గజేంద్రమోక్షణం... శరణాగత భక్తికి సమగ్ర వ్యాఖ్యానం


భాగవతంలోని గజేంద్ర మోక్షణ ఘట్టం శరణాగత భక్తికి సమగ్ర వ్యాఖ్యానమని... అద్వైతానికి సైతం ఇది దర్శనమని ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ చెప్పారు. శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో ఆయన మంగళవారం రాత్రి 19వ నాటి ప్రవచనం చేస్తూ గజేంద్రమోక్షాన్ని పూర్తిచేసి ఆ పై గజేంద్రుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలిపారు. తదనంతర కథాక్రమంలో భాగంగా... అహంకారం చూపిన ఇంద్రునికి దుర్వాసమహర్షి ఇచ్చిన ఘోరశాపం... పరిష్కారంగా పరమాత్మ అనుగ్రహవిశేషం చేత సాగించిన క్షీరసాగర మథన ఘట్టం చేపట్టారు. మథనంలో ఆవిర్భవించిన హాలాహలాన్ని పరమేశ్వరుడు స్వీకరించి లోకాలను రక్షించిన సన్నివేశాన్ని హృద్యంగా వివరించారు. కూర్మ, మోహినీ అవతార విశేషాలను సమ్మోహనంగా వివరించి సభను పారవశ్యంలో ముంచెత్తారు. పంచరత్న గీతల్లో ఒకటైన గజేంద్రమోక్షణ విశేషంపై గురువుల వివరణ ఇలా సాగింది. గజేంద్రునిలోని జీవుడి నిజమైన వేదన ప్రపంచ పరిపాలకుడైన స్థితికర్త మహావిష్ణువును కదిలించిందన్నారు. నామగుణరూపవిశేషాలు లేని శుద్ధ భగవత్‌ స్వరూపానికి గజేంద్రస్తుతికి మించిన సముచిత నిర్వచనం మరెక్కడా కనిపించదని అభిప్రాయపడ్డారు. ఇందలి ఆకాంక్ష వలననే ఈ స్తోత్రం ప్రశస్తమైందని చెబుతూ జిజీవిషేణ... అన్న గజేంద్రుని మాటను ప్రస్తావించారు. జీవితేచ్ఛ లేదు అని... ఈ ఏనుగు ఉపాధిపై జీవించాలన్న మోహం నశించిందని గజేంద్రుడు చెప్పాడన్నారు. అంతర్ముఖంగా, బహిర్ముఖంగా కూడా వివేకంలేని పశుజన్మగా తన ఉపాధిని గ్రహించి దీనినుంచి విడుదల కోరుకోవడమే ఇందు గ్రహించాల్సిన అంశమన్నారు. లోకంతో పాటు మారే లక్షణం లేని స్థిరమైనది ఏది తన హృదయంలోనే ఉందో.. అట్టి స్థిరమైన దానిని కప్పివేస్తున్న మాయ నుంచి తనకు విముక్తిని గజేంద్రుడు కోరుకున్నాడన్నారు. అట్టి మాయను కల్పిస్తున్నవాడికి నమస్కారమని స్తుతించాడని అంటూ.. జగత్తు ద్వారానే జగదీశ్వరుడ్ని తెలుసుకునే క్రమం ఇదన్నారు. ప్రపంచం మొత్తాన్ని వెలిగించే కాంతి నాలో ఉంటే దానిని చూడనివ్వకుండా అడ్డుపడుతున్న అంధకార ఆవరణాన్ని తొగించమని అనంతశక్తి సంపన్నుడైన పరమాత్మను వేడాడని, ఎవడివలన నాలో అహమనే మాయ జనించినదో వానినే శరణు వేడుతున్నానని చెప్పడం ఇక్కడ గమనార్హమని సామవేదం వారు తెలిపారు. నన్ను ఆశ్రయించిన వాడు మాయనుంచి విముక్తుడవుతున్నాడని భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పిన మాటను ఇక్కడ అనుసంధానం చేసుకోవాలన్నారు. తన మిథ్యాభిమానాన్ని వదిలించి తన స్వస్వరూపాన్ని తెలియజేయాలని అంటూ నామరూపగుణరహితుడైన శుద్ధ పరమాత్మను గజేంద్రుడు వేడుకుంటూ ఉంటే బ్రహ్మ ఇంద్రాదులు, దిక్పాలకులు, సర్వదేవతలు కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారన్నారు. గజేంద్రుడు మొసలి బారినుంచి రక్షించమని కోరుకుంటే వారిలో ఎవరైనా ఆ పనిచేయగరని... కానీ అతడు కోరుకున్నది ముక్తి కావడంతో అది వారి పరిధిలో లేని అంశం కావున వారంతా చూస్తూ ఉండిపోయారని చెప్పారు. భక్తికి పరాకాష్ఠ అద్వైతమని, పరమాత్మ వినా అన్యం మరొకటి లేదనే విషయం తెలియడమే అద్వైత దర్శనమని బ్రహ్మశ్రీ సామవేదం చెప్పారు. సైన్స్‌ అభివృద్ధి చెందే కొద్దీ అద్వైతం సత్యమనేది కూడా రూఢ అవుతున్నదని తెలిపారు. దర్శనానికి ఇంద్రియశక్తి అవరోధమని, భగవదనుభూతి భగవదైక్యం రెండూ ఒక్కటే అని... అదే అద్వైతమని పేర్కొన్నారు. అన్ని ఇంద్రియాలనుంచీ ప్రాణశక్తిని విడిపించుకొని హృదయంలోకి తెచ్చి నింపుకొవడం ... నువ్వు తప్ప మరొకటి లేనేలేదని అక్కడ భగవంతుని దర్శించగలగడం అదే అద్వైత సిద్ధి అన్నారు. గజేంద్రుడి చరిత్ర చెప్పేది అదేనని... అతడి నిర్విశేష బ్రహ్మస్తుతిని తెలుసుకున్న తర్వాత కూడా మొసలి పట్టునుంచి రక్షణ కోసమే అతడి ఆర్తి అని భావిస్తే అంతకంటే అవివేకం ఇంకొకటి ఉండదని స్పష్టం చేశారు. భగవంతుడు అందరినీ వారి వారి కర్మ కొద్దీ చూస్తే, తన భక్తులను మాత్రం కృప కొద్దీ చూస్తాడన్నారు. గజేంద్రుని ఆర్తికి, శరణాగతికి, మోక్షపిపాసకు భగవానుడు దిగిరావడం ఇందుకు నిదర్శనమన్నారు. శరణాగత భక్తికి సమగ్ర వ్యాఖ్యానమే గజేంద్రమోక్షణం అని సామవేదం ప్రతిపాదించారు. సగుణ నిర్గుణ బ్రహ్మ తత్వాన్ని కూడా దీనికి సమన్వయించుకోవచ్చని తెలిపారు. ‘కలడో లేడో... ’ అని సందేహం వ్యక్తం చేసినట్లుగా పోతన భాగవతంలో కనిపించే పద్యాలు మూలములో లేవన్నారు. గజేంద్రుడికి భగవంతుడి ఉనికిపై ఎట్టి సందేహం లేదన్నారు. అయితే మహర్షి అయిన పోతనగారు కొన్ని పద్యాలు మనకోసం మనస్థాయిలో రాసినట్లుగా ఇక్కడ అర్థం చేసుకోవాలన్నారు. అదేవిధంగా ‘అల వైకుంఠపురిలో నగరిలో ఆ మూల సౌధమ్ములో.. ’ అనే పద్యం గానీ... సిరికిం జెప్పడు.. శంఖుచక్రమున్‌ చేదోయి సంధింపడు...’ అనే పద్యం గానీ మహాకవి, భాగవతోత్తముడు అయిన పోతన దర్శనానుభూతి విశేషాలే తప్ప వ్యాసభాగవత మూలములో కనిపించవని వెల్లడించారు. పోతనగారు రాసింది కేవల అనువాదం కాదని, అనుభవ భాగవతమని ఈ సందర్భంగా సామవేదం వారు ప్రస్తుతించారు. మూల భాగవతంలో చెప్పినదాని ప్రకారం వేదాలే రెక్కలుగా వేదపురుషుడైన గరుత్మంతుడు వేదమంత్ర ధ్వనితో ఆగమించగా... వేదప్రతిపాదిత పరమాత్మ ఆ గరుడునిపై అధిరోహించి వచ్చాడని ఉన్నదంటూ... అత్యద్భుతంగా వర్ణించారు. సభాప్రాంగణంలో మంద్రమైన గాలి వీస్తుండగా చిక్కనైన గజేంద్రమోక్ష ఘట్ట వర్ణన అద్వితీయమై భాసించింది. గజేంద్రుడి అనితర భక్తికి, భగవానుని అమేయ వాత్సల్యానికీ పరవశించిన కను చెమరుస్తుండగా.. ఈ ఘట్టం ముగింపు దశకు చేరింది. పరమాత్మను చూస్తూనే సర్వం స్తంభించిపోయిన గజేంద్రుడు నోటమాట రాక అప్రతిభుడయ్యాడని... అతి కష్టంపై ఆయన అనుగ్రహం చేతనే... ‘నారాయణ అఖిలగురో భగవన్‌..’ అంటూ గద్గద స్వరంతో పిలిచాడని భాగవత వాక్కును వివరించారు. స్వామికి ఏమివ్వాలా అని చుట్టూ చూసిన గజేంద్రుడు... తమ మంద సరస్సును అల్లకల్లోలం చేయగా స్వర్ణకమలాలన్నీ చెల్లాచెదరు కావడం చూసి విషణ్ణుడవుతాడని... అప్పుడా పరమాత్మే చూపినట్లుగా ఓ స్వర్ణకమం కానరాగా దానిని తొండంతో ఎత్తి భగవంతుడికి సమర్పించాడని ఉద్విగ్నభరితంగా వివరించారు. గజ ప్రాణావనోత్సాహి అయిన పరమాత్మ సుదర్శన చక్రం విడిచి మొసలిని సంహరించగా అందుండి శాపవిమోచనుడైన ఒక గంధర్వుడు వచ్చాడు. అతడు పరమాత్మకు ప్రదక్షిణ చేసి తన లోకానికి నిష్క్రమించాడు. ఆ తదుపరి పరమాత్మ అమిత వాత్స్యంతో గజరాజు తల నిమిరి... ఈ గజేంద్రమోక్షం అద్వితీయమని పలికాడు. ఈ ఘట్టమందలి నామవస్తుగుణప్రదేశ విశేషాలతో సహా దీనిని తెలుసుకున్నవారు, నారదుడు, ప్రహ్లా