ఓసీల అభివృద్ధికి సబ్ ప్లాన్ వేయాలి


వృత్తి, ఉద్యోగుల,పట్ట భద్రుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పులుగుర్త సాయిబాబా డిమాండ్ ఓసీల అభివృద్ధికి వెంటనే సబ్ ప్లాన్ వేయాలని ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల వృత్తి, ఉద్యోగుల,పట్ట భద్రుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పులుగుర్త సాయిబాబా డిమాండ్ చేశారు. ఈ సంఘానికి రెండవ సారి ఆయన్ను అధ్యక్షునిగా నియమిస్తూ ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర రెడ్ది ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్రపప్రదేశ్, హైదరాబాద్, ఢిల్లీలలో పేదలకు విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సహకారించాలని ఈ సందర్భంగా ఆయన సాయిబాబాకు సూచించారు. ఈ సందర్భంగా పులుగుర్త సాయిబాబా మాట్లాడుతూ ఓసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.ఇతర కులాలకు ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్) నిధులు కేటాయించిన విధంగానే అగ్ర వర్ణాలలో‌ 80 శాతంగా ఉన్న పేదలకు కూడా ఓసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని సాయిబాబా సూచించారు.ఇతర వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు తమ వర్గాల సమిష్టి అభివృద్ధికి కృషి చేస్తూంటే ఓసీ ప్రజా ప్రతినిధులు మాత్రం పదవుల కోసం పాకులాడుతున్నారని ఆయన ఆక్షేపించారు.అన్ని కులాల్లో పేదరికం ఉన్నట్లే అగ్ర వర్ణాలలో కూడా పేదరికం ఉందని గుర్తు చేశారు.ఓసీలు అనే నేపంతో ఆయా వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను దూరం చేయడం తగదన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న సుమారు 176 మంది ఓసీ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు తమ సామాజిక వర్గంలోని పేదల అభ్యున్నతికి ప్రయత్నంచక పోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించాలన్న మౌలిక లౌకిక రాజ్యంగ స్పూర్తిని విస్మరించడం అన్యాయమన్నారు. కులం,మతం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారే తప్ప ఓసీల అభివృద్ధికి ప్రయత్నించడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపేణా కోట్లాది ధనం అగ్ర వర్ణాలకు చెందిన వివిధ వాణిజ్య, పారిశ్రామిక వేత్తల నుంచి వస్తున్నందున ఆ మేరకు ఆ నిధుల నుంచి అగ్రవర్ణాల పేదలకు ఉప ప్రణాళికను ఏర్పాటు చేయాలి అని సాయిబాబా డిమాండ్ చేశారు.దేశంలో ఆరు కోట్లకు పైగా అగ్ర వర్ణ పేదలు దుర్భర పేదరికాన్ని అనుభవిస్తున్నారని,వారికి ఓబీసీలతో సమానం గా విద్య, ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించాలపేర్కొంటూ మేజర్ జనరల్ సిన్హా సమగ్ర నివేదికను సమర్పించి ఆరేళ్లు గడుస్తున్నా ఆ దిశగా ప్రభుత్వాలు చొరవ చూపకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.కేంద్రం ఓబీసీలకు 5 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టిప్పటికీ వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో గత సంవత్సరం ఎంతో మంది నిరుద్యోగులు రిజర్వేషన్లు కోల్పోయారని గుర్తు చేశారు.కేంద్రం అమలు చేసిన రిజర్వేషన్లను తాము అమలు చేస్తే ఆ ఖ్యాతి కేంద్రానికి వెళ్లిపోతుందనే దుగ్ధతో రాష్ట్రాలు వ్యవహరించడం నిరుద్యోగులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.గతంలో యు.పి.ఎ,ఎన్.డి.ఎ ప్రభుత్వాలు అగ్ర వర్ణ పేదల స్థితి గతులపై పలు కమిషన్లను వేశారని, అయితే వాటి నివేదికలను బుట్ట దాఖలు చేశారని ఆరోపించారు.ఇది ఓసీల పట్ల ఆ ప్రభుత్వాలకు ఉన్న నిర్లక్ష్యాన్ని చాటుతోందన్నారు. ఓసీలకు మండలం స్థాయిలో సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అర్హులైన ఓసీ పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని కోరారు. రిజరేషన్ల వ్యవస్థ ప్రారంభమైన నాటి నుండి నేటి వరకూ ఏఏ వర్గాల అభ్యున్నతికి ఎంతెంత మేరకు నిధులు కేటాయించారో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు శ్వేత పత్రం ప్రకటించాలని సాయిబాబా డిమాండ్ చేశారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us