహారాలు చూసుకునే దాన్ని. ఇంట్లో, బయట సమర్ధించుకుంటూ రావడం అంటే మాటలు కాదు. ప్ర) అప్పట్లో మీరు పడిన కష్టం, ఇబ్బంది ఎలాఉండేది? జ) ఒక పక్క ఇంటికి వచ్చి హోమ్ వర్కు, కరాటే, ఆన్లైన్ డాన్స్ క్లాసులు ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూనే శ్రావణి డ్యాన్సు ప్రోగ్రాంలు ఇచ్చేది. ఎప్పుడూ కూడా సాకులు వెతికి ప్రోగ్రాం మానేయడం, ప్రాక్టీస్ కి వెళ్ళకపోవడం అనేది లేదు. కొంచెం పెద్దయ్యాక మెట్రో దాకా టాక్సీ లో వెళ్లి అక్కడి నుండి ప్రాక్టీస్ కి వెళ్ళేది. ఈవినింగ్ క్లాసులు అయ్యాక వంట చేసి ప్యాక్ చేసుకుని ఆయన ఆఫీసు నుండి వచ్చాక ఇద్దరం శ్రావణి ప్రాక్టీస్ దగ్గర కు వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్క సారి రాత్రి 11, 12అయ్యేది. కింద కారు లో వెయిట్ చేసేవాళ్ళం. ముగ్గురికీ బాక్సులో భోజనం కలిపి తీసుకుని వెళ్ళేదాన్ని. ప్రాక్టీస్ అయ్యాక కారు లోనే తినే వాళ్ళం. సిగ్నల్ వచ్చినప్పుడు ఆయన తినే వారు, కారు డ్రైవ్ చేస్తుంటే మేము తినే వాళ్ళం. హోమ్ వర్కు కారు లోనే చేసుకుని పడుకునేది. ఇలా ఎన్నో సంవత్సరాల పాటు బాక్సులో కలిపిన భోజనమే కానీ ఇంట్లో వేడిగా తిన్న రోజులు లేవనే చెప్పాలి. ప్ర) మరి ఎక్కువగా ఆనందపడే సందర్భాలు? జ) శ్రావణి గురించి కదా ఇదంతా చేస్తున్నాం అనే ఆనందం తో ఏదైనా చేసేవాళ్ళం. పండగ వస్తోందంటే మాకు పిండివంటలు వండుకుని తినడం అనే ఉండేది కాదు. మేకప్ లు, ప్రోగ్రాంల హడావిడి. తెలుగు వారందరితో కలిసి పండుగ చేసుకుంటున్నాం అన్న ఆనందం. మా శ్రమ అంతా శ్రావణి స్టేజ్ మీద డ్యాన్సు చేస్తుంటే చూసినప్పుడు తీరిపోయేది. ప్ర) మీ దైవభక్తి గురించి చెప్పండి? జ) చిన్నప్పటినుంచే నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. లలితాపారాయణ చేస్తూ ఉంటాను. కోటి సార్లు లలిత సహస్రం పారాయణ చేసే శక్తి ని అమ్మ నాకు అనుగ్రహించింది. శ్రీ విద్యా ఉపాసన ఉంది. ప్ర) సంగీతం నేర్చుకున్నారు కదా... మరి ఆ రంగంలో ఏదైనా సాధించాలి అనుకోలేదా? జ) సంగీతం కొంత వరకు నేర్చుకున్నాను. ఆ వచ్చిన విద్య ని మరిచిపోకుండా నా పిల్లలకి కి నేర్పు లక్ష్మీ అని ఓ ఫ్రెండ్ అందడంతో అన్న ఫ్రెండ్ మాటతో ఆమె ఇద్దరు పిల్లలకీ నేర్పడం ప్రారంభించాను. ఇవాళ ఆ సంగీత శిక్షణ 25 మంది పిల్లలకు ఇవ్వగలుగుతున్నాను. ఇదంతా అమ్మవారి సంకల్పం అనే చెప్పాలి. ప్ర) కరోనా లాక్ డౌన్ వలన మీరు ఇండియాలో ఉండిపోవలసి వచ్చింది కదా.. ఈ సమయంలో మీ వ్యాపకం గురించి చెప్పండి. జ) జనవరిలో ఓ పని మీద ఒక్కదానినే ఇండియా రావలసి వచ్చింది. ఫిబ్రవరి లో పెళ్లి రోజు కావడంతో మళ్ళీ దుబాయ్ వెళ్లి ఇండియా వచ్చాను. ఆపైన కరోనా ప్రభావం, లాక్ డౌన్ వల్ల ఇక్కడే అమలాపురంలో ఆగిపోవలసి వచ్చింది. ఈ సమయంలో ఇంట్లో నే మాస్కులు కుట్టి చాలామందికి పంచిపెట్టాను. ప్ర) మహిళల విషయంలో సమాజం ఆలోచనలో ఎటువంటి మార్పు రావాలనుకుంటున్నారు? జ) భర్త ఉద్యోగ రీత్యా కానీ, మరొక పని మీద కానీ భార్య ని పిల్లల్ని వదలి ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్లినా తప్పుగా అనుకోరు. కానీ ఆడది ఇంటి కోసం పిల్లల కోసం గడప దాటి బయటకు వస్తే మాత్రం ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు కూడా తప్పుగానే చూస్తారు. ఇదీ నేటి నైజం. ఈ ఆలోచనలలో మార్పు వస్తుంది అనుకోవడం మన భ్రమ. ఈరోజుల్లో మగ పిల్లలు, ఆడపిల్లలు బయటకి వెళ్లి చదుకోవలసిన పరిస్థితులు. కాస్తో కూస్తో వంట, ఇంటి పనూలు నేర్చకోక తప్పడం లేదు అందరికీ. ఇదివరకు ఆడపిల్లే ఇంట్లో పని చేయాలని, మగపిల్లవాడు తిని కూర్చోవాలని భావించి అలానే పెంచేవారు. ఇప్పుడు పరిస్తితులు వేరు. ఇద్దరూ బయటకు వెళ్లి సంపాదించుకుంటేనే కానీ ఇల్లు గడవని పరిస్థితులు ఉన్నాయి. ఇంటి పనుల్లో కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటున్నారు. ఇలాంటి కుటుంబాల్ని చూసి అయినా మన దృక్పథాన్ని మార్చుకోవాలి. మగపిల్లవాడు మాత్రమే కష్టపడిపోతున్నట్లు భావించడం తల్లి తండ్రులకు కరెక్టు కాదు. ప్ర) చివరిగా తల్లిదండ్రులకు, పిల్లలకు మీరు ఇచ్చే సందేశం లేదా సలహా? జ) సందేశాలు ఇచ్చేటంత స్థాయి కాదు గానీ.. హృదయపూర్వకంగా ఒక మంచి సూచన చెబుతాను. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలకు అనుగుణంగా వారికి సహకరించాలి. మంచి సలహాలు ఇస్తూ వారిని వారి లక్ష్యాలకు చేరువ చేయాలి. పిల్లలకు ఏమి ఇష్టమో మనం తెలుసుకుని వారి ఇష్టానుసారం చేయిస్తే పిల్లలు కూడా ఆ పని కష్టంతో కాకుండా ఇష్టం తో చేస్తారు. అప్పుడే వారు అనుకున్నది సాధిస్తారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు