మోదీ ముంగిట అగ్ని పరీక్ష !

December 21, 2017

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిజమైన సవాల్ ఇప్పుడు ఎదురైంది. మరో ఏడాదిలోపు ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత ఆర్నెల్లలోనే దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు (లేదా వీటన్నిటినీ కలిపే నిర్వహించవచ్చు) జరగనున్న నేపథ్యంలో.. మొట్టమొదటి సారి నరేంద్ర మోదీ వ్యక్తిత్వంపై, ఆయన నిజాయితీపై  దేశ ప్రజల్లో, ముఖ్యంగా ఆయనను అభిమానించే వారిలో సందేహాన్ని రేకెత్తించిన సందర్భం తలెత్తింది. ఇప్పుడు ఈ సందేహం నివృత్తి కాకపోతే దేశప్రజలు మోదీని కూడా సగటు రాజకీయ నాయకుడిగానే భావించే ప్రమాదం ఉంది. ఇంతకీ ఏమిటా అనుమానం అంటే... ఇటీవల నరేంద్ర మోదీ చెన్నై పర్యటన కు వెళ్ళినప్పుడు అనూహ్యంగా డీఎంకే అధినేత కరుణానిధిని కలసి పరామర్శించి వచ్చారు. ఇప్పుడు తమిళనాట ఉన్న రాజకీయ వాతావరణాన్ని పురస్కరించుకొని చూస్తే.. రేపటి ఎన్నికల్లో డీఎంకే తో జట్టు కట్టడానికి బిజెపి కుతూహల పడుతున్నదని.. మోదీ పరామర్శ వెనుక ఆంతర్యం ఇదేనని అప్పట్లోనే పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేసారు. అదంతా బాగానే ఉంది.. అయితే 2 జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసును విచారిస్తున్న సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో నిందితులైన అప్పటి టెలికాం మంత్రి రాజా, ఎంపీ కనిమొళి తో సహా 17 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఇదే ఒక సంచలనం అయితే ఈ తీర్పులో న్యాయమూర్తి దర్యాప్తు అధికారుల పనితీరును ఏకి పారేయడం మరో సంచలనం అయింది.  ఏడేళ్లు తాను సాక్ష్యం కోసం ఎదురు చూసినా... ప్రతి పని దినంలోనూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ అందుబాటులో ఉన్నా కూడా దర్యాప్తు అధికారులు సాక్ష్యాలు సమర్పించలేకపోయారని తీర్పులో తప్పుపట్టారు. పైగా సిబిఐ అధికారులు సమర్పించిన డాక్యుమెంట్లు అసమగ్రంగా ఉన్నాయని, కొన్నింటిపై తగిన సంతకాలు కూడా లేవని వెల్లడించారు. దీనినిబట్టి ఈ కేసులో దర్యాప్తు అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది స్పష్టం అవుతోంది. యుపిఎ ప్రభుత్వ కుంభకోణాలనే  ప్రచారాస్త్రాలుగా మలచుకొని గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి దాని మిత్రపక్షాలు గెలుపొందా యనడంలో అతిశయోక్తి లేదు. దేశాన్ని నీతిమంతం చేస్తామని, నల్లధనాన్ని బయటకు తెస్తామని చెప్పిన మోదీ సర్కారు గడిచిన మూడున్నరేళ్లుగా 2 జి కేసు దర్యాప్తు విషయంలో ఐదు పైసల శ్రద్ధ కూడా ప్రదర్శించలేదు. అందుకు తీర్పే కాక, తీర్పు పాఠంలో న్యాయమూర్తి వెలిబుచ్చిన అభిప్రాయాలు కూడా తిరుగులేని నిదర్శనం. 2 జి కేసులో డీఎంకే నేతలు రాజా, కనిమొళి తదితరులు క్లీన్ చిట్ తో విడుదలైతే వచ్చే ఎన్నికల్లో తమిళనాట ఆ పార్టీకి లభించే సానుకూలత అనూహ్యం ఏమీ కాదు. తమిళ నాట నేరుగా ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేని బిజెపి కేవలం పొత్తు ద్వారా మాత్రమే ఉనికిని చాటుకోగలదు. అందుకు డీఎంకే ని భాగస్వామిగా ఎంచుకోవడం వల్లనే బిజెపి ఈ 2 జి కేసు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిందా? అనే అనుమానాలు ఇపుడు పొడసూపితే అది దేశ ప్రజల తప్పు కాదు. పైగా ఆ రాష్ట్రంలో డీఎంకే కి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న శశికళ, దినకరన్ వర్గాల ఆస్తులపై (వారి ఆస్తులపై మాత్రమే) ప్రత్యేకంగా జరిగిన ఐటీ దాడులు కూడా కేంద్ర సర్కారు వ్యవహార సరళి వెనుక ఏదో రహస్య అజెండా ఉందన్న అనుమానాలు రేకెత్తించింది.

దేశంలో ఇంతవరకూ ఉన్నవి రెండే వ