నరేంద్ర మోదీ దావోస్ ప్రసంగం అద్భుతం... అర్థవంతం

దావోస్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అద్భుతం.... నిజంగా నరేంద్రుడి(స్వామి వివేకానంద) అంశ ఆయనలో ఉందేమో అనిపించింది ఈ ప్రసంగం వింటుంటే. ఒక ఆర్ధిక సదస్సులో.. ప్రకృతి పరిరక్షణ, మానవ సంబంధాల ఆవశ్యకత.. మానవత్వం, ఆధ్యాత్మిక దృక్పథంతో సమస్యల పరిశీలన, భారతీయ ప్రజాస్వామ్య వైభవం.. భారతీయ తాత్విక చింతన.. ఇవన్నీ మాట్లాడి ఒప్పించడం..మెప్పించడం... అద్భుతం.. మహాద్భుతం! 55  నిమిషాల ఈ ప్రసంగం ఆద్యంతం అమోఘం. విని తీరాలి. వెల్త్ కె సాథ్ వెల్ నెస్ ... హెల్త్ కె సాథ్ జీవన్ కె హోల్ నెస్ (సమగ్రత) కావాలంటే మీరు భారత్ రండి... ప్రగతి తో పాటు శాంతి కోరుకుంటే మీరు భారత్ రండి...! ఇవీ ఈ ఉపన్యాసంలో మన ప్రధాని తుదిపలుకులు!!
భిన్నమతాలు, సంస్కృతులు, భాషలు కలిగిన భారతదేశంలో ప్రజాస్వామ్యం అందరినీ ఏకతాటిపై నిలుపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే భారతీయ ప్రజాస్వామ్యం తమకొక రాజకీయ విధానమే కాదు, జీవన శైలి కూడా అని చెప్పారు. దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రధాని కీలక ప్రసంగం చేశారు. 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ దావోస్‌లో ప్రసంగం తర్వాత మళ్లీ 20 ఏళ్లకు నరేంద్ర మోదీ ఈ వేదికపై ప్రసంగించడం విశేషం.  ప్రపంచ ఆర్థిక సదస్సులోని ప్రత్యేక ప్లీనరీలో మోదీ మాట్లాడుతూ..  మానవులంతా భూమిపుత్రులమనే మాటను గుర్తు పెట్టుకొని మనుగడ సాగించాలన్నారు. నేటి తరం సుఖం కోసం ప్రకృతిని ధ్వంసం చేయొద్దని హితవు పలికారు. ప్రకృతిని పరిరక్షించాలన్నారు. 1997లో భారత జీడీపీ 400 బిలియన్‌ డాలర్లు మాత్రమేనని, ఇప్పుడు అది ఆరు రెట్లకు పైగా పెరిగిందన్నారు. నాటికి నేటికి భారత ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. పరస్పర ఆధారిత సమాజ అభివృద్ధిలో ఆర్థిక వేదిక సదస్సు చుక్కానీలో వ్యవహరిస్తోందన్నారు. సాంకేతికపరంగా ఇంటర్నెట్‌, బిగ్‌ డేటాలతో ప్రపంచమంతా అనుసంధానమవుతుండగా.. సైబర్‌ పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేయడమే అసలైన సవాల్‌గా మారిందన్నారు. భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని మోదీ చెప్పారు. వసుధైక కుటుంబం అనేది భారతీయ తాత్విక చింతన అని చెప్పారు. వాతావరణ మార్పులు విశ్వం మనుగడకు సవాల్‌గా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. దేశాభివృద్ధి కోసం సాంకేతిక విజ్ఞానం సరైందే అయినప్పటికీ అది చెడు చేసేలా ఉండరాదన్నారు. ఉగ్రవాద సమస్య యావత్‌ ప్రపంచానికి పెను సవాళ్లు విసురుతోందన్నారు. సమ్మిళిత అభివృద్ధి అనేది  120 కోట్ల మంది భారతీయుల ఆశయమన్నారు. వ్యాపార అనుకూల ర్యాంకింగ్‌లో భారత్‌ స్థానం ఇటీవల గణనీయంగా మెరుగుపడిందని మోదీ అన్నారు.  ప్రపంచ ఆర్థిక ప్రగతిలో మరింత క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు. ఏ ఒక్క వర్గానికో కాకుండా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలను అందించాలనేది తమ విధానమని మోదీ అన్నారు. 

Facebook