చంద్రబాబుని తరిమి కొట్టండి - కేసీఆర్


పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వదల బొమ్మాళీ.. వదలా అంటూ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఒకసారి నేను తరిమికొట్టా.. ఇప్పుడు తరిమి కొట్టాల్సిన బాధ్యత మీదే. తెలంగాణ పోరాటం ఇంకా ముగియలేదు.’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచారంలో ప్రజకు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ స్థాపించి కేంద్రంలో నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే ఉంటూ కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తానని చెప్పారు. తెలంగాణ పోరాటం అయిపోలేదని, ఇక ముందూ కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చేతకాని కాంగ్రెస్‌ దద్దమ్మలు చంద్రబాబును తమ భుజాలపై ఎత్తుకుని మళ్ళీ తెలంగాణాకి తీసుకొస్తున్నారని, ఆయన రూపంలో మళ్లీ ప్రమాదం ముంచుకొస్తోందని చెప్పారు. మహా కూటమి పేరిట ఆయన మళ్లీ మీ ఇంట్లో దూరి మిమ్మల్నే తరుముతాడు అని హెచ్చరించారు. చంద్రబాబుకు ఓటేసి పాలమూరు ఎత్తిపోతలను ఆపుకొంటారా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ బుధవారం జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్‌, భువనగిరి, మెదక్‌ల్లో ఏకంగా ఐదు ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడారు. చంద్రబాబు అవసరం ఇంకా ఉందా.. స్వతంత్ర తెలంగాణపై ఆయన పెత్తనం అవసరమా!?’’ అని ప్రశ్నించారు. వేలమంది అమరులై, లక్షల మంది త్యాగాలు చేసి, చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెస్తే కొందరు అప్రయోజకులు అమరావతికి బానిసలుగా, తొత్తులుగా గులాంగిరీ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఆర్డర్లు కావాలంటే అమరావతికి పోవాల్నా? వాళ్లకు ఓటేస్తే.. దరఖాస్తులు పట్టుకుని విజయవాడ పోవాలే.. మరి పోదామా అక్కడికి!? కత్తి ఆంధ్రావాడిది అయితే పొడిచేది తెలంగాణవాడు అని ఉద్యమంలోనే చెప్పాను. ఇప్పుడు వచ్చేవాడు చంద్రబాబు. కానీ, ఆయన్ని తెచ్చేవాడు తెలంగాణవాడు. వచ్చేవాడిని తిట్టే అక్కర లేదు. కొట్టే అక్కర లేదు. డిపాజిట్‌ రాకుండా ఓడగొట్టాలి. తెచ్చినవాణ్ని మళ్లీ అడ్రస్‌ లేకుండాచేయాలి. రాజకీయంగానే దెబ్బకొట్టి చూపాలి’’ అని పిలుపునిచ్చారు. ఓటుతో కొట్టాలని అన్నారు. పాలమూరుని వలసల జిల్లాగా మార్చింది చంద్రబాబు. పాలమూరు ప్రాజెక్టును ఆపేయాలని ఢిల్లీకి లేఖలు రాసింది చంద్రబాబు... ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నాడని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. సిగ్గు లేని కాంగ్రెస్‌ నాయకులు చంద్రబాబును ఎలా తమ భుజాలపై మోస్తున్నారో ప్రశ్నించాలని కోరారు. పాలమూరులో 14 నియోజక వర్గాల్లోనూ టీఆర్‌ఎ్‌సను గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటే.. పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీరిచ్చే బాధ్యత నాది అని కేసీఆర్ స్పష్టం చేశారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం