కొత్తగా 19 విమానాశ్రయాల ఏర్పాటు

దేశంలో 19 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదాలు తెలిపినట్టు పౌర విమానయాన మంత్రి పి.అశోక్ గజపతి రాజు లోక్సభకు తెలిపారు. ఇందులో8 ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం, దగదర్తి; గోవాలోని మోపా, మహారాష్ట్రలో నవీ ముంబయి, సింధుదుర్గ్; కర్ణాటకలో హసన్; కేరళలో కన్నూర్, గుజరాత్లో ధోలెరాలో నిర్మించే విమానాశ్రయాలు పీపీపీ పద్ధతిలో వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వాలూ వీటిలో భాగం పంచుకుంటాయని తెలిపారు. వీటి నిర్మాణానికి రూ.27,000 కోట్ల పెట్టుబడి అవసరమని పేర్కొన్నారు. దేశీయంగా విమానయాన రంగం శరవేగంతో వృద్ధి చెందుతోందని అయన అన్నారు. 2014లో దేశీయంగా 395 విమానాలు సేవలందించగా.. ఇప్పుడు వాటి సంఖ్య 548కి పెరిగిందన్నారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఏడాదికి సగటున 50 విమానాల సంఖ్యను పెంచుతున్నామన్నారు. దేశీయ విమానయాన రంగం టర్నోవర్ 2015-16లో రూ.1.50 లక్షల కోట్ల స్థాయికి చేరిందని పౌర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా లోక్సభలో వెల్లడించారు. దేశీయంగా సేవలు అందిస్తున్న విదేశీ విమానయాన సంస్థల టర్నోవర్ కూడా ఇందులో కలిసే ఉందన్నారు. 2016లో దేశీయంగా విమానాల్లో 11 కోట్ల మంది ప్రయాణించారని, అదే సమయంలో రైళ్లలోని ఏసీ బోగీల్లో ప్రయాణించిన వారి సంఖ్య 12 కోట్లని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియాకు రూ.215 కోట్ల నిర్వహణ లాభాలు వచ్చాయని, దీంతో నికర నష్టాలు రూ.3,643 కోట్లకు తగ్గాయని తెలిపారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియాను గట్టున పడేసేందుకు వ్యూహాత్మక వాటా విక్రయం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి విదితమే. 2017 మార్చి 31 వరకు సంస్థ రుణాలు రూ.48,877 కోట్లు అని జయంత్ సిన్హా లోక్సభకు తెలిపారు.