రాష్ట్రవ్యాప్తంగా వైరలవుతున్న పుకార్లు

‘తమిళనాడు నుంచి 500 మంది దొంగలతో కూడిన ముఠాలు వచ్చాయి. చిన్నపిల్లల్ని, వృద్ధులను చంపేస్తున్నాయి. బయటికి ఒంటరిగా పంపించొద్దు..’, ‘రాజస్థాన్‌కు చెందిన కిరాతకులు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించారు. ఒంటరిగా మనుషులు దొరికితే చాలు చంపేసి గుండెని పీక్కు తింటున్నారు..’, ‘బిహార్‌ నుంచి దొంగలు వచ్చారు. చిన్నపిల్లల్ని ఎత్తుకుపోతున్నారు. ఈరోజు అనాజ్‌పూర్‌లో ఒకడు దొరికాడు. కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్‌. మీతో చిన్న మనవి. మీ వాట్సప్‌ గ్రూపులు ఎన్ని ఉన్నా ఈ మెసేజ్‌ పెట్టండి ప్లీజ్‌..’ ఇటీవలి కాలంలో ఈ తరహా సంక్షిప్త సందేశాలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. వీటికితోడు పోలీసులు, ప్రజలు కలిసి ఒక వ్యక్తిని చితకబాదుతున్న కొన్ని వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఆ వీడియోల్లో ఎంతగా కొడుతున్నా వారు స్పందించకపోతుండటం.. కొన్నింటిలో దురుసుగా ప్రవర్తిస్తూ తిరగబడుతుండటం.. లాంటివి కనిపిస్తుండటంతో అందరిలో గందరగోళం నెలకొంటుంది. . సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యే సమాచారానికి ఎంతవరకు వాస్తవికత ఉంటుందనేది చెప్పడం కష్టమే. ఎలాంటి అంశాన్నైనా.. ఎవరైనా ఈ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఆస్కారముంటుంది. ఇలాంటి ఏదైనా సమాచారంపై ఎవరైనా ఫిర్యాదు చేసి కేసు నమోదైతే తప్ప నిజానిజాలు బయటికి వచ్చే అవకాశం లేదు. కేసు దర్యాప్తు క్రమంలో ఆ వదంతిని ఎవరు పుట్టించారనే విషయాన్ని పోలీసులు కూపీ లాగుతారు. కానీ అది చాలా అరుదు. ఈ సోషల్ మీడియా వీడియోలు మానసిక రోగుల పాలిట శాపాలుగా మారాయి. సాధారణంగా వీధుల్లో తిరిగే మానసిక రోగులు చింపిరిజుట్టు, మాసిన దుస్తుల ఆహార్యంతోనే ఉంటారు. వారి ప్రవర్తన సాధారణ ప్రజలకు భిన్నంగానే ఉంటుంది. చెప్పే సమాధానాలు, వ్యవహారశైలి పొంతన లేకుండా ఉంటాయి. దొంగల ముఠాల సంచారం పుకార్ల నేపథ్యంలో ఇలాంటి వారిని చూసి ప్రజలు పొరపాటు పడుతున్నారు. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడం లేదనే కారణంతో చితకబాదుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే శనివారం రాత్రి కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు ఓ గుర్తు తెలియని వ్యక్తిని దొంగగా భావించి చితకబాదారు. కాగా ఈ ప్రచారాలు, పరిస్థితులపై రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తదితరులు స్పందించారు. దొంగల ముఠాల సంచారం గురించి ఇప్పటివరకు ఏ సమాచారం లేదని, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నవనీ పుకార్లేనని తెలిపారు. ప్రజలు ఏవైనా అనుమానకర పరిస్థితులు, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉంటె పోలీసులకు తెలియజేయాలన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇబ్బందికర పరిస్థితులు సృష్టించవద్దన్నారు.

ముఖ్యాంశాలు