రాజధాని నిర్మాణం .. ఇదీ మూడేళ్ళ పురోగతి


అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి అక్టోబర్ 22, 2018 నాటికి మూడేళ్లు. కేవలం ​రాజధాని పేరు చెప్పి ఎపి ప్రభుత్వం చేసిన అప్పులు సుమారు 13 వేల 500 కోట్లు. చేయబోతున్న (చర్చల్లోఉన్నాయి) అప్పులు మొత్తం మరో 13 వేల కోట్లు!. కేంద్రప్రభుత్వం 1500 కోట్లు ఇచ్చింది. మరో వెయ్యి కోట్లు రానున్నాయి. హడ్కో ఋణం 1275 కోట్లు వచ్చింది. ఇంకా ఆరువేల కోట్ల వరకూ రావాలి. ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్రప్రభుత్వం 4700 కోట్లు ఋణం అడిగింది. ఇది చర్చల స్థాయిలో ఉంది. 27,956 మంది రైతుల నుంచి 33,920 ఎకరాల భూసమీకరణ జరిగింది. సింగపూర్‌ సహకారంతో సీఆర్‌డీఏ ప్రాంతానికి, రాజధాని నగరానికి, సీడ్‌ కేపిటల్‌కి ప్రణాళిక రూపొందించారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు 63,771 ఫ్లాట్లు తిరిగి అప్పగించారు. మొదటి ఏడు నెలల కాలంలో 6 లక్షల చ.అడుగుల తాత్కాలిక సచివాలయం, శాసనసభ కట్టారు. కొండవీటివాగు వరద ముంపు నుంచి రాజధానిని కాపాడేందుకు రూ.222 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులు, వివిధ కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల కోసం 60 టవర్లలో 3840 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. ఇది మార్చి నాటికి పూర్తి కావచ్చని అంచనా. 1375 ఎకరాల్లో పరిపాలన, న్యాయ నగరాలను నిర్మిస్తారు. ప్రజా రాజధానిగా అమరావతిని ప్రపంచ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని రాష్ట్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2015 అక్టోబరు 22న రాజధాని నిర్మాణానికి ప్రధాని మోది శంకుస్థాపన చేశారు. నగర ప్రణాళిక, మౌలిక వసతుల ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రికార్డు వ్యవధిలోనే రాష్ట్రప్రభుత్వ పరిపాలనని అమరావతి నుంచి ప్రారంభించారు. బ్రిటన్‌కి చెందిన ప్రముఖ భవన నిర్మాణ సంస్థ నార్మన్‌ ఫోస్టర్‌ ఆధ్వర్యంలో రాజధానిలో పరిపాలన నగర ప్రణాళిక, ఐకానిక్‌ భవనాలుగా నిర్మించే శాసనసభ, హైకోర్టుతో పాటు, సచివాలయ భవనాల ఆకృతులని సిద్ధం చేసే పనులు జరుగుతున్నాయి. అయితే ఐకానిక్‌ భవనాల ఆకృతులు, పరిపాలన నగర ప్రణాళిక రూపకల్పనలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. మొదట జపాన్‌కి చెందిన మాకీ అసోసియేట్స్‌ని ఎంపిక చేశారు. మాకీని పక్కన పెట్టి, నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఆ ప్రక్రియకే ఏడాది పట్టింది. నార్మన్‌ ఫోస్టర్‌ని ఎంపిక చేసిన తర్వాత కూడా ఆకృతుల రూపకల్పన పూర్తి కాలేదు. 2018 డిసెంబరు నాటికే ఐకానిక్‌ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పేది. కానీ ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. డిజైన్లు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. 320 కి.మీ.ల మేర రహదారుల నిర్మాణం జరిగింది. ప్రధాన రహదారులు 34 కాగా వాటి పొడవు 320 కి.మీ.లు. వీటిలో 24 రోడ్ల పౌలు మొదలయ్యాయి (238 కి.మీ.లు). ఇబ్రహీంపట్నం వద్ద ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. 3.2 కి.మీ.ల పొడవున దీనిని రూ.1387 కోట్లతో చేపట్టారు.ఇది వచ్చే ఏడాదిన్నరలో పూర్తి కావచ్చు. ఐకానిక్‌ బ్రిడ్జి, రహదారుల పనుల విలువ: రూ.13,229 కోట్లు. రాజధాని నగరంలో 30 శాతం ఉద్యానవనాలు, జలాశయాలు, కాలువలు ఉండాలని ప్రణాళికలోనిర్దేశించారు. 80 కి.మీ. మేర అంతర్గత జల వనరులు, 100కిపైగా పార్కులు (కాలనీల్లో) అభివృద్ధి చేస్తారు. కొండవీటి వాగు, పాలవాగుల్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.800 కోట్లతో టెండర్లు పిలిచారు. 300 ఎకరాల్లో పీపీపీ విధానంలో శాకమూరు పార్కు, మల్కాపురం వద్ద 15 ఎకరాల్లో, అనంతవరంలో 35 ఎకరాల్లో పార్కుల అభివృద్ధి పనులు చేపట్టారు. రాజధానిలో వివిధ యూనివర్సిటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర సంస్థల నిర్మాణానికి సుమారు 1500 ఎకరాల్ని సీఆర్‌డీఏ కేటాయించింది. ఎస్‌ఆర్‌ఎం, వీఐటీ యూనివర్సిటీలు తొలి దశ భవనాలు నిర్మించి, కార్యకలాపాలను ప్రారంభించాయి. 4 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అమృత యూనివర్సిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సంస్థల నిర్మాణాలు జరుగుతున్నాయి. పది పాఠశాలలు, ఎనిమిది స్టార్‌ హోటళ్లు, బీఆర్‌షెట్టి, ఇండోయూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌, ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌, బసవతారకం క్యాన్సర్‌ ఫౌండేషన్‌ వంటి సంస్థల ఆస్పత్రులకు సీఆర్‌డీఏ స్థలాలు కేటాయించింది. 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి సింగపూర్‌ సంస్థల కన్సార్టియం మాస్టర్‌ డెవలపర్‌గా ఎంపికైంది. శంకుస్థాపన జరిగి ఏడాదిన్నరైనా పనులు మొదలవలేదు. బీఆర్‌షెట్టి, ఇండో యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ వంటి సంస్థలు స్థలాలు తీసుకుని ఏడాదిన్నర దాటినా ప్రాజెక్టులు ప్రారంభించలేదు.వీటికి గదిలో పెట్టడానికి రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటూంది.