2 జి కేసు దర్యాప్తు అంతా లొసుగులే!


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జి స్పెక్ట్రం కుంభకోణం కేసు దర్యాప్తు విషయంలో సంబంధిత విభాగాల తీవ్ర నిర్లక్ష్యం బట్టబయలైంది. స్వయంగా న్యాయమూర్తే ఈ విషయాన్ని ఎత్తిచూపడం గమనార్హం. టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా 17 మంది ఈ కేసునుంచి నిర్దోషులుగా బయటపడిన విషయం విదితమే. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చింది. సరైన సాక్ష్యాలు లేనందువల్లే వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ తెలిపారు. సాక్ష్యం కోసం తాను ఏడేళ్లుగా ఎంతో ఎదురుచూశానని, అయినా తన ఎదురుచూపులు సఫలం కాలేదని వాపోయారు. ఎంతో పాపులారిటీ వచ్చిన ఈ కేసులో తీర్పు కోసం అందరూ ఆతృతగా ఎదురుచూశారని సైనీ అన్నారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారుల తీరును న్యాయమూర్తి ఎండగట్టారు. కోర్టుకు ఇచ్చిన కొన్ని పత్రాల్లో సీనియర్‌ అధికారుల సంతకాలే లేవన్నారు. తుది విచారణ సమయంలో సమర్పించిన పత్రంలో అయితే అసలు ఎవరి సంతకమూ లేదన్నారు. ఎవరూ సంతకం చేయకపోతే ఆ డాక్యుమెంట్‌కు విలువ ఏముంటుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. 2జీ కుంభకోణం కేసులో న్యాయస్థానం 1,552 పేజీల తీర్పును వెలువరిచింది. ఏడేళ్లుగా అన్ని పనిదినాల్లో తాను కోర్టుకు వచ్చానని, వేసవి సెలవుల్లోనూ పనిచేశానని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో తగిన సాక్ష్యం ఎవరైనా అందిస్తారేమో అన్న ఆశతో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు కోర్టు గదిలోనే కూర్చుని ఎదురు చూశానని తీర్పు ప్రతిలో న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే ఒక్కరు కూడా సాక్ష్యాన్ని తీసుకురాలేదని, ఊహాగానాలనే చెప్పారు తప్ప.. నేరాన్ని సాక్ష్యాలతో రుజువుచేయలేకపోయారని ఆయన తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం