1 శాతం మందికే మూడొంతుల సంపద


భారత్‌ ఎక్కువమంది పేదలు ఉన్నసంపన్న దేశం అనే మాట మనకు ఎప్పుడో తెలుసు.. కానీ ఎంత సంపన్న దేశమో... ఆ సంపద ఎందరు ధనవంతుల చేతుల్లో చిక్కుబడిందో తెలిసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. గత ఏడాది కొత్తగా సృష్టించబడిన సంపద లో 73శాతం కేవలం ఒక్క శాతం మంది వద్దనే పోగుబడగా ... మిగిలిన 99 శాతం మంది 27 శాతం సంపదని పంచుకున్నారన్నమాట. ఇది ఆక్స్‌ఫామ్‌ సర్వే వెల్లడించిన కళ్ళు తిరిగే వాస్తవం. దేశంలో ఆర్థిక అసమానతలు ఎంత దారుణంగా పెరిగిపోతున్నాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. దేశంలో 73శాతం సంపద కేవలం ఒక్క శాతం మంది దగ్గర ఉండడం అంటే అది డేంజర్ సిగ్నల్ కిందే లెక్క. దాదాపు 67కోట్ల మంది భారతీయుల సంపద గత సంవత్సరం కేవలం ఒక్క శాతమే పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి కూడా ఇంతకంటే మెరుగ్గా ఏమీ లేదు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన మొత్తం సంపదలో 82శాతం కేవలం ఒక్క శాతం ధనికుల పరం అయిందని ఆక్స్ ఫామ్ సర్వే తెలిపింది. అలాగే సుమారు 3.7బిలియన్ల మంది ప్రజల ఆర్జనలో ఏ వృద్ధి నమోదు కాలేదట. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సులో ఈ ఆక్స్‌ఫామ్‌ సర్వేను నిశితంగా పరిశీలించనున్నారు. ప్రపంచాధినేతలు తమ చర్చల్లో ఆర్థిక, లింగ అసమానతల గురించే ఈసారి ఎక్కువగా మాట్లాడనున్నారు. గత ఏడాది ఆక్స్‌ఫామ్‌ సర్వేని చూస్తే భారత్‌లో ఒక్క శాతం మంది ధనికుల వద్ద దేశ సంపదలో 58శాతం కేంద్రీకృతమైందని, అలాగే ప్రపంచవ్యాప్తంగా సంపదలో 50శాతం ఒక్క శాతం మంది వద్దే ఉండిపోయిందని తేలింది. అయితే గత సంవత్సర సర్వే ప్రకారం చూస్తే ఇప్పటి పరిస్థితి మరింత దిగజారడం ఆందోళనకర పరిణామం. ఇలా ధనికులు మరింత కుబేరులవుతుంటే పేదల స్థితి మరింత దిగజారుతున్నది. సర్వే ప్రకారం.. 2017లో భారత్‌లో లక్షాధికారుల సంఖ్య బాగా పెరిగింది. 2010 నుంచి భారత్‌లో బిలియనీర్ల సంపద ఏడాదికి సగటున 13శాతం హెచ్చుతున్నది. సాధారణ ఉద్యోగి సందపతో పోలిస్తే ఇది ఆరు రెట్లు ఎక్కువ. భారత్‌లో ఓ ప్రముఖ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌ ఏడాదిపాటు సంపాదించినన మొత్తం గ్రామీణ ప్రాంతంలో కనీస వేతనం పొందే చిన్న ఉద్యోగి సంపాదించడానికి దాదాపు 941 ఏళ్లు పడుతుందని సర్వే తెలిపింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం