2జీ స్పెక్ట్రమ్ కేసులో రాజా, కనిమొళి నిర్దోషులు


2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి నిర్దోషులని పేర్కొంటూ పాటియాలా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. వీరితో పాటు ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న అందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున వారిని నిర్దోషులుగా తేల్చినట్లు న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టులో అప్పీల్‌ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగింది. అప్పట్లో డీఎంకేకు చెందిన ఎ. రాజా టెలికాం శాఖ మంత్రిగా వ్యవహరించారు. అయితే ఆయన నేతృత్వంలో జరిగిన 2జీ స్పెక్ట్రం కేటాయింపులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) ఆరోపించింది. ఈ అవినీతి వల్ల ప్రభుత్వానికి రూ.1.76లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. కాగ్‌ ఆరోపణలు చేయడంతో 2010లో ఎ. రాజాను అప్పటి ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టింది. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా 17 మంది నేతలు, కార్పొరేట్‌ సంస్థల అధికారులపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 2011లో రాజాను అరెస్టు చేశారు. ఏడాది పాటు జైల్లో ఉన్న రాజా ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

ముఖ్యాంశాలు