మోదీ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న దావోస్


ప్రపంచం భారత్ వైపు చూస్తోంది అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అది నిజమే అనడానికి నిదర్శనంగా ఇపుడు దావోస్ సదస్సు నిలుస్తోంది. ఇప్పుడు ప్రపంచ నేతలు, వాణిజ్య దిగ్గజాలైన వివిధ సంస్థల ప్రతినిధులు అందరూ చూస్తున్నది నరేంద్ర మోదీ వైపే! ఇవాళ్టి ప్లీనరీ సదస్సులో మోదీ కీలకోపన్యాసం చేయనున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక సదస్సులో తన తొలి ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నానని మోదీ ఇప్పటికే చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో రాణిస్తోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో 7 శాతం వృద్ధిని నమోదు చేయగలదని అయన అన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగడానికి భారత్ సరైన మార్గంలోనే పయనిస్తోందన్నారు. ఆయన వ్యక్తపరిచే దార్శనికత కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోందని ఈ సందర్భంగా పలు వాణిజ్య దిగ్గజ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. అమెరికా, చైనా తదితర అగ్రదేశాలు కూడా రక్షణాత్మక ధోరణి అవలంబిస్తున్న తరుణంలో స్వతంత్ర గళం వినిపించే అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తగా మోదీ రూపుదాల్చడం దావోస్ కి కొత్త ఉత్సాహం నింపుతోంది. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సుకి ఏటా హాజరవుతున్నభారత సిఈఓ లలో ఒకరైన ఉదయ్‌ కొటక్‌ మాట్లాడుతూ భారత్‌ బలమైన స్వేచ్చా ఆర్థిక వ్యవస్థ అని డబ్ల్యూఈఎఫ్‌కు స్పష్టమైన సంకేతాలు పంపాలని అభిప్రాయపడ్డారు. సరికొత్త భారత్‌ను నిర్మిస్తున్నామని ప్రపంచానికి చెప్పడానికి మన దేశానికి ఇదొక సువర్ణావకాశం అన్నారాయన. స్పైస్‌జెట్‌ సీఈఓ అజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ దావోస్‌లో చెప్పడానికి భారత్‌ వద్ద గొప్ప విజయ గాధ ఉన్నదని, దానిని ప్రపంచానికి చెప్పడానికి మోదీని మించిన నేత మరొకరు లేరని అభిప్రాయపడ్డారు. భారత్‌ ముఖ్య సంస్కరణల గురించి, యువ భారతం గురించి చెప్పడానికి మోదీయే సరైన వ్యక్తి అన్నారు. గతేడాది చైనాపై దావోస్ దృష్టి పడిందని, కానీ ఈసారి దృష్టి భారత్‌పై ఉంటుందని అన్నారు. దావోస్‌ సదస్సులకు తరచుగా హాజరయ్యే ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓ చందాకొచ్చార్‌ మాట్లాడుతూ ‘భారత్‌ వృద్ధి విస్తృతమై అన్ని రంగాలకూ వ్యాపిస్తోందన్నారు. అంతర్జాతీయ సమాజం ప్రధాని మోదీ ప్రసంగం కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నదన్నారు. మోదీ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‘అమెరికా ఫస్ట్‌’ అంశంతో చేసే ఉపన్యాసమే కీలకం అవుతుందన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగుతున్న ఈ సదస్సుకు 48 ఏళ్ల చరిత్ర ఉంది. మొత్తం 2000 మంది వ్యాపారవేత్తలు, 70 మంది దేశాధిపతులు ఈసారి హాజరుకానున్నారు. ఇందులో 130 మందికి పైగా భారత సీఈఓలు ఉన్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ, బజాజ్‌ ఆటో ఛైర్మన్‌ రాహుల్‌ బజాజ్‌, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా అధిపతి ఆనంద్‌ మహీంద్రా, టాటా సన్స్‌ సీఈఓ చంద్రశేఖరన్‌లు వీరిలో ఉన్నారు. సోమవారం సాయంత్రం మొదలైన ఈ సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నాయి.

ముఖ్యాంశాలు