20 మంది ఆప్ ఎమ్మెల్యేలు అనర్హులయ్యారు


దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి తేరుకోలేనంత గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్‌ ఎమ్మెల్యేలు 20 మందిపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. లాభదాయక పదవులు నిర్వహిస్తున్నందుకు గాను ఈ 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాల్సిందిగా ఎన్నికల సంఘం రెండు రోజుల కిందట రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ప్రతిపాదనకు రాష్ట్రపతి కోవింద్‌ వెంటనే ఆమోదం తెలిపారు. దీంతో దిల్లీ అసెంబ్లీలో ఆప్‌ మెజారిటీ 45కి తగ్గింది. మొత్తం 70 స్థానాలున్న దిల్లీ అసెంబ్లీలో ఆప్‌ సంఖ్యా బలం 65 కాగా అందులో ఇపుడు ఇరవై మంది తగ్గిపోయారు. 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అనర్హత వేటు పడిన వారిలో మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌, శాసన సభ్యురాలు అల్కా లాంబా కూడా ఉన్నారు. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు 2015, మార్చి 13 నుంచి సెప్టెంబరు 8, 2016 వరకు పార్లమెంటరీ కార్యదర్శుల పదవిలో ఉండటం ద్వారా లాభదాయక పదవులను చేపట్టినట్లయిందని, ఫలితంగా శాసనసభ్యులుగా అనర్హులవుతారని రాష్ట్రపతి కోవింద్‌కు ఈసీ ప్రతిపాదన పంపించింది. 21 మంది ఎమ్మెల్యేలలో ఒకరు ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. కాగా ఈ సిఫారసును వ్యతిరేకిస్తూ ఆప్‌ ఎమ్మెల్యేలు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈసీ నిర్ణయాన్ని ఆప్‌ తీవ్రంగా తప్పుబట్టింది.

ముఖ్యాంశాలు