ముందస్తు బెయిల్ కు అమలాపాల్ దరఖాస్తు


నటి అమలా పాల్‌ కారు కొనుగోలు సందర్భంగా సమర్పించిన డాక్యుమెంట్ల విషయంలో వివాదం ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విషయాన్ని కేరళ హైకోర్టు పరిశీలిస్తోంది. బుధవారం అమల కేరళ న్యాయస్థానంలో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. ఆమె స్వస్థలం కేరళలోని ఎర్నాకుళం. కొన్ని నెలల క్రితం అమల దాదాపు కోటి రూపాయల ఖరీదు చేసే బెంజ్‌ కారు కొన్నారు. అయితే డాక్యుమెంట్లలో కేంద్రపాలిత పుదుచ్చేరిలో నివసిస్తున్నట్లు అడ్రెస్‌ వివరాలను ఆమె ఉద్దేశపూర్వకంగా తప్పుగా సమర్పించి తక్కువ పన్ను చెల్లించారని ఆరోపణలు వస్తున్నాయి. కేరళ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ వద్ద అసిస్టెంట్‌ సెక్రటరీ సంతోష్‌ కుమార్‌ అమలపై కేసు పెట్టారు. ఆమె ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇవ్వడం వల్ల కేరళ రాష్ట్రానికి నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తాను పుదుచ్చేరిలోనే నివసించేదాన్నని తన సొంత ఇంటిని అద్దెకు ఇచ్చానని అమలాపాల్ తెలిపారు. తనపై ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. తమిళ నటుడు ఫహాద్‌ ఫాసిల్‌, నటుడు, రాజ్యసభ ఎంపీ సురేశ్‌ గోపిపై కూడా ఇలాంటి కేసులే నమోదయ్యాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం