రాజకీయాల్లోనూ రజనీ సూపర్ స్పీడ్ !


పార్టీ ఏర్పాటు చేస్తానని, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తానని ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ దిశ గా యమా స్పీడుగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ ప్రారంభానికి ముందే రజనీకాంత్‌ మహిళల్ని ఆకర్షించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. మక్కళ్‌ మండ్రం (ప్రజా ఫోరం)లో మహిళా విభాగం ఏర్పాటు చేశారు. దీనిని వ్యూహాత్మక చర్యగా పలువురు ప్రశంసిస్తున్నారు. రజనీకాంత్‌ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా 22 వేల సంఘాలుగా ఉన్నారు. మరో 30 వేల సంఘాలు నమోదు లేకుండానే పని చేస్తున్నాయి. వీటి సంఖ్య రెట్టింపు చేసేందుకు రజనీకాంత్‌ నిర్ణయించి ఆ మేరకు ఫోరాలు ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఆసక్తిపరులు ఆన్‌లైన్‌, సెల్‌ఫోన్‌ ద్వారా సభ్యులుగా చేరే అవకాశం కల్పించారు. యాప్‌ ప్రారంభించిన తొలి వారంలోనే లక్షమంది సభ్యులుగా చేరారు. ప్రస్తుతం ఆ సంఖ్య 60లక్షలు దాటింది. దానిని కోటికి పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు రజనీ సన్నిహితుల కథనం. ఈ పనికి పదిమంది సభ్యుల కమిటీని రజనీకాంత్‌ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రాష్ట్రంలో 32 జిల్లాల్లోనూ పర్యటించి రజనీ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తోంది. తొలిగా వేలూరు జిల్లాలో కమిటీ సమావేశాలు జరిపింది. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై వీటిల్లో చర్చించి వాటి సారాంశాన్ని నివేదికగా రజనీకాంత్‌కు అందించింది. అనంతరం జిల్లా ప్రజా ఫోరానికి కొత్త నిర్వాహకులను రజనీకాంత్‌ అనుమతి మేరకు ప్రకటించారు. ఇందులో మహిళా విభాగం కార్యదర్శి పదవి కూడా ఉంది. పార్టీ నియామకాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రజనీ ప్రజా ఫోరం తీర్మానించినట్టు చెబుతున్నారు. తమ రాజకీయ పార్టీ ప్రచారానికి మహిళలనే ప్రచారకర్తలుగా బరిలోకి దించడానికి రజనీ వర్గం పావులు కదుపుతోంది. రజనీ సిద్ధాంతాలు అట్టడుగు స్థాయి వరకు చేరాలంటే మహిళలే సమర్థులైన ప్రచారకర్తలని విశ్వసిస్తున్నట్టు సమాచారం. తిరుచ్చిలో రజనీ ఫోరంలో ‘రజనీ మక్కళ్‌ మగళిర్‌ మండ్రం’ (రజనీ ప్రజా మహిళా ఫోరం) అనే కొత్త విభాగాన్ని ప్రారంభించారు. జిల్లా, వార్డు, పంచాయతీ, పట్టణ పంచాయతీ, యూనియన్‌, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లతో పాటు, రాష్ట్రస్థాయిలో అన్ని విభాగాల నియామకాలు జరిగిన తర్వాతే పార్టీ పేరును రజనీ ప్రకటించనున్నారని తెలిసింది.

ముఖ్యాంశాలు