కొత్త రాజావారి దేవతా వస్త్రాలు


ఇదో సరదా కథ...

రాజావారి దేవతావస్త్రాల కథకి కొంచెం ఆధునిక రూపం.. ఈ కథ ఎవరినీ ఉద్దేశించింది కాదు..

రాజుగారు స్నానం చేసి తువ్వాలుతో బయటికి వచ్చారు.

తదుపరి ఏదో ధ్యాసలో ఉండి ఆ తువ్వాలు మంచంపై పడేసి అద్దం ముందుకి వెళ్లి గడ్డం సవరించుకున్నారు.

నీటుగా తల దువ్వుకొని పౌడర్ రాసుకున్నారు. చేయాల్సిన సోకంతా చేసుకున్నారు.

ఈలోపు బయటినుంచి భజన బృందాలు జై హో జై హో అని దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తుంటే ఆ పరవశంలో పడి అలాగే బయటికి వచ్చేసారు!

రాజుగారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన అభిమానజనంలో ఉత్సాహం మరింత మిన్నంటింది.

ఒక్కసారిగా దూసుకొచ్చి పూలమాలలతో కప్పేశారు.

ఈ మహా హంగామాలో అసలు రాజు ఒంటిమీద గుడ్డలున్నాయో లేదో చూసిన వాళ్లే తక్కువ!!

అదేంటి ఇలా వచ్చేసాడని ఆ కొందరూ పక్కవాళ్ళతో అంటే...

ఎహె బట్టల్లేకపోవడం ఏమిటి? అయ్యి అందరికీ కనిపించవు లే! నీకేదో దుర్బుద్ధి ఉండి ఉంటుంది.. అంటూ అనుమానంగా చూసారు వాళ్ళవైపు!!

శత్రుదేశం వాడివా అంటూ గుచ్చి గుచ్చి నిలదీశారు..

దాంతో ఆ కొద్దిమంది కూడా సర్దుకుని తమ దృష్టి మార్చేసుకున్నారు..

ఇప్పుడు రాజుగారి వంటిపై దేవతా వస్త్రాలు.. లేదా చంద్రమతి మాంగల్యమూ వారికి చక్కగా ప్రకాశిస్తూ కనిపించాయి.

ఈ గందోళీ కంగాళీ బ్యాచ్ లో ఇంకొందరు మేధావులున్నారు... వాళ్లకి కళ్ళు బానే కనిపించాయి.. కానీ ఇవాళ తమ రాజు ఏదో మహాద్భుతం చేయబూనాడని.. అందుకే ఇలా వచ్చాడు తప్ప దుస్తులేసుకోవడంలో మరపు కానే కాదని వారి నమ్మకం. దాంతో వారి ఉత్సాహం మరింత మిన్నంటింది. అభిమానుల ఊపు చూసి రాజుగారి పరవశం మరింత వశం తప్పింది. ఇక ఊరేగింపు పెట్టి మరీ చిందులేయడం మొదలెట్టాడు రాజు.

అనేకమంది అభిమానుల కన్నుల పండువలా సాగిపోతున్న ఆ నృత్య హేల అక్కడక్కడా కొందరి దృష్టికి మాత్రం దారుణంగా కనిపిస్తోంది.. వాళ్ళు హతవిధీ అని కళ్ళు మూసుకుని తప్పుకుంటున్నారు!

అలా రాజుగారి ఊరేగింపు పూర్తయింది..

ఊగుతూ తూగుతూ తిరిగి ఇంటికి చేరుకున్నారు.

అప్పటికి పూలదండలు కూడా చిందులు తాకిడికి రాలిపోయాయి.

ఒక రకమైన మదంతో మైకంతో ఇంట్లోకి వెళ్లిన రాజాధిరాజు తనకి ఎంతో ఇష్టమైన అద్దం ముందుకి వెళ్లి ఠీవిగా మీసం తిప్పుకోబోయి... గతుక్కుమన్నాడు!

ఇంతసేపూ ఇలాగే తిరిగేనా ఊరంతా? అని సిగ్గుపడబోయాడు! కానీ సిగ్గు రాలె!

తనతో పాటు ఈ రోజంతా చిందులేసిన జనాన్ని తలచుకున్నాడు..

వారిలో ఇనుమడించిన ఉత్సాహాన్ని గుర్తు చేసుకున్నాడు!

జనం ఊపుకి ఇదే అసలు కారణం కదా అనుకున్నాడు..

తన జనాకర్షణ శక్తికి తానే ఒక్కసారి మురిసిపోయాడు..

ఇకపై ఇలాగే ఉండాలని నిర్ణయించుకున్నాడు..

ఇంకేముంది.. ఇక ప్రతిరోజూ కనులపండగే ఆ రాజ్యంలో..

రాజుగారి చిందులు.. అభిమానుల కేరింతలు.. ఓహో.. ఒకటే సందడి!!

ఇలా రోజులు గడిచే కొద్దీ రాజ్యంలో ఒక్కొక్కడూ రాజుగారిలాగే తయారవుతున్నారు.

వారి వారి సొంత భజన బృందాల్ని వెంటేసుకుని డ్యాన్సు ప్రోగ్రాములు విరివిగా పెట్టేస్తున్నారు.

కొన్నాళ్ల తర్వాత విషయం అందరికీ అర్థమైంది..

ఇక్కడ తప్పు ఎవరిదా అని బుర్ర ఉన్నవాళ్ళంతా కూర్చుని ఆలోచించారు.

రాజుగారి తప్పేం లేదని.. జనమే తమ గుడ్డి అభిమానంతో ఆయన్ని బోల్తా కొట్టించారని.. జనం ఆనందం కోసమే ఆయన అలా అనితరమైన త్యాగం చేయాల్సి వచ్చిందని ఏకగ్రీవంగా తీర్మానించారు.

అప్పుడా రాజుగారికి దేశ రత్న బిరుదు ఇచ్చి సత్కరించారు.

ప్రజలు కోరుకున్నరీతిలో విగ్రహం పెట్టిస్తాం గానీ.. ఇక మీఱు మామూలుగా ఉండండి చాలని వేనోళ్ళ వేడుకున్నారు.

అందరి ప్రార్థనలూ విన్నమీదట రాజుగారు శాంతించారు.

ఆపైన వంద అడుగుల బాహుబలి విగ్రహాన్ని ప్రజల ఆకాంక్షలకి ప్రతిబింబంగా అక్కడ నెలకొల్పారు!

రాజుగారి భ్రమలు నశించాయి..

ఆయన రిటైర్మెంట్ ప్రకటించుకుని తపస్సుకి వెళ్ళిపోయాడు!

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us