శేషాచలం ఎన్ కౌంటర్ వెనుక అసలు కథేమిటి?


(తెలుగు పరివార్ లో 2015 ఏప్రిల్లో నా ఆర్టికల్ ఇది... ఇప్పుడు ఇరా లో పోస్ట్ చేస్తున్నాను... దీక్షితుల సుబ్రహ్మణ్యం) శేషాచలం అడవుల్లోని ఎన్ కౌంటర్ విషయంలో లోతైన చర్చ జరగాలి. ఎన్ కౌంటర్ ఏదైనా సరే ...అక్కడ చట్టం అతిక్రమింప బడుతుంది. అక్కడ మానవ హక్కులు హరింప బడతాయి.. ఇది మౌలిక సత్యం. ఎందుకంటే.... చంపడం అంటేనే మానవ హక్కుల హరణం కాబట్టి. కానీ చచ్చిన వాడు దోషి అయితే (మన దృష్టిలో) ఒకలా.. నిర్దోషి అని మనం భావిస్తే ఇంకోలా స్పందిస్తూ ఉంటాం. ఒక్కోసారి ఎన్ కౌంటర్ జరిగితే,.. భలే పని చేశాడ్రా అని సీఎమ్ ని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మనం ఎప్పుడూ బాధితుల పక్షానే ఆలోచించాలి. కానీ ఒక్కోసారి వాస్తవం ఇంకా దారుణంగా ఉంటుంది. తిరుమల పరిసరాల్లోని అడవులు అందులోని అపార ఎర్ర చందనం కలప స్మగ్లర్లకు కల్పవృక్షంగా మారింది. పోలీసులు ఎప్పుడు వెదికి పట్టుకున్నా వందల సంఖ్యలో స్మగ్లర్లు దొరుకుతున్నారు.. కానీ వీరందరూ కూలీలే. ఎపుడూ స్మగ్లర్లు సీన్ లోకి రారు. కూలీలే ఇక్కడ వందల సంఖ్యలో దొరుకుతారు. ప్రభుత్వం, పోలీసుల నుంచి ఎప్పుడైతే వీళ్ళకి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయో.. ఇక అప్పటినుంచీ శేషాచలం అడవులను కాల్చేయడం మొదలైంది. అడవులు వాటంతట అవి కాలిపోతాయా? స్మగ్లింగ్ గ్యాంగ్ లు చేసిన నిర్వాకమే అదంతా..! వీళ్ళని ఆపేది ఎవడు? అక్రమంగా ఎర్ర చందనం నరికివేత, రవాణా... అలాగే గంజాయి సాగు, రవాణా వంటివి నేరాలని తెలియదా వీళ్ళకి? అంత అమాయకులా యిన్నేసి వందల మంది? ఎర్ర చందనం చెట్లు నరికి, మోసుకు వెళ్లి, లారీల్లో లోడ్ చేసి పంపడం ఉపాధా? దీనిలో ఎంతో రిస్క్ ఉందని తెలుసు.. వీళ్ళు పొందే ప్రతిఫలం చాలా ఎక్కువే (కూలీ తో పోలిస్తే). వాళ్ళు కూలీలా? కాదు.. కేవలం వీళ్ళు స్మగ్లర్ల వద్ద సబ్ కాంట్రాక్టర్లు. వీళ్ళను కూలీలు అంటే గనక నిజంగా కూలీలను అవమానించినట్టే. ఎందుకూ అంటే కూలీలు కేవలం బతుకు తెరువుకి కూలే తీసుకుంటారు... పైగా వాళ్ళు నేరాలు చేయరు. ఇక్కడ వీళ్ళు చేస్తున్నది పక్కా నేరం.. స్మగ్లింగ్.... ఎవడైనా అడ్డు వస్తే చంపేస్తారు. అటవీ అధికారుల తలలు నరికేస్తారు.. పోలీసుల్ని, ప్రభుత్వాల్నీ బెదిరించడానికి, పక్కదారి పట్టించడానికి అడవులని కాల్చేస్తారు... ఇదీ వీళ్ళ అక్రమాల నైజం. ఎన్ని సార్లు పట్టుకున్నా అడవుల్లో దొరికేది కూలీలే. వందల మంది దొరుకుతారు.. వీళ్ళని లారీలు మాట్లాడి కోర్టులకి తిప్పాలి.. భోజనాలు, కాఫీ, టీలూ భరించాలి. నిజంగా చెప్పాలంటే ఈ ఖర్చులకి ఆయా పోలీసులు కూడా స్మగ్లిన్గే చెయ్యాలి.. ఎందుకంటే వీటికి ప్రభుత్వం నిధులు ఇవ్వదు మరి!! ఆంధ్రాలో ఎన్ కౌంటర్ జరిగింది.. ఎక్కడో తమిళనాడు లో ఉన్న కూలీలను ఇంటినుంచి తీసుకెళ్ళి ఆంధ్రా ప్రభుత్వం చంపేయలేదు. వాళ్ళు అక్రమ ఉపాధి మార్గంలో ఉన్నారు కాబట్టి పోలీసు చర్యకి బలయ్యారు. ఇది ప్రాథమిక సత్యం. దీనికి తమిళనాడు ప్రభుత్వం, మన రాజకీయ పార్టీలు బేసిగ్గా అంగీకరించాలి. అయితే పోలీసుల వద్ద ఎన్కౌంటర్ మినహా మరో మార్గం లేదా? వీళ్ళ వెనుక పెద్ద తలకాయల్ని నిజంగా ప్రభుత్వం పట్టుకోలేదా అనేది వేరే చర్చ. అది జరగాలి. కచ్చితంగా పెద్ద తలల్ని వదిలేసి చిన్న వాళ్ళని బలి పెట్టడం తప్పే. కానీ ఒక్క తమిళనాడు నుంచే ఎందుకు ఇలా వందలాది మంది ఒక ఉద్యమంలా వరదలా రోజూ తరలి వచ్చి వందల వృక్షాల్ని నరికేస్తున్నారు? అడవులు కాల్చేస్తున్నారు...? ఎవరున్నారు వీళ్ళ వెనుక? ఎన్ కౌంటర్ జరగ్గానే పోలీసులని దోషుల్ని చేసే ముందు అసలు చనిపోయిన వాళ్ళు నిజంగా నిర్దోషులా? అనేది కూడా బాధ్యతగానే ఆలోచించాలి. ఎందుకూ అంటే అక్కడ జరుగుతున్నది అసాధారణ నేరం. దానికి ప్రతి చర్య కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది ఎప్పటికైనా.. లేకపోతే చట్టం అంటే ఆటగానే మారిపోతుంది. తప్పుడు మార్గంలో వెళ్ళేవాడు అదనపు ఆదాయం పొందుతాడు.. అలాగే ఎప్పటికైనా మూల్యం కూడా చెల్లించక తప్పదు. కొన్ని మరణాలు, కొన్ని ముగింపులు కొందరికైనా కనువిప్పు కావాలి. చనిపోయిన వారిపై సానుభూతి ఉన్నా.. అక్కడ జరుగుతున్న దారుణ నేరాలతో పోల్చినపుడు పోలీసుల కఠిన వైఖరిని కూడా ఖండించలేకపోతున్నాను. బాధ్యత అనేది అందరికీ ఉండాలి. ఒక్క పాలకులకి, పోలీసులకే కాదు.. మీడియా కి, అన్ని రాజకీయ పార్టీలకి, పౌరులకీ కూడా..! ఇంత జరిగాకానైనా ఆంధ్రా ప్రభుత్వం ఈ స్మగ్లింగ్ వెనుక అసలు పెద్దల్ని టచ్ చేయకపోతే మాత్రం నిస్సందేహంగా తప్పు చేసినట్టే. ఆ దిశగా ఇప్పటికైనా ఒక అడుగు ముందుకు వేస్తే ఈ చర్యలోని అనివార్యత అర్థం అవుతుంది. లేకుంటే ఇది ఒక బూటకపు ఎన్ కౌంటర్ గా మాత్రమే చరిత్రలో మిగిలిపోతుంది.

ముఖ్యాంశాలు