ఒప్పంద సిబ్బంది వెతలు తీర్చిన సర్కారు


అటవీ శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న సిబ్బంది కొన్ని మాసాలుగా జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి వేతన వెతలను తీర్చే దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. వనరక్షణకు క్షేత్రస్థాయిలో ఎంతో కృషికి చేస్తున్న ఈ సిబ్బంది కొన్ని మాసాలుగా జీతాలు అందక కష్టాలు పడుతున్న పరిస్థితిని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (అటవీ దళాధిపతి) ఎన్ ప్రతీప్ కుమార్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వివరించారు. గత మార్చి నుంచి నాలుగు నెలలుగా అనివార్య కారణాల వలన వేతనాలు అందక ఈ సిబ్బంది తీవ్ర ఇబ్బదులు పడుతున్నారనే విషయాన్ని రాష్ట్ర ఆటవిదళాధిపతి మంత్రికి వివరిస్తూ వారికి వెంటనే వేతనాలు చెల్లింపునకు అనువైన ఉత్తర్వులను కోరారు. వెంటనే సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్ద మంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించగా ఆయన స్పందించారు. తక్షణం వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేస్తూ అందుకు అవసరమైన రూ.9.22 కోట్లు విడుదల చేశారు. జీతాలు లేక కుటుంబపోషణ కూడా కష్టంగా మారిన నేపథ్యంలో మానవత్వంతో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహృదయాన్ని ఇప్పుడు అటవీ అవుట్ సోర్సింగ్ఆ సిబ్బంది శ్లాఘిస్తున్నారు. పలుచోట్ల అయన బ్యానర్లు, కటౌట్లకి క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం ఫలితంగా అటవీశాఖలో పనిచేస్తున్న 2592 మంది ఒప్పంద సిబ్బందికి నాలుగు నెలల వేతనాలు లభించాయి. ఉద్యోగుల్లో సీఎం నిర్ణయంతో హర్షం వ్యక్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అటవీశాఖలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఈ ఒప్పంద ఉద్యోగులు అటవీ సంరక్షణ, అభివృద్ధిలో కీలక సేవలు అందిస్తున్నారు. అటవీ రక్షక దళ సిబ్బందిగా,బేస్ క్యాంప్ వాచర్లు ,ప్రొటెక్షన్ వాచర్లు, చెక్ పోస్టుల సిబ్బందిగా, డ్రైవర్లుగా సేవలు అందిస్తున్న ఒప్పంద ఉద్యోగులు పొరుగు సేవల కింద విధులు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా ప్రాణాలను తెగించి అటవీ సంపదను కాపాడుతున్న సిబ్బందికి వెంటనే వేతనాలు చెల్లించాలని అదేశించడమే కాకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి వారి సేవలను కూడా కొనియాడారు. భవిష్యత్ లో ఒప్పంద ఉద్యోగుల వేతనాలు ఆలస్యం కారాదని, అవి సకాలంలో అందేలా చూడాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒప్పంద సిబ్బంది వేతన బకాయిల తక్షణ చెల్లింపులకు గాను రూ. 9 కోట్ల 21 లక్షల 91 వేల 700 రూపాయలను పిసిసిఫ్ ప్రతీప్ కుమార్ విడుదల చేసారు. ఇందులో భాగంగా రాజమండ్రి అటవీ సర్కిల్ కు రూ.1,80 ,80 ,900 మంజురైనాయి. 2020 మార్చి నుంచి జూన్ నెల వరకూ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి బకాయి ఉన్న నాలుగు నెలల జీతాలను ఈ నిధులతో చెల్లిస్తారు. సర్కిల్ పరిధిలోని కాకినాడ డివిజన్ కు 6459600 , ఏలూరు డివిజన్ కు 3886600 , కృష్ణా డివిజన్ (విజయవాడ)కు 1213700 , చింతూరు డివిజన్ కు 3240900 , వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ డివిజన్ (రాజమండ్రి) కి 477100 , వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ డివిజన్ (ఏలూరు) కు 2176500, స్టేట్ సిల్వి కల్చరిస్ట్ (రాజమండ్రి)కి 626500 చొప్పున నిధులను చెల్లించడం రాజమండ్రి సర్కిల్ అటవీ సంరక్షణాధికారి ఎన్ నాగేశ్వరరావు మంజూరు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వెంటనే వేతన బకాయిలను చెల్లించాలని ఆయన డివిజనల్ అటవీ శాఖాధికారులను ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం మానవతాదృక్పథంతో అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల చెల్లింపునకు తీసుకున్న సత్వర చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ శాఖలో ప్రొటెక్షన్ వాచర్లు, బేస్ క్యాంపుల సిబ్బంది, స్ట్రైకింగ్ ఫోర్సు, ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న వేలాదిమంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఈ నిర్ణయం వలన లబ్ధి చేకూరుతుంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం