శత్రు భయంకరం.. ఎస్‌–400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యవస్థ


రష్యా నుంచి ఎస్‌–400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యవస్థల కొనుగోలు ప్రక్రియలో భారత్ వేగం పెంచింది. దీనిపై రష్యాతో తుది చర్చలను ప్రారంభించింది. ఇప్పటికే భారత్‌ వద్ద ఆకాశ్, బరాక్‌–8 వంటి క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. ఇపుడు కొత్తగా ఎస్‌–400 ట్రయంఫ్‌ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని భారత్‌ భావించడానికి ప్రబల కారణాలే ఉన్నాయి. ఎస్‌–400 ట్రయంఫ్‌ అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి. ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్‌–400 ట్రయంఫ్‌ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను 39 వేల కోట్ల రూపాయలు వెచ్చించి రష్యా నుంచి కొనుగోలు చేయాలని భారత్‌ 2015లోనే నిర్ణయం తీసుకుంది. 2018–19 ఆర్థిక సంవత్సరం చివరిలోపు వీటి కొనుగోలు ఒప్పందాన్ని అమలు చేయాలని భారత్ భావిస్తున్నది. చైనా తర్వాత ఈ క్షిపణులను కొనుగోలు చేస్తున్న రెండో దేశం భారత్‌ కావడం విశేషం. చైనా మనకంటే ఏదై ముందే 2014లో ఈ క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌ మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థలని కొనుగోలు చేయాలనుకుంటున్నది. తొలి క్షిపణి వ్యవస్థ వెనువెంటనే భారత్‌కు చేరితే అనుబంధ యుద్ధ నిర్వహణ పరికరాల చేరికకు రెండేళ్ల సమయం తప్పదు. అంటే ఈ మొత్తం ఐదు క్షిపణులు భారత అమ్ములపొదిలో చేరడానికి నాలుగున్నరేళ్ల పడుతుంది. భారత్‌–రష్యాల మధ్య భారీ ఆయుధ ఒప్పందాల్లో ఇది ఒకటిగా చరిత్రలో నిలుస్తుంది. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలను 600 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్‌–400 ట్రయంఫ్‌ గుర్తించి వాటిని నాశనం చేస్తుంది. ఏకకాలంలో ఇది 36 లక్ష్యాలపై దాడులు చేయగలదు. ఎస్‌–300 క్షిపణుల కన్నా దీని వేగం రెండున్నర రెట్లు ఎక్కువ. భారత్‌ చేతికి ఈ క్షిపణులు వస్తే పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలను కూడా పరిధిలోకి తీసుకోవచ్చు. చైనాతో ఆయుధసంపద పరంగా దాదాపు సమంగా నిలిచేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుంది.

ముఖ్యాంశాలు