సచిన్ గొంతు వినకుండానే... సభ వాయిదా!


ప్రఖ్యాత క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్ 2012లో రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. అయితే ఆయన ఇంతవరకూ సభలో ఒక్కసారి కూడా మాట్లాడినది లేదు. ఆయన పార్లమెంట్‌ సమావేశాల్లో అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తుంటారు. దీనిపై గతంలో విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తానే స్వయంగా చర్చను ప్రారంభించేందుకు ‘రైట్‌ టు ప్లే అండ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఇన్‌ ఇండియా’ అనే అంశంపై సచిన్‌ సచిన్‌ నోటీసులిచ్చారు. అయితే ఇటీవల గుజరాత్‌ ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు చేస్తున్న ఆందోళన కారణంగా సచిన్ ప్రసంగానికి ఆటంకం ఏర్పడింది. గురువారం రాజ్యసభ సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. దీంతో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమవగానే సచిన్‌ తన అంశంపై ప్రసంగించేందుకు నిల్చున్నారు. అయితే ప్రతిపక్ష సభ్యులు మళ్ళీ విరుచుకుపడగా సచిన్స ప్రసంగం ఆగిపోయింది. గందరగోళం నడుమ ఛైర్మన్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. దీంతో సచిన్‌ మాట్లాడడం కుదర్లేదు. కాగా దీనిపై ఎంపీ జయా బచ్చన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ వేదికలపై భారత్‌కు పేరు తీసుకొచ్చిన సచిన్‌ తెందుల్కర్‌ను సభలో మాట్లాడనివ్వకుండా అవమానించడం సరికాదన్నారు. ఎజెండాలో సచిన్‌ ప్రసంగం ఉందని తెలిసినా వారు ఇలా ప్రవర్తించడం విచారకరమన్నారు.

ముఖ్యాంశాలు