తాలిబన్ల మారణకాండ .. ఆఫ్ఘన్ లో 81 మంది మృతి


ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో మారణకాండ ప్రజ్వరిల్లింది. తాలిబన్‌ ఉగ్రవాదులు ఇక్కడ పంజా విసిరారు. వారి ఘాతుకాల్లో వివిధ ప్రాంతాల్లో మొత్తం 75 మంది మరణించగా.. ఆరుగురు ఉగ్రవాదుల్ని భద్రతాదళాలు సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత మట్టుబెట్టాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆరుగురు సాయుధులు ఆరంతస్తుల ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్ ని శనివారం రాత్రి స్వాధీనం చేసుకొని పలువురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వారు సృష్టించిన బీభత్స కాండలో మొత్తం 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళ సహా 14 మంది విదేశీయులు ఉన్నారు. 11 మంది అఫ్గాన్‌లోని ప్రయివేటు విమానయాన సంస్థ కామ్‌ఎయిర్‌ ఉద్యోగులు కాగా, ఉక్రెయిన్‌, జర్మనీ, కజకిస్థాన్‌, గ్రీకు దేశస్థులూ ఉన్నారు. 41 మంది విదేశీయులతో సహా 150 మంది గాయపడ్డారు. కాల్పులు జరిగే సమయంలో పలువురు భోజనం చేస్తున్నారు. గదుల్లో ఉన్నవారిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. కాల్పుల కారణంగా మంటలు రేగాయి. అనేకమంది వాటిలో చిక్కుకుపోయారు. కొందరు దుప్పట్ల సాయంతో తప్పించుకున్నారు. ఈ ఘటన అనంతరం ఆదివారం తెల్లవారుజామున హెలికాప్టర్‌లో వచ్చిన ప్రత్యేక దళం సైనికులు తాడు సాయంతో హోటల్‌ పైభాగంలో దిగి ఉగ్రవాదులపై ఎదురు దాడికి పాల్పడ్డారు. దాదాపు 17 గంటలపాటు ఇరుపక్షాల మధ్య కాల్పులు కొనసాగాయి. ఈ ఆపరేషన్ ఆదివారం రాత్రి పొద్దుపోయాకా ముగిసింది.. అప్పటికి ఉగ్రవాదులంతా హతమయ్యారు. కాస్త ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్ సమావేశాలు, వివాహ వేడుకలకు విందులకు ప్రత్యేకం. ఆదివారం ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ సమావేశం ఉండడంతో పలువురు ఇక్కడ బస చేశారు. శనివారం రాత్రి 9 గంటలు దాటిన తరువాత సమయంలో రైఫిళ్లు, రాకెట్‌ గ్రనేడ్లు పట్టుకొని, ఖరీదైన దుస్తుల్లో వచ్చిన తాలిబన్లు హోటల్లో చొరబడ్డారు. వారిలో ఇద్దరు మానవబాంబులు. తొలుత వారు వంటగదిని పేల్చివేశారు. తరువాత గదులవైపు వెళ్లి విదేశీయులను గుర్తించి మరీ కాల్పులు జరిపారు. మేం అఫ్గాన్లను కాల్చం అంటూ వారు కేకలు వేసినట్టు హోటల్ వర్గాలు తెలిపాయి. హోటల్ భద్రతా సిబ్బంది ఉగ్రవాదులను చూసి పారిపోయారని సమాచారం. తాలిబన్ల అధికారి ప్రతినిధి ముజాహిద్‌ ఈ దడి తమ నిర్వాకమేనని పేర్కొన్నాడు. ఇదే సమయంలో తాలిబన్ ఉగ్రవాదులు బాల్క్‌, ఫారా ఏరియాలో పలు గృహాలకు వెళ్లి 19 మంది పోలీసు అధికారులను బయటకు ఈడ్చుకుని వచ్చి కాల్చి చంపారు. హేరాత్‌లో కారుబాంబు పేల్చి 13మందిని చంపేశారు. ఈ అమానుష దాడులను భారత్‌ విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. భారత్‌, అఫ్గాన్‌ ఇరు దేశాలకూ పొరుగుదేశంలోని ఉగ్రవాద కేంద్రాలే సమస్యగా మారాయని పేర్కొంది.

ముఖ్యాంశాలు