విరోధి ఆస్తుల స్వాధీన చట్టంతో చైనాకు చెక్


భారత్‌ సరిహద్దుల్లోకి ప్రవేశించి, ఉద్రిక్తత సృష్టించడం.. ఆ తర్వాత వెనక్కి తగ్గడం.. మళ్ళీ కొన్ని రోజులకు ఇంకో చోట ఇదే పని చేయడం.. ఇదంతా చైనాకి అలవాటైన తతంగమే. కొన్ని నెలల కిందట డోక్లామ్‌లో అక్రమంగా ప్రవేశించిన చైనా సైనికులు ఏకంగా మూడున్నర నెలల తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యారు. యుద్ధం అనివార్యం అనే స్థాయిలో ప్రపంచానికి ఆందోళన కలిగించారు. అయితే భారత దేశ నాయకత్వం కనబరచిన తెగువ, స్థితప్రజ్ఞత ఇంకా ప్రాప్త కాలజ్ఞత కారణంగా చైనా ఇక్కడ వెనక్కి తగ్గక తప్పలేదు. చైనా డోక్లామ్ వద్ద రహదారి నిర్మించేందుకు యత్నించగా భారత దళాలు అడ్డుకున్నాయి. ఇప్పటికీ ఆ పక్కనా.. ఈ పక్కనా దొంగచాటుగా చైనా కొన్నేసి మీటర్ల దొంగదారులు నిర్మిస్తూనే ఉంది. ఇలా నిర్మించిన రహదార్లు, చైనా అక్రమంగా కట్టిన స్థావరాలు ఉపగ్రహ చిత్రాల్లో కూడా బయటపడ్డాయి. విపరీతమైన సైనిక, ఆయుధ పాటవం కలిగి ఉన్న చైనా పెద్ద దేశం, పేజీగా సంపన్న, అణ్వస్త్ర దేశం కావడంతో మిగతా ఇరుగుపొరుగు దేశాలు చైనాను ఎదిరించలేకపోతున్నాయి. ఇది అలుసుగా తీసుకుని డ్రాగన్ మరింత రెచ్చిపోతున్నది. అయితే ఇపుడు భారతదేశ నాయకత్వం, విదేశాంగ విధానం ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో బాగా రాటుదేలాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విరోధి ఆస్తుల స్వాధీన చట్టం చైనాకు వణుకు పుట్టిస్తున్న ఉదంతమే ఇందుకు నిదర్శనం. దేశ విభజన అనంతరం పాక్‌కు తరలివెళ్లిన వారి ఆస్తులను శత్రువుకు చెందిన ఆస్తులుగా గుర్తించారు. వీటిని కేంద్రప్రభుత్వం స్వాధీనం చేసుకునే సౌలభ్యం ఈ చట్టం ద్వారా కలుగుతుంది. 1962 చైనా యుద్ధం అనంతరం దేశంలోని చైనీయుల ఆస్తులను కూడా ఈ పరిధిలోకి చేర్చారు. 49 ఏళ్ల క్రితం రూపొందించిన ఈ చట్టానికి తాజాగా మరిన్ని సవరణలు తీసుకువచ్చారు. కొన్నేళ్లుగా భారత్‌లో చైనా సంస్థల పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. ఒక వేళ భారత్‌-చైనాల మధ్య సాయుధ పోరు, పరిమిత యుద్ధం తలెత్తితే భారత్‌లో వాణిజ్యం నిర్వహిస్తున్న పలు చైనా సంస్థల ఆస్తులను ఈ చట్టం కింద భారత్‌ స్వాధీనం చేసుకునే అవకాశం ఏర్పడింది. ఈమేరకు చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌లో ఒక కథనం ప్రచురితమైంది. చైనాకు చెందిన పలు మొబైల్‌ కంపెనీలు, కంప్యూటర్‌ పరిశ్రమలను భారత్‌లో విరివిగా యూనిట్లు నెలకొల్పాయి. పార్లమెంటరీ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం దేశ విభజన అనంతరం పాక్‌కు వెళ్లిపోయిన వారి ఆస్తులు దాదాపు 9,280 వరకు ఉన్నాయి. వీటి విలువ లక్ష కోట్లకు పైమాటే. కొన్ని కంపెనీల్లో వీరు గతంలో కొనుగోలు చేసిన వాటాల విలువ తాజా లెక్కల ప్రకారం దాదాపు మూడు వేల కోట్ల రూపాయలని తెలుస్తోంది. 1962 చైనా యుద్ధం అనంతరం చైనాకు వెళ్లిపోయిన వారి ఆస్తులు 150 అని కూడా అధికారులు గుర్తించారు. ఇవి ఎక్కువగా పశ్చిమబంగా, అసోం, మేఘాలయా, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్ణాటక, దిల్లీ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య యుద్ధం వస్తే భారత్‌లోని చైనా ఆస్తుల పరిస్థితిపై గ్లోబల్‌టైమ్స్‌ కథనం ఆందోళన వ్యక్తం చేసింది

ముఖ్యాంశాలు