నేపాల్ లోని ప్రముఖ శైవక్షేత్రం పశుపతినాధ్


పశుపతినాథ్ దేవాలయం నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు నగరం ఈశాన్య దిక్కులో బాగమతి నది ఒడ్డున ఉంది. పశుపతి అంటే శివుడు ఇక్కడ దైవం. ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ ఆరామంగా గుర్తింపు పొందింది. భారతదేశం, నేపాల్ దేశాలకి చెందిన భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి నాడు ఈ ఆలయం వేలాదిమందితో పోటెత్తుతుంది. ఈ దేవాలయంలోకి హిందువులను మాత్రమే అనుమతిస్తారు. మూల విరాట్టుని స్పృశించే అధికారం నలుగురు అర్చకులకు మాత్రమే ఉంది. శంకరాచార్య సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం వారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ , జంతు బలి కార్యక్రమాలను నిషేధించారు. స్థలపురాణం : శివుడు ఒకప్పుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు, శివుని స్వ స్వరూపంలో చూడాలని ఆశించి దేవతలు ఆ జింక కొమ్ముని పట్టుకొన్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగి పోయింది. దానిని ఇక్కడ ఖననం చేసారు. ఆతర్వాత వందల సంవత్సరాల అనంతరం ఒకనాడు ఒక ఆవు ఇక్కడ పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి చూసాడు. అనంతరం అక్కడ త్రవ్వి చూడగా శివ లింగం బయట పడింది. ఇంకో ఇతిహాసం నేపాల మహత్యం, హిమవత్‌ఖండంలో ఉంది. దీని ప్రకారం ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డుకి వచ్చి మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా జింక అవతారంలో నిద్రిస్తున్నాడు. అపుడు దేవతలు శివుడిని కాశి తిరిగి తీసుకొని పోవడానికి ఆ జింకని లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. అందుకే శివుడు ఇక్కడ చతుర్ముఖ లింగం గా దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన ఆధారాలు లేవు. గోపాలరాజ్ వంశావళి పత్రిక ప్రకారం లించచ్చవి రాజు శుశూపదేవ క్రీ.శ.753 సంవత్సరంలో ఈ ఆలయనిర్మాణం జరిపాడని, పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా వెల్లడైంది. 1416 లో రాజా జ్యోతి మల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని, 1697లో రాజా భూపేంద్ర ఈ గుడిని పునర్నిర్మించాడని తెలుస్తోంది. నేపాల్ దేశం పశుపతినాథ్ మీద ఆధారపడి నడుస్తున్నది అని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ దేవాలయం పగోడ వలె ఉంటుంది. రెండు పైకప్పులు రాగి, బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి. నాలుగు ప్రధాన ద్వారాలకు (తలుపులకు) వెండి తాపడం ఉన్నది. పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఈ నంది విగ్రహం 6 అడుగుల ఎత్తు, అదే చుట్టుకొలత కలిగి ఉంది. ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ. మూల భట్ట (ప్రధాన అర్చకుడు) ఆలయ విశేషాలను నేపాల్ రాజుకి తెలియజేస్తుంటాడు. ఈ దేవాలయం తూర్పున వాసికినాథ్ దేవాలయం ఉంది. పశుపతినాధ్ గుడి ప్రక్కనే బాగమతి నది ఒడ్డున ఆర్యాఘాట్ అనే ప్రదేశంలో శ్మశాన వాటిక ఉంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us