జనం కోరుకునేది నిజాయితీ : ప్రధాని మోదీ


బడ్జెట్ లో ప్రజాకర్షక పథకాలేమీ ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ సూచనప్రాయంగా చెప్పేసారు. ప్రజలు ఉచితాలను కోరుకుంటారని భావించడం ఒక భ్రమ అని, నిజానికి జనం నిజాయితీతో కూడిన పరిపాలనను మాత్రమే కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఆంగ్ల న్యూస్‌ చానెల్‌ ‘టైమ్స్‌ నౌ’ మోదీ ఇంటర్వ్యూను ఆదివారం ప్రసారం చేసింది. ఇందులో ఆయన వివిధ అంశాలపై తన మనోభావాలను ఇలా ఆవిష్కరించారు. - రైతులను ఆదుకోవటం మనందరి బాధ్యత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు మరింత కృషి చేయాలి. మా ప్రభుత్వం చేస్తున్న కృషి, తీసుకొస్తున్న పలు పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌పై దృష్టిపెట్టాం. రైతు ఉత్పత్తులకు ఆగ్రో పరిశ్రమల ద్వారా వాల్యూ అడిషన్‌ చేసే ఆలోచన ఉంది. ఇప్పటికే అన్ని భూములకు సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చాము. యూరియా కొరతని సమర్థంగా అరికట్టాము. - ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ బడ్జెట్ ని ప్రజాకర్షకంగా మారుస్తామని అనుకుంటే అది సమంజసం కాదు. మా పాలనపై ప్రజలు తీర్పు ఇవ్వాలి తప్ప స్వల్పకాలిక ప్రలోభాలకు లోబడి కాదు. అయినా ప్రజలు ఉచితాలను కోరుకోరు. అయినా నేను మొదటినుంచీ ప్రజాకర్షణ విధానాలకు వ్యతిరేకిని. బడ్జెట్‌ విషయంలో ఆర్థిక మంత్రి, ఒక పెద్ద బృందం పనిచేస్తుంది. ఇందులో నేను ఏ స్థాయిలోనూ జోక్యం చేసుకోను. - జీఎస్టీ అనేది పన్నుల సంస్కరణలో ఓ గొప్ప ముందడుగు. దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ ఉండి తీరాలి. అయితే జీఎస్టీ విధానంలోని లోపాలను సరిదిద్దే చర్యలు తప్పక తీసుకుంటాం. దీనిని మరింత సమర్థవంతంగా మారుస్తాం. దీర్ఘకాలంలో ఇది దేశానికి మేలు చేస్తుంది. కొత్త మార్పులు వస్తున్నప్పుడు ఆర్నెల్లు, ఏడాది, రెండేళ్లు కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు... కానీ అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయి. ఇటువంటి విషయాల్లో స్వార్థ రాజకీయాలు మంచిది కాదు. జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలకూ ప్రాతినిధ్యముంది. కౌన్సిల్‌ భేటీలో సానుకూలంగా మాట్లాడిన వారే ఆతర్వాత బయటికొచ్చాక విమర్శలు చేస్తున్నారు. పార్లమెంటులోనూ ఇలాగె చేస్తున్నారు! ఇదేమి పద్ధతి? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. పెద్ద నోట్ల రద్దు మనదేశానికి సంబంధించి ఒక గొప్ప విజయగాధ. - మా హయాంలో ఉపాధి కల్పన జరగలేదా? దేశంలో ఓ స్వతంత్ర సంస్థ జరిపిన విచారణలో తేలిన విషయం ఇది... గత ఏడాదిలో 18–25 ఏళ్ల లోపున్న యువకులతో 70 లక్షల కొత్త ఈపీఎఫ్‌ అకౌంట్లు వచ్చినట్లు తేలింది. ఇది ఉపాధి కల్పన కాదా? రోడ్లు, రైలు లైన్ల నిర్మాణం పెద్ద ఎత్తున సాగుతున్నది. వాటిలో ఉపాధి పెరిగింది. ముద్ర యోజనలో 10 కోట్ల మందికి రూ.4లక్షల కోట్ల రుణాలు ఉపాధి కోసమేగా ఇచ్చాము. - ఏ రాజకీయ పార్టీయైనా దేశం తర్వాతే అన్నది నా నిశ్చితాభిప్రాయం. దేశంలో ఒక బాధిత వర్గానికి మేలు చేసే చట్టం వస్తే అడ్డుకోవడం ఏమిటసలు? ఆనాడు రాజీవ్ గాంధీజి 1985లో షాబానో కేసు విషయంలో చేసిన తప్పుని ఇపుడు కాంగ్రెస్‌ మళ్లీ మళ్లీ చేస్తోంది. ట్రిపుల్‌ తలాక్‌ బాధితులను ఆదుకుందామని మేము చూస్తుంటే కాంగ్రెస్‌ దీన్ని రాజకీయం చేద్దామనుకుంటోంది. ఇది మత సంబంధ విషయం కాదు. - ప్రపంచ నేతలతో సంబంధాలు, బలమైన విదేశాంగ విధానం ఇవన్నీ దేశ విశాల ప్రయోజనాల కోసమే. మనం బలమైన దేశాలతో సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకుంటున్నది పాకిస్తాన్‌ను ఏకాకి చేయటానికి మాత్రమే కాదు. అసలు ఏ ఒక్క దేశం గురించో మన విదేశాంగ విధానం నిర్దేశించుకోవడం సరైంది కాదు. ఇవాళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మానవతావాద శక్తులను ఒకేతాటిపైకి తెచ్చే కృషిని భారత్‌ సాగిస్తున్నది. మన దేశం 40 ఏళ్లుగా ఉగ్రవాద బాధిత దేశంగా ఉంది. ఇప్పుడు ప్రపంచానికి కూడా ఆ సెగ తగిలింది. అందుకే ఆ జాడ్యం నివారణకు కలిసొచ్చే శక్తులను కలుపుకుని మనం ముందుకెళ్తున్నాం. భారత్‌–పాక్‌లు కలిసి పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలపై పోరాటం చేయాలి. పరస్పరం పోరాడుకోవడం మాని కలిసి పోరాడితే త్వరగా విజయం సాధిస్తామని పాక్‌ ప్రజలకు నేను చెబుతున్నా. - దేశంలో జమిలీ ఎన్నికలు జరపాలని మా అభిప్రాయం.. అయితే ఇది మా ఒక్కరి చేతుల్లో లేదు. అన్ని పార్టీలు ఇందుకు కలిసిరావాలి. బడ్జెట్‌కు ఓ తేదీ ఉన్నట్లే, ఎన్నికలకూ ఐదేళ్లకోసారి ఓ తేదీ ఉండాలి. ఇందువలన ప్రజాధనం చాలా ఆదా అవుతుంది. - నేను ఏ పని చేసినా ఎన్నికల దృష్టితో చేయను. ఎన్నికల టైం టేబుల్ ని బట్టి నా పనుల టైం టేబుల్ ఉండదు. దేశ ప్రజలకు సేవ చేయటం కోసం ముందుగా నిర్ణయించుకున్న పనులు స్పష్టంగా ఉన్నాయి. వాటిని పూర్తి చేయటమే నా లక్ష్యం. - ఈ నాలుగేళ్లలో నాకు సరైన సంతృప్తిని ఇవ్వని కార్యక్రమాల్లో సంసద్ గ్రామ యోజన ముఖ్యం. ఈ కార్యక్రమం అనుకున్న స్థాయిలో అమలు కావడంలేదు. - కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అంటే ఆ పార్టీని నాశనం చేయడం అని అర్థం చేసుకోకండి. కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అంటే రాజకీయంగా అంతం చేయడం కాదు. అవినీతి, కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం, ప్రజలను మోసం చేయటం వంటి లక్షణాలున్న వంచనను, కాంగ్రెస్‌ సంస్కృతిని అంతం చేయడం. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న కాంగ్రెస్‌ సంస్కృతి వేరు. ఆ తర్వాత వారి ఆలోచనా ధోరణి వేరు. కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అంటే.. అది ఒకపార్టీని ఉద్దేశించిన మాట కాదు. అటువంటి దుష్ట ఆలోచనలతో నిండిన సంస్కృతిని నేను వ్యతిరేకిస్తున్నానని అర్థం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం