న్యూక్లియర్‌ ఫోర్స్‌ ట్రీటీ (ఐఎన్‌ఎఫ్‌) కి ట్రంప్ టాటా


Trump

1987 నాటి ఇంటర్మీడియట్‌ రేంజ్‌ న్యూక్లియర్‌ ఫోర్స్‌ ట్రీటీ (ఐఎన్‌ఎఫ్‌) నుంచి వైదొలగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేడు నెవడాలో జరిగిన ఓ ర్యాలీలో ప్రకటించారు. ‘‘మేము ఆ ఆయుధాలను తయారు చేయగలం. మేము ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొని బయటకొచ్చేస్తున్నాం. రష్యా కొన్నేళ్లుగా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. దీనిపై ఒబామా ఎందుకు స్పందించలేదో నాకు తెలియదు. కనీసం అప్పుడే ఒప్పందం నుంచి బయటకు వచ్చేసి ఉండాల్సింది. మేము ఒప్పందాలను ఉల్లంఘించాలనుకోవడం లేదు. ఎవరైనా ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదు. మేము ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం. ఒప్పందాన్ని గౌరవించాము. కానీ, దురదృష్టవశాత్తూ రష్యా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. రష్యా ఆ ఆయుధాలను చేస్తోంది. చైనా కూడా అటువంటి ఆయుధాలనే చేస్తోంది. మేము మాత్రం ఒప్పందానికి కట్టుబడాలంటే ఎలా..? దీనిని మేము అంగీకరించం. మా సైన్యాన్ని అద్భుతంగా మలుచుకునేంత సంపద మా వద్ద ఉంది.’’ అని పేర్కొన్నారు.

1987లో నాటి అమెరికా, సోవియట్‌ అధ్యక్షులు రొనాల్డ్‌ రీగన్‌, మిఖాయిల్‌ గోర్బచేవ్‌లు ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందాన్ని చేసుకొన్నారు. దీని ప్రకారం 500 నుంచి 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులు( భూఉపరితలం నుంచి ప్రయోగించేవి) దళాల నుంచి తొలగించాలి. దీంతో ఇరు పక్షాలు దాదాపు 2,700 క్షిపణులను తమ దళాల నుంచి తొలగించాయి. అమెరికా పెర్షింగ్‌, క్రూయిజ్‌ మిసైళ్లు, సోవియట్‌కు చెందిన ఎస్‌ఎస్‌20 క్షిపణులు మ్యూజియంలకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా పసిఫిక్‌ సముద్రంలో చైనాతో జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగానే అమెరికా ఈ ఒప్పందం నుంచి వైదొలగినట్లు సమాచారం. ట్రంప్‌ నిర్ణయానికి బ్రిటన్‌ మద్దతు తెలిపింది

ముఖ్యాంశాలు