కమల్ పార్టీ పేరు మక్కళ్‌ నీది మయ్యమ్‌


తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. నటుడు కమల్‌ హాసన్‌ తన రాజకీయ పార్టీ పేరును ‘మక్కళ్‌ నీది మయ్యమ్‌’ (జస్టిస్‌ ఫర్‌ పీపుల్‌) గా వెల్లడించారు. మదురైలో ఒత్తకడై మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన తన పార్టీ పేరు, జెండాను వేలాది మంది అభిమానుల మధ్య ఆవిష్కరించారు. తెలుపు రంగు జెండాలో ఎరుపు, నలుపు రంగు మిళితమైన ఉన్న జెండాను తన పార్టీ జెండాగా కమల్‌ ఆవిష్కరించారు. చేయి చేయి కలిపి ఉన్నట్లు ఈ జెండాలో కనిపిస్తోంది. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ సభకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొత్త పార్టీ పేరును కమల్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. maiam.com పేరుతో తన పార్టీ అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఇదే పేరుతో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలను తెరిచారు. కొత్త పార్టీని పెట్టినందుకుగాను పలువురు వేదికపైకి వచ్చి కమల్‌కు అభినందనలు తెలిపారు. ఈ పార్టీ ఏర్పాటు తనకు ఎన్నో ఏళ్ల లక్ష్యమన్నారు. ఇది ప్రజల పార్టీ అన్నారు. నేను ఇందులో ఓ భాగం మాత్రమే అని చెప్పుకున్నారు. మీకు నేనేదో చెప్పడానికి నేను రాలేదు. ప్రజలకు సలహాలు చెప్పే నాయకుడిని కాదు. ప్రజల నుంచి సలహాలు తీసుకునే వ్యక్తిని. ఈ ఒక్కరోజుతోనే కార్యక్రమం ఆగిపోదు. నేను నాయకుడిని కాదు.. ప్రజల చేతిలో ఉపకరణాన్ని. మీకు సేవ చేసేలా నన్ను మార్గదర్శనం చేయండి... అన్నారు. అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన అభిమతం’ అని కమల్‌ పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం