హోదా ఇస్తానంటే బిజెపితో కలుస్తాం : జగన్‌


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే బీజేపీకి మద్దతునివ్వడానికి తాము సిద్దమేనని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారు. సోమవారం ప్రజా సంకల్పయాత్ర 900 కిలోమీటర్ల మైలురాయి దాటింది. ఆయన సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ప్రధానమంత్రికి ఉందన్నారు. హోదాతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యం అని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే 2019 లో బీజేపీతో కలిసి నడుస్తాం అన్నారు. ఏపీ రాజకీయాల్లో జాతీయ పార్టీల ప్రభావం అంతగా లేదని చెప్పారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిందేమీ లేదని జగన్ విమర్శించారు. అమరావతికి వెళ్లి ప్రత్యక్షంగా చూస్తే ప్రభుత్వ డాబుసరి ప్రచారం వెనుక అసలు నిజం తెలిసిపోతుందని చెప్పారు. అమరావతి పేరుతో భూ కబ్జాల కుంభకోణం జరిగిందన్నారు. గత నాలుగేళ్లలో రాజధానిలో ఒక్క ఇటుకను కూడా పెట్టలేదన్నారు. అసలు చంద్రబాబుకు రాజధాని నిర్మించాలనే చిత్తశుద్ధి ఏమాత్రం లేదని ఆరోపించారు. చంద్రబాబు స్థానంలో ఏ గుడ్డి ముఖ్యమంత్రి ఉన్నా ఇంతకన్నా మంచి పాలన అందించగలరని వ్యాఖ్యానించారు. ప్రజలను పిచ్చివాళ్లను చేయడం బాబుకి వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. జాతీయ వృద్ధి రేటు 5 నుంచి 6 శాతం, ప్రపంచ వృద్ధి రేటు 2 నుంచి 3 శాతం ఉండగా, ఏపీ జీడీపీ 12 శాతం ఎలా ఉంటుందని జగన్ ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ పాత్ర ఏమీ ఉండదని ఈ రాష్ట్రంలో వారికి పునాదుల్లేవని జగన్ వ్యాఖ్యానించారు. ఇటీవల బీజేపీకి, టీడీపీకి మధ్య సుహృద్భావ వాతావరణం లోపించిందని చెప్పిన జగన్ బీజేపీ కనుక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఆ పార్టీతో కలిసివెళ్లడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. తనపై గల కేసులన్నీ రాజకీయ కుట్రపూరితమైనవని, వాటి వెనుక కాంగ్రెస్ ఉందని ఆరోపించారు.

ముఖ్యాంశాలు