గుజరాత్ సీఎంగా మళ్ళీ విజయ్ రూపాని


గుజరాత్‌ ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపాని తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. శుక్రవారం జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో విజయ్‌ రూపానీని తమ నాయకునిగా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్‌ పటేల్‌కు కూడా మళ్ళీ అవకాశం కల్పించారు. ఇటీవల గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 99 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. మరో స్వతంత్ర అభ్యర్థి భాజపాకు మద్దతివ్వడంతో ఆ సంఖ్య 100కు చేరింది. గుజరాత్‌లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరుసగా ఇది ఆరోసారి. ఈసారి ఎన్నికల్లో భాజపా మెజార్టీ గతంలో కంటే తగ్గింది. గుజరాత్‌ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని పార్టీ పరిశీలకునిగా భాజపా అధిష్ఠానం నియమించింది. విజయ్‌ రూపానీ నేతృత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లింది. అయితే మెజారిటీ తగ్గడం, రూపాని కూడా అతి కష్టం మీద గెలవడం వంటి కారణాలతో అయన మళ్ళీ సీఎం పదవికి ఎంపికయ్యే విషయంలో తొలుత సందిగ్ధత నెలకొంది. అయితే వాటన్నిటినీ అధిగమించి రూపాని మళ్ళీ తన పదవిని దక్కించుకున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం